అంతా మా ఇష్టం..
ఆగని ‘కళ్యాణలక్ష్మి’ కబ్జా
నిబంధనలు హుష్‌కాకి
కార్పొరేషన్ అధికారుల నిద్రమత్తు
పార్కింగ్ కోసం నాలాపై స్లాబ్ నిర్మాణం
విమర్శలు వెల్లువెత్తుతున్న వైనం
హన్మకొండ : వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతు న్న పనుల్లో పారదర్శకత లోపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను కార్పొరేషన్ అధికారులు తమ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలకు కళ్యాణలక్ష్మి షాపిం గ్‌మాల్ ఎదుట ఉన్న నాలాపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణమే అద్దం పడుతోంది. కేవలం పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే బల్దియా అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. హన్మకొండ న గర నడిబొడ్డున ‘కళ్యాణలక్ష్మి నాలా స్లాబ్’ వ్యవహారంపై బల్దియా అధికారులు స్పందించిన తీరు ఇలా ఉంది.
ఆగష్టు 2వ తేదీ..
ఫండ్ యువర్ సిటీలో నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ వ్య క్తులు నగరంలో ఏదైనా పని చేపట్టాలంటే ముందుగా నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్పొరేష న్ బహిరంగ నోటీసులు జారీ చేస్తుంది. సదరు పనిపై ప్ర జాభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. అభ్యంతరాలు, సూచనలు పరిశీలించి అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తాం. అనుమతి ఇస్తేనే నిర్మాణాలు జరపాలి. అనుమతి రాకుండా నిర్మాణం చేపడితే కూల్చివేస్తాం. కళ్యాణలక్ష్మి షా పింగ్ మాల్ ఎదురు నాలాపై నిర్మాణం కోసం కొందరు దరఖాస్తు చేశారు. అయితే అనుమతి ఇవ్వకముందే పను లు ప్రారంభించినందున నిర్మాణాన్ని నిలిపివేశాం.
ఆగష్టు 20వ తేదీ..
ఫండ్ యువర్‌సిటీ కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ ఎదురు నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందు కు బల్దియా కమిషనర్ సువర్ణపండాదాస్ అనుమతించారు. దాని ప్రకారమే వారు నిర్మాణం చేపడుతున్నారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్‌కు వెళ్లే దారి నిత్యం ర ద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం తమ దుకాణానికి వచ్చే కస్టమర్లు వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టింది. దీంతో ట్రాఫిక్ సమస్య లు పెరుగుతాయని తెలిసినా పట్టించుకోకుండా తమ వ్యా పారం సాఫీగా సాగితే చాలనే విధంగా 2012లో సదరు యాజమాన్యం స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి కలెక్టర్ రాహుల్‌బొ జ్జా, మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్ యాజమాన్యం పై కన్నెర్ర జేశారు. అనంతరం అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చి వేయించారు. ఇదిలా ఉండగా, సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం మరోసారి పనులు ప్రారంభించింది. కాగా, ఈ నిర్మాణంపై నగర పాలక సంస్థ సిటీ ప్లానింగ్ అధికారి రమేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా... ఫండ్ యువర్ సిటీ పథకం ద్వారా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత సంతృప్తి చెందినేతే నిర్మాణానికి అనుమతి ఇస్తామ ని పేర్కొన్నారు.
కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యా నికి కార్పొరేషన్ అనుమతి రాకముందే నిర్మాణం ప్రారంభించినందున పనులు నిలిపేశామని చెప్పారు. కాగా, సరిగ్గా పద్దెనిమిది రోజుల తర్వాత కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం నాలాపై తిరిగి స్లాబ్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకుండా... ఎవరి నుంచి అభ్యంతరాలు స్వీకరిం చకుం డా పనులు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నిర్మాణంపై సిటీ ప్లానింగ్ అధికారిని ‘సాక్షి’ మరోసారి వివరణ అడగగా... ప్రజాభిప్రాయ సేకరణ.. అభ్యంతరాల స్వీకరణపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కమిషనర్ సువర్ణపండాదాస్ అ నుమతి ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.