న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి కేవలం 59 నిమిషాల్లోనే రుణాలను పంపిణీ చేసే పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) మేలు చేసేందుకు గాను, టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించే విధానాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు. ఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి గడ్కరీ మీడియాతో మాట్లాడారు. దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ విధానంలో టెక్నాలజీ వినియోగంతో దిగుమతులను తగ్గించనున్నట్టు తెలిపారు. ‘‘దీనిని ఆరి్థక శాఖకు పంపిస్తున్నాం. ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నా అభిప్రాయం. దిగుమతి చేసుకునే ప్రధాన సరుకులను స్థానికంగా ఉత్పత్తి చేసే ఎంస్‌ఎంఈలకు నూతన విధానం మద్దతుగా నిలుస్తుంది.
దీంతో మనం దిగుమతిదారుగా కాకుండా ఎగుమతిదారుగా మారిపోతాం. ఎంఎస్‌ఎంఈలు మరింత బలోపేతం అవుతాయి’’ అని మంత్రి చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు 59 నిమిషాల్లోనే రుణం అందించే పథకాన్ని ప్రధాని మోదీ 2018 నవంబర్‌లో ప్రారంభించారు. ఆన్‌లైన్ విధానంలో రుణ పంపిణీ జరుగుతుంది. ఆరంభించిన 4 నెలల్లోనే రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగింది. అయితే, 59 నిమిషాల్లోనే రుణ పథకం పట్ల చిన్న సంస్థలు ఆసక్తి చూపించడం లేదని బ్యాంకులు అంటున్నాయి. ఈ పథకం పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకాన్ని సమీక్షిస్తున్నట్టు మంత్రి చెప్పడం గమనార్హం. కాగా, దేశంలో డ్రైవర్ రహిత వాహనాలకు అనుమతించబోమని గడ్కరీ తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment