ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఆర్థికంగా నిలదొక్కుకున్నాం
మాది పేద కుటుంబం. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త గిన్ని దేముడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాం. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నా కుమారుడు కూడా కూలి పనులకు వెళ్తున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. నేను విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గిన్నివానిపాలెంలో ఇంటి వద్ద చిన్న టిఫిన్ దుకాణం పెట్టాను. పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న చేదోడు పథకం కింద మూడేళ్లలో రూ.30 వేలు సాయం అందింది. ఆ డబ్బులు వ్యాపారంలో పెట్టాం. వ్యాపారాన్ని అభివృద్ధి చేశాం. అప్పులు తీర్చుకుంటున్నాం. ఆర్థికంగా నిలబడ్డాం. నా భర్తకు 60 ఏళ్లు నిండడంతో ఏడాది నుంచి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది. నా కుమారుడి కుమార్తెకు అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. ఈ ప్రభుత్వం మా కుటుంబంలో వెలుగులు నింపింది. – గిన్ని రమణమ్మ, గిన్నివానిపాలెం (ముప్పిడి శ్రీనివాసరావు, విలేకరి, పెదగంట్యాడ, విశాఖపట్నం)
వృద్ధాప్యంలో కొడుకులా ఆదుకున్నారు..
నేను లైట్లు, లాంతర్లు, బిందెలు, సిల్వర్ గిన్నెలకు మాట్లు వేస్తూ జీవనం సాగిస్తుంటాను. నేడు గ్యాస్ పొయ్యిలు, స్టీల్ గిన్నెలు వచ్చిన తర్వాత మాకు పని లేకుండా పోయింది. మాకు ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసేసరికి ఓపిక నశించింది. నేను, నా భార్య మాత్రమే మిగిలాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 17వ వార్డు పరిధిలో ఉంటున్నాం.
జీవనం సాగించడానికి పనులు లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఈ తరుణంలో నాకు పింఛన్ మంజూరైంది. నా భార్యకు వైఎస్సార్ చేయూత కింద ఇప్పటి వరకు రూ.56,250, వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇప్పటి వరకు రూ.10,500 వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న పింఛను, నవరత్నాల పథకాలతో ప్రస్తుతం ఏ లోటూ లేకుండా మా జీవనం సాగుతోంది.
రేషన్ కార్డుపై బియ్యం, కందిపప్పు వంటివి అందిస్తున్నారు. ఈ వయసులోనూ పిల్లలపై ఆధార పడకుండా నా కాళ్లపై నేను నిలబడ్డాననే ఆత్మ సంతప్తి కలుగుతోంది. జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో ఇంటి నిర్మాణం చేపడతాం. ఈ వృద్ధాప్యంలో కొడుకులా సీఎం జగన్ గారు మమ్మల్ని ఆదుకున్నారు. – కంచు సత్యనారాయణ, పాలకొల్లు (తోట రాంబాబు, విలేకరి, పాలకొల్లు సెంట్రల్)
ఉచితంగానే ఖరీదైన వైద్యం
నేను దుబాయిలో ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. చిన్నప్పుడే నా బిడ్డలు కందుల సౌమ్య, స్టీఫెన్ ఇద్దరూ తలసేమియా వ్యాధిబారిన పడ్డారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండంలో అమ్మాయి సౌమ్య ఇంటర్, అబ్బాయి స్టీఫెన్ ఐదో తరగతి చదువున్నారు. వారికి ప్రతినెలా రక్తమార్పిడి, వైద్యం కోసం రూ.35 వేలు వరకు ఖర్చయ్యేది.
వారికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడ్డాను. గత ప్రభుత్వంలో ఎలాంటి సహకారం అందలేదు. వైఎస్ జగన్‌అధికారంలోకి రాగానే నా బిడ్డల లాంటి వారికి ప్రతినెలా రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంటానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.20 వేలు పింఛన్ మంజూరు చేశారు. ప్రతి నెలా నా బిడ్డలిద్దరికీ చికిత్స చేయిస్తున్నాను.
ఇటీవల కుమారుడు స్టీఫెన్‌కు ఆపరేషన్ చేయించాను. కుమార్తె సౌమ్యకు ఆపరేషన్ అవసరమని, భారీగా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇటీవల మా ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డికి మా సమస్య వివరించాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేస్తానన్నారు. –కందుల నయోమయ్య, చినమనగుండం (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment