కర్నూలు(అగ్రికల్చర్) : వరుణదేవుడితోపాటు బ్యాంకర్లు కూడా అన్నదాతపై కరుణ చూపడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై దాదాపు నెలా పక్షం రోజులైనా కొత్త రుణాల పంపిణీ ప్రారంభంకాలేదు. వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా రుణాలు పొందని రైతులను గుర్తించి వారిని జాబితాలను బ్యాంకర్లకు పంపారు. కానీ ఇంతవరకు ఒక్క బ్యాంకు కూడా ఈ జాబితాల్లోని వారికి రు ణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులకు ప్రైవేటుగా అప్పులు దొరకడం కష్టమైంది. బంగారం నగలు తాకట్టు పెడితేనే ప్రైవేటు వ్యక్తులు రుణాలు ఇస్తున్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షలమంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలకు దూరంగా ఉంటున్నారు.
వీరిలో 50శాతం మంది పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లినవారున్నారు. కానీ ప ట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో సిండికేట్ బ్యాం కు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తోంది. పంట రుణాల పంపిణీలో ఎస్‌బీఐకే లక్ష్యం ఎక్కువగా ఉంది. అయినా ఇవి పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించ గా.. 4.20 లక్షల మందికి ఉపశమనం లభించింది. రుణమాఫీ పొందిన రైతులకు సంబంధించిన పంట రుణాలను మాత్రమే బ్యాంకర్లు రెన్యువల్ చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2385.10 కోట్లు పంట రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, బ్యాంకర్లు ఇప్పటివరకు రూ.750 కోట్లు పంట రుణాలు రెన్యూవల్ చేశారు.
కౌలు రైతుల గోడు వినేది ఎవరు...!
జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అర్హులైన కౌలుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసినా వాటితో ప్రయోజనం లేకుండా పోయింది. ఈఏడాది జిల్లాలో 20 వేల మంది కౌలుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేశారు. ఒక్క కౌలుదారునికి కూడా రుణం ఇవ్వలేదు. ‘ పట్టాభూములు కల్గిన రైతులకే రుణాలు ఇవ్వడం కష్టం అయింది. ఇక కౌలుదారులకు రుణాలు ఎలా ఇస్తారండీ...’ అంటూ ఓ బ్యాంకు అధికారి చెప్పడం గమనార్హం. కౌలు రైతులకు ప్రైవేటు అప్పులు పుట్టడం లేదు..బ్యాంకులూ మొండిచేయి చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమకెవరు దిక్కంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణాలు ఇవ్వడం లేదు
నాకు కౌలు రుణ అర్హత కార్డు ఇచ్చారు. దానిని బ్యాంకులో చూపిస్తే..రుణం ఇవ్వడానికి అది పనికి రాదన్నారు. బయటన్నా అప్పు తీసుకుందామంటే వడ్డీలు చూసి భయమేస్తోంది. ఎవరి చేయూతా లేకుండా వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. కౌలు రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలి.
- తెలుగు చంద్ర, కౌలు రైతు, పెండేకల్లు
కొత్త రుణాల్లేవ్!
Published Thu, Jul 16 2015 3:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement