లండన్: మూడేళ్ల నుంచి నిత్యం తాను పార్కింగ్ చోటే కదా అనుకుంది. ఎప్పటిలాగే ఆరోజూ తన వాహనాన్ని నిలిపింది. తీరా చూస్తే అధికారులు.. కొత్త రూల్ పేరుతో ఆమెకు పెద్ద షాకిచ్చారు. వాళ్లు పంపిన జరిమానా చూసి ఆమె కళ్లు బయర్లు కమ్మాయి.
యూకేలోని కౌంటీ దుర్హంలో హెన్నా రాబిన్సన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫీథమ్స్ లీజర్ సెంటర్లో ఐదు నిమిషాల పార్కింగ్ రూల్ కారణంగా.. ఆమె 11 వేల పౌండ్లు(మన కరెన్సీలో రూ.11 లక్షలు) చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే పర్మిట్ కోసం తాను డబ్బులు చెల్లించినప్పటికీ.. ఈ జరిమానాను అందుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారు.
2021 నుంచి ఆమె ఆ పార్కింగ్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే కొత్త రూల్ అమలయ్యాక.. అప్పటి నుంచి ఆమె కారు కదలికలను అధికారులు లెక్కేశారు. అలా మొత్తం 67 చలాన్లకు.. ఒక్కో చలాన్‌కు 170 పౌండ్లు(1,800రూ.) చొప్పున ఇప్పుడు జరిమానా విధించారు.
యూకేలో ఎక్సెల్ పార్కింగ్ సర్వీసెస్(EPS) తాజాగా ఈ ఐదు నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చింది. కొందరు డ్రైవర్లు పార్కింగ్ ఏరియాల దగ్గర ఉత్తపుణ్యానికి వెయిట్ చేయడం, డబ్బులు చెల్లించకుండా కార్ పార్కింగ్‌లను పికప్ ఏరియాలుగా ఉపయోగించుకుంటుండడంతోనే ఈ రూల్‌ను తేవాల్సి వచ్చిందని ఈపీఎస్ చెబుతోంది.
ఐదు నిమిషాల రూల్ ప్రకారం.. కార్క్ పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేసే ఏఎన్‌పీఆర్ కెమెరాలు ఎంట్రీని, ఎగ్జిట్‌ను రికార్డు చేసి.. ఛలానాను జనరేట్ చేస్తాయి. అయితే.. కస్టమర్స్ అక్కడికి చేరుకున్న ఐదు నిమిషాల్లోపే టికెట్ కొనాల్సి ఉంటుంది. కానీ, కార్ పార్క్ వద్ద ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ట్రాన్‌జాక్షన్స్ తాను చేయలేకపోయానని హెన్నా రాబిన్సన్ చెబుతోంది. ఆమె మాత్రమే కాదు.. ఇలా పార్కింగ్ వద్ద ఐదు నిమిషాల నిబంధన కారణంగా తామూ చలాన్లు అందుకున్నామంటూ పలువురు వాపోతున్నారు ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment