distribution of loans
-
59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు
న్యూఢిల్లీ: ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేవలం 59 నిమిషాల్లోనే రుణాలను పంపిణీ చేసే పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) మేలు చేసేందుకు గాను, టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించే విధానాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు. ఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి గడ్కరీ మీడియాతో మాట్లాడారు. దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ విధానంలో టెక్నాలజీ వినియోగంతో దిగుమతులను తగ్గించనున్నట్టు తెలిపారు. ‘‘దీనిని ఆరి్థక శాఖకు పంపిస్తున్నాం. ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నా అభిప్రాయం. దిగుమతి చేసుకునే ప్రధాన సరుకులను స్థానికంగా ఉత్పత్తి చేసే ఎంస్ఎంఈలకు నూతన విధానం మద్దతుగా నిలుస్తుంది. దీంతో మనం దిగుమతిదారుగా కాకుండా ఎగుమతిదారుగా మారిపోతాం. ఎంఎస్ఎంఈలు మరింత బలోపేతం అవుతాయి’’ అని మంత్రి చెప్పారు. ఎంఎస్ఎంఈలకు 59 నిమిషాల్లోనే రుణం అందించే పథకాన్ని ప్రధాని మోదీ 2018 నవంబర్‌లో ప్రారంభించారు. ఆన్లైన్ విధానంలో రుణ పంపిణీ జరుగుతుంది. ఆరంభించిన 4 నెలల్లోనే రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగింది. అయితే, 59 నిమిషాల్లోనే రుణ పథకం పట్ల చిన్న సంస్థలు ఆసక్తి చూపించడం లేదని బ్యాంకులు అంటున్నాయి. ఈ పథకం పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకాన్ని సమీక్షిస్తున్నట్టు మంత్రి చెప్పడం గమనార్హం. కాగా, దేశంలో డ్రైవర్ రహిత వాహనాలకు అనుమతించబోమని గడ్కరీ తేల్చిచెప్పారు. -
కొత్త రుణాల్లేవ్!
కర్నూలు(అగ్రికల్చర్) : వరుణదేవుడితోపాటు బ్యాంకర్లు కూడా అన్నదాతపై కరుణ చూపడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై దాదాపు నెలా పక్షం రోజులైనా కొత్త రుణాల పంపిణీ ప్రారంభంకాలేదు. వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా రుణాలు పొందని రైతులను గుర్తించి వారిని జాబితాలను బ్యాంకర్లకు పంపారు. కానీ ఇంతవరకు ఒక్క బ్యాంకు కూడా ఈ జాబితాల్లోని వారికి రు ణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులకు ప్రైవేటుగా అప్పులు దొరకడం కష్టమైంది. బంగారం నగలు తాకట్టు పెడితేనే ప్రైవేటు వ్యక్తులు రుణాలు ఇస్తున్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షలమంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలకు దూరంగా ఉంటున్నారు. వీరిలో 50శాతం మంది పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లినవారున్నారు. కానీ ప ట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో సిండికేట్ బ్యాం కు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తోంది. పంట రుణాల పంపిణీలో ఎస్బీఐకే లక్ష్యం ఎక్కువగా ఉంది. అయినా ఇవి పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించ గా.. 4.20 లక్షల మందికి ఉపశమనం లభించింది. రుణమాఫీ పొందిన రైతులకు సంబంధించిన పంట రుణాలను మాత్రమే బ్యాంకర్లు రెన్యువల్ చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2385.10 కోట్లు పంట రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, బ్యాంకర్లు ఇప్పటివరకు రూ.750 కోట్లు పంట రుణాలు రెన్యూవల్ చేశారు. కౌలు రైతుల గోడు వినేది ఎవరు...! జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అర్హులైన కౌలుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసినా వాటితో ప్రయోజనం లేకుండా పోయింది. ఈఏడాది జిల్లాలో 20 వేల మంది కౌలుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేశారు. ఒక్క కౌలుదారునికి కూడా రుణం ఇవ్వలేదు. ‘ పట్టాభూములు కల్గిన రైతులకే రుణాలు ఇవ్వడం కష్టం అయింది. ఇక కౌలుదారులకు రుణాలు ఎలా ఇస్తారండీ...’ అంటూ ఓ బ్యాంకు అధికారి చెప్పడం గమనార్హం. కౌలు రైతులకు ప్రైవేటు అప్పులు పుట్టడం లేదు..బ్యాంకులూ మొండిచేయి చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమకెవరు దిక్కంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు ఇవ్వడం లేదు నాకు కౌలు రుణ అర్హత కార్డు ఇచ్చారు. దానిని బ్యాంకులో చూపిస్తే..రుణం ఇవ్వడానికి అది పనికి రాదన్నారు. బయటన్నా అప్పు తీసుకుందామంటే వడ్డీలు చూసి భయమేస్తోంది. ఎవరి చేయూతా లేకుండా వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. కౌలు రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలి. - తెలుగు చంద్ర, కౌలు రైతు, పెండేకల్లు -
రైతులకు రూ.500కోట్ల రుణాలు ఇస్తాం
- డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మెదక్‌టౌన్: రైతులకు ఈయేడాది రూ.500 కోట్ల రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో డివిజన్‌స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మెదక్ డివిజన్లోని పీఏసీఎస్ చైర్మన్లు, డీసీసీబీ డెరైక్టర్లు, సీఈఓలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిట్టిదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పంటరుణాలు, దీర్ఘకాలిక రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తే రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలిస్తామన్నారు. అధికారులు అక్రమాలకు, లంచాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఖరీఫ్‌కు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయద్వారా చెరువుల్లో తీసే మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయన్నారు. తద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. డీసీసీబీ ద్వారా ట్రాక్టర్లకు, పైపులైన్లకు, బోర్లకు రుణాలివ్వనున్నట్లు తెలిపారు. అనంతరం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో డీసీసీబీ డీజీఎం మల్లేశం, డీసీసీబీ డెరైక్టర్లు గోవర్ధన్, అనంతరెడ్డి, మెగ్యా నాయక్, నారాయణరెడ్డి, పలువురు పీఏసీఎస్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, సీఈఓలు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏడు నెలలుగా ఎదురుచూపులు..!
= పేదలకు అందని ఎస్సీ కార్పొరేషన్ రుణాలు = ఖరారు కాని బ్యాంకు సబ్సిడీ = అయోమయంలో లబ్ధిదారులు నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు సబ్సిడీ రుణాల కోసం ఏడు నెలలుగా ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో 2013-14 సంవత్సరం కింద 8,605 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 20 వరకు ఎస్సీ, బీసీ, కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖలకు చెందిన అధికారులు, మండల స్థాయిల్లోని వివిధ బ్యాంకుల అధికారులు, మండల ప్రజాపరిషత్ అధికారులు, వరంగల్ ప్లానిటోరియంలో నిర్వహించిన జాయింట్ స్క్రీనింగ్‌లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 600లకు పైగా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకొచ్చారు. అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ ఇంకా ఖరారు కాలేదు. ఏటా ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే బ్యాంకులు లబ్ధిదారులకు లింకేజీ రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చేవి. అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు సబ్సిడీని ఖరారు చేస్తుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ ఏడాది నుంచి భూమి లేని నిరుపేద దళిత మహిళలకు అర ఎకరం నుంచి ఎకరం వరకు రూ.5 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేసిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తూ యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో మొదలైన ఆందోళన మూలంగా రుణాల పంపిణీ మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రుణాల కోసం వచ్చే దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కాని ఈ ఏడాది అక్టోబర్‌లోకి అడుగిడినా రుణాలు పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఈ ఏడాది టార్గెట్ ఎలా పూర్తవుతుందని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మదన పడుతున్నారు. లబ్ధిదారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారుల ఆందోళనకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే సందేహలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందా అనే విషయంపై అటు లబ్ధిదారులు, ఇటు అధికారులకు సందిగ్ధంలో పడ్డారు.