Corporation loans
-
నిరుద్యోగిత అంతం.. ప్రభుత్వ పంతం
సాక్షి, సాలూరు (విజయనగరం): అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. 2019– 20 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు సబ్సిడీల రుణాల మంజూరుకు ప్రకటన వెలువడింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 30న ధరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు గడువుగా నిర్ధారించింది. కార్పొరేషన్లు ఇవే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీ, వైశ్య, కాపు, వికలాంగులు, అత్యంత వెనుకబడిన కులాలు, ముస్లిం కార్పొరేషన్ల ద్వారా ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. 50 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తారు. దరఖాస్తు ఎలా? https://apobmms.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత వివిధ కార్పొరేషన్ల లింక్‌లు వస్తాయి. వాటిలో అభ్యర్థులకు సంబంధించిన కార్పొరేషన్‌పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత అందులోని వివరాలు నమోదు చేయాలి . గతంలో ధరఖాస్తు చేసుకున్న వారికి కూడా.. గత ఆర్థిక సంవత్సరంలో బీసీ, ఎస్సీ, కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరికి అప్పట్లో అధికారులు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా వరకూ టీడీపీ వారికే లబ్ధి చేకూరింది. మండలానికి పరిమిత యూనిట్లే కేటాయించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు రుణాలు తీసుకున్నారన్న విమర్శలు నాడు వినిపించాయి. ఈ క్రమంలో చాలా మంది అర్హులైన వారికి రుణాలు అందకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వీరంతా పెండింగ్ జాబితాలో ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో గతంలో దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందని వారు కూడా తిరిగి దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. భరోసా దొరికింది.. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులకే లోన్లు మంజూరయ్యేవి. వైఎస్సార్సీపీకి చెందిన వారిమన్న కారణంగా ఎన్నిసార్లు లోన్లకు దరఖాస్తులు చేసుకున్నా నాటి టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీలు రుణాలు మంజూరు చేయనివ్వలేదు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనకు ఆర్థిక సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలోనైనా రుణాలు మంజూరవుతాయని ఆశిస్తున్నాం. – గణపతి, దరఖాస్తుదారుడు, గడివలస గ్రామం, పాచిపెంట మండలం రుణ దరఖాస్తుల రెన్యువల్‌కు అవకాశం గత ఆర్థిక సంవత్సరంలో రుణ దరఖాస్తుల రెన్యువల్‌కు అవకాశం ఉంది. గతేడాది దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత దరఖాస్తునే రెన్యువల్ చేయించుకోవాలి. – రామారావు, ఎంపీడీఓ, పాచిపెంట మండలం -
మాజీమంత్రి అండతో దా‘రుణ’ వంచన!
మాజీ మంత్రి పరిటాల సునీత అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్రమార్జనకు తెరలేపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ఏడాది కిందటే బీరాలు పలికి అమాయకులకు రుణాలు మంజూరు చేయిస్తామని ఆశ చూపి డబ్బు దండుకున్నారు. అనంతరం ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందడంతో రుణాలు మంజూరు చేయించలేక చేతులెత్తేశారు. బాధితులు ఈ విషయమై నిలదీస్తే వారిపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సాక్షి, రామగిరి: గత తెలుగుదేశం పాలనలో వర్షాభావ పరిస్థితులతో పంటలు చేతికందక రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీడీపీ నాయకులు పలువురు రైతులకు, ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బు వసూలు చేసుకుని జల్సాలు చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత సొంత మండలమైన రామగిరిలో ఈ ఉదంతం వెలుగు చూసింది. రామగిరి మండలంలో పేరూరు మేజర్ పంచాయతీ. ఆ గ్రామం చుట్టుపక్కల కంబదూరు, కనగానపల్లి మండలాలలోనున్న గ్రామాల కంటే పెద్ద వ్యాపారకేంద్రం. వర్షాభావంతో వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కింద గొర్రెల యూనిట్ మంజూరు చేయిస్తామని, అలాగే ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరు చేయిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.1600 చొప్పున వసూలు చేశారని బాధితులు బావన్న, హనుమంతు, నరసింహులు, గంగయ్య, లింగమయ్య, హనుమంతు, రాఘవేంద్ర తదితరులు వాపోయారు. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగురాకులపల్లి, దుబ్బార్లపల్లి, పేరూరు గ్రామాలలోనే వందలాదిమంది ఇటువంటి బాధితులు బయటపడ్డారు. గొర్రెలు లేకుండానే ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ డబ్బులు దండుకున్న టీడీపీ నాయకులు గొర్రెల యూనిట్ మంజూరు చేయించకపోగా.. ఇన్సూరెన్స్ చేయించిన కార్డులు పంపిణీ చేశారని బాధితులు తెలిపారు. మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలా అన్యాయం చేయడం నాయకులకు మంచిది కాదని వాపోయారు. రెండేళ్లుగా స్పందించలేదు గొర్రెల యూనిట్కోసం రూ.1600 డబ్బులు చెల్లిచాం. రెండేళ్లు పూర్తవుతున్నా మాకు గొర్రెలయూనిట్ మంజూరు కాలేదు. ఈ విషయంపై పలుమార్లు టీడీపీ నాయకుల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందనా లేదు. – ఎం.సి.కుళ్లాయప్ప, ఏడుగురాకులపల్లి డబ్బులు వెనక్కు ఇవ్వలేదు గొర్రెలు ఇప్పించి మీకందరికీ న్యాయం చేస్తాం అంటూ ఒక్కొక్కరితో రూ.1600 వ సూలు చేశారు. ఇం తవరకూ గొర్రెలు ఇవ్వకపోగా, కనీసం మేంకట్టిన సొమ్మును కూడా వెనక్కు ఇవ్వలేదు. – బాసి రామాంజి, ఏడుగురాకులపల్లి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీదు మా గ్రామంలో చాలామందితో గొర్రెలు ఇప్పిస్తామని ఒక్కొక్కరితో రూ.1600 చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేశారు. యూనిట్ మంజూరు చేయలేదు. మా డబ్బులు వెనక్కు ఇవ్వలేదు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియడం లేదు. – అరక మారెన్న,ఏడుగురాకులపల్లి -
కౌలు రైతులకు అండగా ఉంటాం: ఉప ముఖ్యమంత్రి
సాక్షి, తూ.గో: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాకినాడ కలెక్టరేట్లో తొలిసారి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ నేపథ్యంలో రైతు రుణాల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ‘కౌలు రైతులకు సహాయం చేయకపోతే భగవంతుడు క్షమించడు. కౌలు రైతులకు ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందించలేకపోతున్నాయి. మన ప్రభుత్వంలో కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది’ అని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కౌలు రైతుల కోసం రెవెన్యూ శాఖ నూతన ప్రభుత్వంలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి, రైతుల పక్షాన నిలుస్తామన్నారు. కార్పోరేషన్ లోన్లు మంజూరు అయిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాలన్నారు. రీపేమెంట్ విషయంలో ఇబ్బందులు వస్తే ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. -
మైనారిటీ రుణాలపై.. అధికార పెత్తనం
కర్నూలు నగరంలోని ఖడక్‌పురాకు చెందిన మైమున్ బేగం (బాధితురాలి విన్నపం మేరకు పేరు మార్చాం) శారీ బిజినెస్ కోసం రూ.లక్ష రుణం కావాలని దరఖాస్తు చేసుకుంది. రుణం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు కూడా అంగీకరించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆమె మైనారిటీ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉంది. అయితే..ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. అధికార పార్టీ నేతల సిఫారసు లేకపోవడమే ఇందుకు కారణం. కర్నూలుకు చెందిన అధికార పార్టీ చోటా నాయకుడు ఇటీవలే మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తాను టీడీపీ ముఖ్య నేత అనుచరుడినని, అన్న చెప్పారు.. వీరికి రుణాలు మంజూరు చేయాలంటూ పాతిక మంది పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ఇంత మందికి ఒకేసారి రుణాలు ఎలా మంజూరు చేయాలో తెలియని స్థితిలో అధికారులు తల పట్టుకున్నారు. కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్ రుణాలపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి కోసం రుణాలకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారు. తాము చెప్పని వాళ్లకు రుణాలు ఇస్తే ఇక్కడ ఉద్యోగం చేసుకోలేరంటూ అధికారులను బెదిరించడానికీ వెనుకాడడం లేదు. వారి అనుచరులు, అనుయాయులకు మాత్రమే రుణాల మంజూరు కోసం సిఫారసు చేస్తున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,536 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ.46.02 కోట్ల సబ్సిడీ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం అరకొరగానే నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటివరకు రూ.16.07 కోట్లు విడుదల కాగా.. 2,269 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 2,267 మంది అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రుణాలు మంజూరైన వారిలో అత్యధిక శాతం అధికార పార్టీ నాయకుల నుంచి సిఫారసులు పొందిన వాళ్లే కావడం గమనార్హం. మంజూరు ప్రక్రియ ఇలా.. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందుకోసం నిర్ణీత గడువులోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్ కాపీ, ఇతర ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. మునిసిపాలిటీల్లో నివసించే వారైతే సంబంధిత మునిసిపల్ కార్యాలయం, గ్రామీణులైతే ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై దరఖాస్తుకు ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. అడిగింది ఇస్తేనే సిఫారసు అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సిఫారసు ఉంటేనే రుణాలు మంజూరవుతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు మునిసిపాలిటీలు/ మండల పరిషత్ కార్యాలయాల్లో అప్రూవ్ కావాలంటే అధికార పార్టీ నేతల అనుమతి తప్పనిసరిగా మారింది. అక్కడ ఎలాగో చెప్పుకుని దాటి వస్తే మైనారిటీ కార్పొరేషన్లో పెండింగ్ పెడుతున్నారు. అడిగినంత ఇస్తేనే సిఫారసు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎంపీడీఓ, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఎంపిక కోసం రూ.2వేల నుంచి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఐదేళ్లుగా అరకొరే జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లుగా రుణాలు అరకొరగానే మంజూరవుతున్నాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 2,165 మందికి గాను 1,304 మంది మాత్రమే మంజూరు చేశారు. అలాగే 2014–15లో కేవలం 360 మందికి, 2015–16లో 3,863 మందికి గాను 2,262 మందికి, 2016–17లో 2,395 మందికి గాను 1,323 మందికి మంజూరు చేశారు. 2017–18లో 2,578 మందికి, 2018–19లో 4,536 మందికి గాను ఇప్పటివరకు 2,269 మందికి మాత్రమే రుణాలిచ్చారు. -
రుణమా.. రణమా?
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అలా అతనొక్కడే కాదు జిల్లాలో వేలాది మంది కోరుకునేదీ అదే! కానీ అలా జరిగితే జన్మభూమి కమిటీలు ఊరుకుంటాయా? ఊహూ... టీడీపీ అనుకూలమా? ఏమైనా కమీషను ముట్టజెబుతున్నాడా? మనోడా కాదా? ఇలా అన్నీ చూసుకున్న తర్వాతే దరఖాస్తులు ముందుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి. లేదంటే గత నాలుగేళ్లు మాదిరిగానే ఈ ఏడాదీ ఆశాభంగం తప్పదు మరి! వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం యువతకు ప్రకటించిన రాయితీ రుణాలకు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వారిలో చాలామంది గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జన్మభూమి కమిటీలు సిఫారసు చేయకపోవడంతో నిరాశ తప్పలేదు. రుణాలు పొందే అవకాశం చేజారిపోయింది. దీంతో వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, ఎంబీసీ తదితర వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లింకేజీలతో రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా గడువు ముగిసిన సమయానికి బీసీ రుణాలకు 40 వేల వరకూ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎస్సీ రుణాలకు 11,420 వరకూ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మిగతా కార్పొరేషన్లకు కూడా దరఖాస్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. పచ్చచొక్కాలు, దళారులదే హవా... రాయితీ రుణాలంటే జన్మభూమి కమిటీలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకే కాసుల సంద డి. నిరుద్యోగుల నుంచి కమీషన్లు భారీగానే నొక్కేస్తున్నారు. కానీ దాఖలైన దరఖాస్తుల సంఖ్యకు, మంజూరైన యూనిట్ల సంఖ్యకు భారీ తేడా ఉంటోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను ప్రభుత్వం జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టడంతో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదు. రాయితీ రుణం వస్తుందని జన్మభూమి కమిటీలకు నిరుద్యోగులు కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. తీరా జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపించట్లేదు. దీంతో యూనిట్లు గ్రౌండ్ కావడంలేదు. ఒక్కో యూని ట్ విలువ రూ.2 లక్షలు. దీన్ని ఒక్కో లబ్ధిదారుడికే మంజూరు చేయాలి. కానీ ఎక్కువ మందిని ముగ్గులోకి దింపడానికి వీలుగా టీడీపీ నాయకులు ఒక్కో యూనిట్‌ను ఇద్దరికి, ముగ్గురికి, కొన్ని చోట్ల నలుగురిని లబ్ధిదారులుగా ఎంపిక చేసిన దాఖలాలు ఉన్నాయి. అంతేకాదు చాలాచోట్ల బినామీ పేర్లతో రుణాలను వారే దక్కించుకుం టున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద జన్మభూమి కమిటీల పెత్తనం, బ్యాంకుల్లో దళారుల జోక్యం కారణంగా రుణాల మంజూ రు ప్రక్రియ గందరగోళంగా తయారైంది. మూడేళ్లుగా మంజూరు ముచ్చట.. బీసీ రుణాలు: 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లా లక్ష్యం 2,174 యూనిట్లు. రుణాల కింద రూ.38.98 కోట్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇద్దరు ముగ్గురికి పంచడంతో యూనిట్ల సంఖ్య 3,086కి చేరింది. తీరా మంజూరైన రుణాల మొత్తం రూ. 31.63 కోట్లు మాత్రమే. రూ. 7.35 కోట్ల మేర నిధులు మిగిలిపోయాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 5,449 యూనిట్లకు రూ. 108.98 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యం కాగా 7,769 మందికి రూ. 97.06 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈసారి కూడా రూ.11.91 కోట్లు మిగిలిపోయాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 5,063 యూనిట్లకు రూ. 101.26 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేదీ లక్ష్యం. కాగా గడువు ముగిసే సమయానికి 40,365 దరఖాస్తులు వచ్చాయి. కాపు రుణాలు : 2016–17 ఆర్థిక సంవత్సరంలో యూనిట్లు 1,147 కాగా రూ. 21 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యం. కానీ 993 మందికి రూ. 14.06 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. సుమారు రూ. 7 కోట్ల నిధులు మిగిలిపోయాయి. 2017–18లో 1200 యూనిట్లకు రూ. 24 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేదీ లక్ష్యం. కానీ 1371 మందికి రూ. 19.56 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. రూ. 4.44 కోట్లు నిధులు మిగిలిపోయాయి. ఈ 2018–19 ఆర్థిక సంవత్సరానికి వెయ్యి యూనిట్లకు రూ. 20 కోట్లు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ 4,538 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈబీసీ రుణాలు: 2017–18 ఆర్థిక సంవత్సరానికి 638 యూనిట్లుకు రూ. 12.76 కోట్లు రుణాలు లక్ష్యం కాగా, 217 యూనిట్లుకు రూ. 4.32 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 471 యూనిట్లుకు రూ. 9.42 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కాగా 236 దరఖాస్తులు వచ్చాయి. ఎంబీసీ రుణాలు : మిక్కిలి వెనుకబడిన వర్గాలకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,574 యూనిట్లుకు రూ. 15.44 కోట్ల మేర రుణాలు ఇవ్వాలనేదీ లక్ష్యం. కానీ 1,641 యూనిట్లుకు రూ. 9.84 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈ 2018–19 ఆర్థిక సంవత్సరానికి 857 యూనిట్లకు రూ. 17.14 కోట్లు రుణలక్ష్యం నిర్దేశించారు. వాటి కోసం 2,640 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ రుణాలు: 2016–17 ఆర్థిక సంవత్సరంలో 1,075 యూనిట్లకు రూ. 21.02 కోట్ల రుణాలు ఇవ్వాలి. కానీ 892 యూనిట్లకు రూ. 12.13 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,413 యూనిట్లకు రూ.24.13 కోట్లు లక్ష్యం కాగా వాటిలో 1,986 యూనిట్లకు రూ. 28.75 కోట్లు మంజూరు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1,926 యూనిట్లకు రూ. 31.89 కోట్లు రుణాలు ఇవ్వాలనేదీ లక్ష్యం. గడువు సమయానికి 11,420 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
సొసైటీలకు ప్రత్యేక నిబంధనలు
బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి నెల్లూరు (సెంట్రల్) : జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే 10 కుల సంఘాల సొసైటీలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని ఈడీ వెంకటస్వామి తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, నగర (ఉప్పర), వాల్మీకి (బోయ), కృష్ణబలిజ (పూసల), బట్రాజు, కుమ్మరి (శాలివాహన), మేదర, విశ్వబ్రాహ్మణ సంఘాలకు సంబంధించి వారు గ్రూపులుగా రుణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. గ్రూపునకు 11 నుంచి 15 మంది వరకు ఉండాలన్నారు. 2013 నుంచి 2016 సంవత్సరాల్లో రుణాలు పొందిన సంఘాలకు అర్హత లేదన్నారు. 2016లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుని రుణాలు రాని వారు మళ్లీ చేసుకోనవసరం లేదన్నారు. వాటినే పరిశీలిస్తామని తెలిపారు. ప్రధానంగా గ్రూపులో ఉన్న 15 మంది సభ్యుల్లో ఇద్దరు లేదా ముగ్గురు గ్రూపులోనే విడిగా యూనిట్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణ లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యూనిట్లో 50 శాతం సబ్సిడీ, 50 శాతం రుణంగా ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్ సబ్సిడీ మాత్రం రెండేళ్ల తర్వాతే జమ చేస్తామన్నారు. ఇతర వివరాలకు బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
కార్పొరేషన్ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం
మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ ధారూరు: బీసీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు అందలేదని, వీటిపై కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ డిమాండ్ చేశారు. ధారూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు నెలల కిందట నిరుద్యోగులు కార్పొరేషన్ల రుణాలకు దరఖాస్తులు చేసుకోగా ఎంపికైన లబ్ధిదారులకు ఇంతవరకు మంజూరు కాలేదని తెలిపారు. యూనిట్ల గ్రౌండింగ్‌కు కలెక్టరేట్, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఖాతాల్లో రుణాలు జమ కాలేదని వాపోయారు. లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేస్తారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన నిధులు జమచేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలకు నిధులు విడుదల చేయకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో గారడీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్రావు, గట్టెపల్లి సర్పంచ్ పాండునాయక్, కాంగ్రెస్ నాయకులు చెక్క వీరన్న, నారాయణ్‌రెడ్డి, చాకలి నర్సింహులు, యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్‌కుమార్, కుమ్మరి రాము, శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడు నెలలుగా ఎదురుచూపులు..!
= పేదలకు అందని ఎస్సీ కార్పొరేషన్ రుణాలు = ఖరారు కాని బ్యాంకు సబ్సిడీ = అయోమయంలో లబ్ధిదారులు నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు సబ్సిడీ రుణాల కోసం ఏడు నెలలుగా ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో 2013-14 సంవత్సరం కింద 8,605 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 20 వరకు ఎస్సీ, బీసీ, కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖలకు చెందిన అధికారులు, మండల స్థాయిల్లోని వివిధ బ్యాంకుల అధికారులు, మండల ప్రజాపరిషత్ అధికారులు, వరంగల్ ప్లానిటోరియంలో నిర్వహించిన జాయింట్ స్క్రీనింగ్‌లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 600లకు పైగా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకొచ్చారు. అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ ఇంకా ఖరారు కాలేదు. ఏటా ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే బ్యాంకులు లబ్ధిదారులకు లింకేజీ రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చేవి. అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు సబ్సిడీని ఖరారు చేస్తుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ ఏడాది నుంచి భూమి లేని నిరుపేద దళిత మహిళలకు అర ఎకరం నుంచి ఎకరం వరకు రూ.5 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేసిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తూ యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో మొదలైన ఆందోళన మూలంగా రుణాల పంపిణీ మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రుణాల కోసం వచ్చే దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కాని ఈ ఏడాది అక్టోబర్‌లోకి అడుగిడినా రుణాలు పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఈ ఏడాది టార్గెట్ ఎలా పూర్తవుతుందని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మదన పడుతున్నారు. లబ్ధిదారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారుల ఆందోళనకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే సందేహలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందా అనే విషయంపై అటు లబ్ధిదారులు, ఇటు అధికారులకు సందిగ్ధంలో పడ్డారు.