Warangal Municipal Corporation
-
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు
-
కేటీఆర్ పర్యటన.. టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చిన వరంగల్ కార్పొరేషన్
సాక్షి, వరంగల్: మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్‌కార్పొరేషన్ టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీ ఫైన్ విధించింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణికి బల్దియా అధికారులు ఏకంగా రూ.2 లక్షలు జరిమానా విధించారు. టీఆర్ఎస్ నాయకులు కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. కాగా, నేడు కేటీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జెండాలు, తోరణాలు, బ్యానర్లతో మడికొండ నుంచి వరంగల్ వరకు రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. -
మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు
సాక్షి, వరంగల్ : ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వంచించడమే కాకుండా భూమిపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ రూ.90 లక్షలు వసూలు చేసిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ కార్పొరేటర్ భర్త కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు మూడు రోజుల కిందట కేసు నమోదు చేసినా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. దీంతోపాటు పోలీసులపై పలు ఆరోపణలు వస్తుండడంతో సీపీ అలర్ట్ అయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా ఈ కేసులో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు పెద్దోళ్లకు దగ్గరనే ఆలస్యమా.. మూడు దశాబ్దాలుగా గ్రేటర్ వరంగల్‌లో లిక్కర్ డాన్‌గా ముద్రపడిన కార్పొరేటర్ భర్త తండ్రి తన వ్యాపార విస్తరణకు ఎందరో ముఖ్య నేతలకు దగ్గరయ్యాడు. బిజినెస్ సాఫీగా సాగేందుకు కొందరు పోలీసులతో సన్నిహితంగా ఉండడమే కాదు.. వారికి మగువ, మద్యం చూపి లోబరుచుకొని పనులు చేయించుకునేవాడని వార్తలు సామాజిక మాధ్యమాలతోపాటు టీవీ చానళ్లలో ప్రసారం కావడం పోలీస్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఏకంగా కొందరు ఖాకీలను శ్రీలంక, మలేసియాకు తీసుకెళ్లి విందు వినోదాలు ఇచ్చాడని వచ్చిన వదంతులను తీవ్రంగా పరిగణించిన సీపీ ఈ మేరకు విచారణ చేపట్టి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ మరోవైపు సాధ్యమైనంత తొందరగా ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని హుకుం జారీచేసినట్టు తెలిసింది. ఈ కార్పొరేటర్ భర్త, అతడి తండ్రి ఓ ముఖ్య నేత వ్యాపారంలో భాగస్వామి కావడంతో ఈ కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సదరు నేత సీరియస్ అవడంతోనే మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ ఒక రోజు మొత్తం సెలవుపై వెళ్లాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత విధులకు వచ్చారు. దీనిపై ఏసీపీ గిరికుమార్‌ను ఫోన్లో సంప్రదిస్తే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వీరిని అరెస్టు చేశామని వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. కార్పొరేటర్ భర్త పై మోసం, అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ఇతడికి సహకరించిన తండ్రిపై కూడా బెదిరింపుల కేసు పెట్టారు. -
మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా.. ఇప్పుడు నిలిపి వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా వేసింది. చదవండి: వరంగల్ ఎన్నికలు: టికెట్ ఎవరికిచ్చినా ఓకే.. -
వరంగల్ ఎన్నికలు: టికెట్ ఎవరికిచ్చినా ఓకే..
వరంగల్: వరంగల్ బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు టీఆర్ఎస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. అయితే, చివరిరోజు పలు వార్డుల్లో తల్లీకూతుళ్లు నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ ఎవరికి ఇచ్చినా ఇబ్బంది ఎదురుకావద్దనే భావనతోనే ముందస్తుగా ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్టు వారు చెప్పుకొచ్చారు. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42వ డివిజన్ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నేత యోగానంద్ 41 డివిజన్ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్ నుంచి పోటీలో ఉన్నారు. 40వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్జీ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి నామినేషన్లు సమర్పించారు. 19వ డివిజన్ నుంచి నామినేషన్లు వేసిన తల్లి ఝాన్సీ, కుమార్తె మౌనిక గ్రేటర్ వరంగల్ ఫైట్: ఎవరు బరిలో నిలిచారో తెలుసా? -
గ్రేటర్ వరంగల్ ఫైట్: ఎవరు బరిలో నిలిచారో తెలుసా?
వరంగల్ : గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. చివరిరోజు అదివారం మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి 29వ డివిజన్ కార్పొరేటర్‌గా నామినేషన్ అందజేశారు. అలాగే, దివంగత మంత్రి దాస్యం ప్రణయ్‌భాస్కర్ కుమారుడు అభినవ్‌భాస్కర్ 60 డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. ఇక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోదరి నల్లా స్వరూపరాణి 57వ డివిజన్ నుంచి, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ 10వ డివిజన్ నుంచి, మాజీ స్టాండింగ్ కమిటి చైర్మన్ గుండేటి నరేందర్ 20వ డివిజన్ నుంచి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి 34వ డివిజన్ నుంచి నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బంక సరళాయాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కేడల పద్మ, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ ఒకరు కాకపోతే ఇంకొకరు... నగరంలోని పలు డివిజన్ల నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరేసి కార్పొరేటర్ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42వ డివిజన్ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు యోగానంద్ 41 డివిజన్ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్ నుంచి, బీజేపీ నాయకులు, సోదరులైన చాచర్ల చిన్నారావు 41 డివిజన్, దీనదయాళ్ 40వ డివిజన్ నుంచి, 40వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి, అదే డివిజన్ నుంచి ఆరేళ్లి రవితో పాటు ఆయన సతీమణి కూడా నామినేషన్లను దాఖలు చేశారు. స్రూ్కటినీలో ఏదైనా నామినేషన్ తిరస్కరణకు గురైనా మరొకరు పోటీలో ఉండొచ్చనే భావనతో ఇద్దరేసి నామినేషన్లు సమర్పించినట్లు తెలిపారు. నేడు నామినేషన్ల పరిశీలన వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో భాగంగా అదివారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ము గిసింది. ఇక సోమవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేష న్లు స్వీకరించిన వరంగల్‌లోని ఎల్బీ కాలేజీ, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో పరిశీలనకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమర్పించిన అభ్యర్థుల్లోఉత్కంఠ నెలకొంది. పరిశీలన విధివిధానాలు నామినేషన్ల పత్రాల పరిశీలనలో రిటర్నింగ్ అధి కారి(ఆర్ఓ)కి నిబంధనలకు లోబడి సర్వ అధికా రాలు ఉంటాయి. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థితోపాటు ప్రతి పాదించి వ్యక్తి,ఏజెంట్,సమీప బంధువు హాజ రుకావొచ్చు. లేదంటే న్యాయ సలహాదారుడి పరి శీ నలో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌లోని ఫారం – 8లో పొందుపరిచిన వివరాలను పరిశీలించి అభ్య ర్థి, ప్రతిపాదిత వ్యక్తుల పేర్లు, వివరాలు, సంతకాలను సరిచూస్తారు. అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తి పేర్లు, ఓటరు జాబి తాలో ఉన్నాయో, లేదో పరిశీలిస్తారు. నామినేషన్ పత్రాల్లో జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీల గుర్తులపై పోటీ చేసే వ్యక్తి బీ – ఫారం సమర్పించారా, లేదా అని చూస్తారు. (నావిునేషన్ ఉపసంహరణ గడువు వరకు బీ – ఫారం సమర్పించే వెసులుబాటు ఉంది.) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి చివరి వరకు కూడా బీ – ఫారం సమర్పించకపోతే ఏ నిర్ణయం తీసుకుంటారనే వివరణ పత్రాన్ని పరిశీలిస్తారు. స్వతంత్య్ర అభ్యర్థిగానై బరిలో ఉంటారా, లేదా అని తెలుసుకుంటారు. గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి అయినప్పటికీ అధికారులు ఇచ్చిన గుర్తుల్లో తాను కోరుకునే గుర్తు ముందుగానే నమోదు చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన డివిజన్లకు సంబంధించి అభ్యర్థి ఆన్లైన్ ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలిస్తారు. ఎన్నికల నియమావళి ఆధారంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థి నిబంధనలకు లోబడి ఉంటానని, ప్రచారం ఖర్చుల వివరాలు తప్పక అందజేస్తానని జత చేసిన ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. ధృవీకరణ పత్రాల్లో అభ్యర్థి ఆస్తులు, అప్పుల వివరాలు తప్పక నమోదు చేసి ఉండాలి. అదేవిధంగా నమోదైన కేసులు ఉన్నాయో, లేదో కూడా వెల్లడించి ఉండాలి. డిపాజిట్ జమ చేసిన బిల్లును కూడా పరిశీలించాక అన్నీ సక్రమంగా ఉంటే నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఏ అభ్యర్థి నామినేషన్ విషయంలోనైనా ప్రత్యర్థులు కానీ, ఇతర వ్యక్తులు కానీ గడువులోగా అభ్యంతరాలు, అభియోగాలు చేసే అవకాశం కల్పిస్తారు. అయితే, తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఇచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అభియోగాలను పరిశీలించి నిజమేనని తేలితే నామినేషన్‌ను తిరస్కరించడంతో పాటు ఇరువర్గాల నుంచి సంతకాలు తీసుకుంటారు. -
గ్రేటర్ ఎన్నికలు: వ్యూహాత్మకంగా టీఆర్ఎస్
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచా యి. కార్పొరేషన్ పీఠంపై గురిపెట్టిన అన్ని పార్టీలు తమ సత్తా చూపేందుకు పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. సిట్టింగ్ మేయర్ పీఠాన్ని మళ్లీ దక్కించుకునే దిశగా ఆ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరాభవం నిరాశకు గురి చేసినా.. ఈ గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు బీజేపీ కేడర్‌ను సన్నద్ధం చే స్తోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి కార్పొరేటర్లుగా పోటీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సీపీఐ, సీపీఎంతో కలిసి బల్దియా బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ‘మేయర్’పై వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పునర్విభజనలో భాగంగా పెరిగిన డివిజన్లు, మారి న రిజర్వేషన్లు అధికార పార్టీ నాయకుల్లో పలువురి ఆశలను గల్లంతు చేశాయి. మేయర్ పీఠంపై గురి పెట్టిన పలువురిని అసంతృప్తి వెంటాడుతుండగా, సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అస్త్రం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పలు కోణాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించడం ఆశావహులను కలవరపెడుతోంది. సిట్టింగ్ అభ్యర్థుల్లో ఎవరికి అవకాశం దక్కుతుంది.. మరెవరికి చేజారుతుందనే అంచనాలకు కూడా రాలేకపోతున్నారు. ఓవైపు ప్రభుత్వం ఇంటలిజెన్స్, మరోవైపు పార్టీ బృందాలు చేస్తున్న సర్వేలు తమకు ప్రతిబంధకంగా మారుతుందనే అనుమానం వారిని వెంటాడుతోంది. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్, లిక్కర్ దందాల్లో రూ.కోట్లు కూడబెట్టుకున్న వారు, కొత్త ముఖాలు తెరపైకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కాగా, జీహెచ్ఎంసీ తరహాలో గ్రేటర్ వరంగల్‌లో సత్తా చాటడంపై బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికల ఇన్చార్జ్ జితేందర్ రెడ్డి వరంగల్‌లోనే మకాం వేయగా, పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి తదితరులు పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను పిలిపించి శుక్రవారం ఎన్నికల శంఖారావం సభ ఏర్పాటుచేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలు రాకున్నా, ఉత్సాహంగా ఉన్న యువతకు కార్పొరేటర్లుగా ఎక్కువ అవకాశాలు కల్పించాలనే యోచనలో ఉంది. పొత్తు పొడుస్తుందా.. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికతో పాటు గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచి కమి టీలు ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితర అగ్రనేతలు ప్రచారం చేసినా వరంగల్‌పై ప్రభావం చూపలేదు. కాగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు 66 కొత్త డివిజన్ల కమిటీలు వేసే పనిలో నిమగ్నమైన సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయడమా లేదా పొత్తులతో బరిలో నిలవడమా అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి ఇతర నాయకులతో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి రెండు రోజులుగా చర్చలు జరిపారు. ఇదే విషయమై మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్ తదితర పార్టీ సీనియర్లతో డీసీసీ భవన్లో రాజేందర్‌రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో సీపీఐ 11, సీపీఎం 12 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించగా, రెండు పార్టీ లకు కలిపి 20 స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ మూడు పార్టీల పొత్తులపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై వేచిచేసే ధోరణి గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడింది. ఈ మేరకు నామినేషన్ల దాఖలకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంటే మూడు రోజుల సమయమే ఇచ్చారు. దీంతో పలువురు ఆశావహులు తొలిరోజైన శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కానీ అటు అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల జాబితాలు వెల్లడి కాలేదు. దీంతో శనివారం జాబితాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయాలని సూచిస్తారా, లేక చివరి రోజైన ఆదివారమే అభ్యర్థుల జాబితా విడుదలవుతుందా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆశావహులు సంఖ్య భారీగా ఉండడంతో ముందుగా జాబితా విడుదల చేస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనలో అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం. దీంతో శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయమే అభ్యర్థుల జాబితా వెల్లడించి ఆ వెంటనే నామినేషన్లు దాఖలు చేయించవచ్చని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా తొలుత టీఆర్ఎస్ జాబితా విడుదలైతే ఆ పార్టీ అసంతృప్తుల్లో బలంగా ఉన్న వారికి గాలం వేయొచ్చనే ఆలోచనతో వేచిచూసే ధోరణి వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం. చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ -
పుర రాబడి రూ.1,123 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఆదాయం లెక్క తేలింది. కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటైన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అదనపు సిబ్బంది ని యామక ప్రక్రియలో భాగంగా ఆయా పట్టణ సంస్థల కాసుల లెక్కను కూడా పురపాలక శా ఖ అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని (140) పురపాలికల్లో కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.1,123.87 కోట్లకు పైగా ఆదా యం సమకూరుతోంది. ఇందులో ఆస్తి పన్ను కింద రూ.671.33 కోట్లు.. ఇతర ఆదాయం రూ. 452.53 కోట్లు ఉంది. అయితే ఆస్తి పన్ను హే తుబద్ధీకరణ, ఇతర పన్నుల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తే ఈ ఆదా యం మరో 20 శాతమైనా పెరుగుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అగ్రభాగాన నార్సింగి.. అట్టడుగున అమరచింత మున్సిపాలిటీల ఆదాయంలో నార్సింగి అగ్రభాగాన ఉంది. రాజధానిని ఆనుకొని ఉన్న ఈ పురపాలిక వార్షికాదాయం రూ.26.12 కోట్లు, ద్వితీయ స్థానంలో మణికొండ రూ.20.11 కోట్లు, జగిత్యాల రూ.15.28 కోట్లుండగా.. అట్టడుగున అమరచింత మున్సిపాలిటీ ఉంది. ఇంకా పల్లె వాసనలు పోనీ ఈ పురపాలిక వార్షికాదాయం కేవలం రూ.13.92 లక్షలు మాత్రమే. ఆ తర్వాత స్థానం వడ్డేపల్లి రూ.16.80 లక్షలు, అలంపూర్ రూ.29.40 లక్షలు, చండూరు రూ.31.55 లక్షలు, భూత్పూర్ రూ.34.11 లక్షలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంభన సాధించాలంటే పన్నులు పెంచుకోవడమో, ఆర్థిక వనరులు సమీకరించుకుంటే తప్ప అభివృద్ధి సాధ్యపడదు. లేదంటే ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. అదనంగా 2,521 పోస్టులకు ప్రతిపాదన.. ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు పురపాల క శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రస్తుతం రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 నగర, పురపాలక సంస్థ (జీహెచ్ఎంసీ మినహా)ల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగులు ప ని చేస్తున్నారు. కొత్త పురపాలికలు పెరగడం, పరిధి వి స్తృతి కావడం, పనిభారం పెరగటంతో దానికి తగ్గట్టు గా సిబ్బంది అవసరమని మున్సిపల్ శాఖ అంచనా వే సింది. మున్సిపల్ కార్యకలాపాల నిర్వహణకు ప్రతి మున్సిపాలిటీకి 36 మంది అవసరం. ఇందులో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్–3, అసిస్టెంట్ ఇంజనీర్–3, టౌన్‌ప్లానిం గ్ అబ్జర్వర్ (టీపీబీఓ), జూనియర్ అకౌంటెంట్, హెల్త్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టు లుంటాయి. వీటికి అదనంగా ఇతర సిబ్బంది ఉంటారు. అయితే, చాలా చోట్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో సి బ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పోస్టులు మంజూరు చేయాలని పురపాలకశాఖ ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్తగా 2,521 పోస్టులు మంజూరుకు అనుమతివ్వాలని కోరింది. ఓరుగల్లు టాప్! ఇక ఆదాయంలో ఓరుగల్లు టాప్‌లో నిలిచింది. హైదరాబాద్ నగర పాలక సంస్థ తర్వాతి స్థానం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌దే.. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.121.65 కోట్లు. ఇందులో ఆస్తి పన్ను రూపంలో రూ.80.65 కోట్లు సమకూర్చుకుంటుండగా, రూ.40.99 కోట్లు ఇతర పద్దుల కింద సమీకరిస్తోంది. ఓరుగల్లు తర్వాత రాబడిలో ఇందూరు ద్వితీయ స్థానంలో ఉంది. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.58.86 కోట్లు. ఇక మూడో స్థానంలో ఖమ్మం రూ.44.08 కోట్లు, నాలుగో స్థానంలో కరీంనగర్ రూ.41.57 కోట్లు ఉంది. ఇక అత్యల్ప రాబడి ఉన్న నగర పాలక సంస్థ జవహర్‌నగర్. దీని వార్షికాదాయం రూ.5.97 కోట్లే.. ఆ తర్వాత స్థానంలో మీర్‌పేట రూ.10.60 కోట్లతో కొనసాగుతోంది. రాష్ట్రంలో రూ.కోటి కన్నా తక్కువ ఆదాయమున్న మున్సిపాలిటీలివే -
వరంగల్ మేయర్‌గా ప్రకాశ్‌రావు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కార్యకర్తగా ఆయన విధేయతకు పార్టీ అధిష్టానం పట్టం కట్టింది. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా 2016 మార్చిలో జరిగిన ఎన్నికల్లో నన్నపునేని నరేందర్ ఎన్నికయ్యారు. అయితే, గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మేయర్ ఎన్నిక కోసం శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రిసై డింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన సమావేశం జరగగా 26వ డివిజన్ కార్పొరేటర్ గుండా ప్రకాశ్‌రావును ఎన్నుకున్నారు. అనంత రం ప్రకాశ్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. -
వరంగల్ మేయర్‌గా గుండా ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ పదవి కోసం టీఆర్ఎస్లోని పలువురు కార్పొరేటర్లు ప్రయత్నాలు చేసినా.. పార్టీలో సీనియర్ నేత అయిన ప్రకాశ్రావుకే టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. వరంగల్ మేయర్ పదవికి ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. ఎన్నికకు ఒకరోజు ముందుగా టీఆర్ఎస్ ప్రకాశ్‌రావు పేరును అధికారికంగా ప్రకటించనుంది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. 2016 ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేం దర్‌కు పార్టీ అవకాశం కల్పించింది. నరేందర్ తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం లో మేయర్ పదవికి రాజీనామా చేశారు. -
వరంగల్ మేయర్.. ఎవరికివారే!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీలో కొత్త రాజకీయానికి తెరతీస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంలో కీలక పదవి విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మెజారిటీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధేయులకు కాకుండా, కొత్తగా వచ్చినవారికి ఈ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నివేదించాలని వారు భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్‌గా ఉన్న నన్నపునేని నరేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నన్నపునేని నరేందర్ మేయర్ పదవికి రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 27వ తేదీన మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ దగ్గరపడుతుండటంతో ఎవరికి వారు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, బోయినపల్లి రంజిత్‌రావు, వద్దిరాజు గణేశ్, గుండు ఆశ్రితారెడ్డి మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సమావేశం వరంగల్ మేయర్ ఎంపిక కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో 2016 మార్చిలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ 1, సీపీఎం 1, కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 44 డివిజన్లలో విజయం సాధించాయి. స్వతంత్రులు ఎనిమిది మంది గెలిచారు. స్వతంత్రులందరూ టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ మేయర్ పదవిని జనరల్ కేటగిరికి కేటాయించినా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేందర్‌కు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ టీఆర్ఎస్లో, టీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్ ఎంబాడి రవీందర్ కాంగ్రెస్‌లో చేరగా ప్రస్తుతం టీఆర్ఎస్కు 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ పదవి అధికార పార్టీకి దక్కడం లాంఛనమే. ప్రస్తుతం మేయర్ పదవిని ఓసీ వర్గానికి ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. గుండా ప్రకాశ్‌రావు, బోయినపల్లి రంజిత్‌రావు, వద్దిరాజు గణేశ్, గుండు ఆశ్రితారెడ్డి, నాగమళ్ల ఝాన్సీలలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందో మరి. ముగ్గురి అభిప్రాయాలు కీలకం గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా, వర్ధన్నపేట సగం సెగ్మెంట్ ఉంటాయి. మేయర్ ఎన్నిక విషయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల అభిప్రాయాలు కీలకం కానున్నాయి. ఈ ముగ్గురితో పాటు మరో కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్కువమంది కార్పొరేట ర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరం గల్ ఎన్నికలు 2016లో జరిగాయి. ఝాన్సీ టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అప్పట్లో మేయర్ ఎన్నిక ముగిసిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి కాకుండా టీఆర్ఎస్ తరఫున గెలిచినవారిలోనే ఒకరికి మేయర్‌గా అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ కార్పొరేటర్లు అధిష్టానాన్ని కోరుతున్నారు. -
ఫిక్స్డ్ రేట్ !
అవినీతికి మారుపేరుగా సర్కిల్ కార్యాలయాలు డబ్బు ఇవ్వకుంటే కాళ్లరిగేలా తిరగాల్సిందే... సిటిజన్ చార్టర్‌కు మంగళం పాడిన ఉద్యోగులు పర్యవేక్షణ లేక కొందరు అధికారులు, ఉద్యోగుల బరితెగింపు పనులు సకాలంలో జరగక నగర వాసుల ఇబ్బందులు వరంగల్ అర్బన్ :గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటుచేసిన సర్కిల్ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ఇక్కడ ఫైళ్లు, పని ఏదైనా ముడుపులు లేనిదే ముందుకు కదలడం లేదు. కాసులు ఇవ్వడానికి నిరాకరిస్తే కాళ్లరిగేలా తిరిగినా పని జరగని పరిస్థితి నెలకొంది. కొత్త ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తి పేరు మార్పిడి, నల్లా కనెక్షన్లు, ఇంటి నిర్మాణాల అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ జారీ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, అభివృద్ధి పనులే కాకుండా ఇతర కార్యకలాపాలు ఏవైనా సరే ప్రతీ పనికో రేట్ ఫిక్స్ చేసిన కొందరు అధికారులు, ఉద్యోగులు వసూళ్లకు బరితెగిస్తున్నారు. కొన్ని కార్యకలపాలకు దళారులు నియమించుకోగా.. మరికొన్నింటికి నేరుగానే డబ్బు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అధిక మొత్తంలో ‘మాముళ్లు’ వచ్చే పోస్టింగ్ కోసం రూ.లక్షల్లో ముట్టచెప్పేందుకు కూడా వెనుకాడడం లేదని తెలుస్తోంది. జనాభాకు అనుగుణంగా.. వరంగల్ మహా నగర జనాభా 10లక్షలకు పైచిలుకు చేరగా విస్తీర్ణమూ పెరిగింది. దీంతో పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సుమారు మూడేళ్ల కిందట కాశిబుగ్గ, కాజీపేట రెండు ప్రాంతాల్లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 80శాతం సేవలు అయా సర్కిల్ కార్యాలయాల నుంచే లభిస్తున్నాయి. దీంతో ప్రజలు అయా సర్కిల్ కార్యాలయాలను అశ్రయిస్తున్నారు. అయితే, ఇక్కడ పాలకవర్గం, ఉన్నతాధికారులు ఆజమాయిషీ కానీ ప్రత్యక్ష పర్యవేక్షణ కానీ లేకపోవడంతో అధికారులు, ఉద్యోగులదే ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రజల అవసరాల తీవ్రతను బట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అలా అడిగిన డబ్బు ఇవ్వని వారు పనుల పైళ్లు మూలన పడుతుండడం గమనార్హం. పారదర్శకత కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నా ఉద్యోగులు తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బయటకు కనబడేవి రెండు చేతులే...... కాసుల కోసం చాచిన చేతులు బయటకు కనిపించేవి ఒకరి చేతులే అయినా.. వివిధ హోదాల్లో కింది స్థాయి నుంచి ఫైనల్ సంతకం చేసే ఉన్నతాధికారుల వరకు వచ్చే డబ్బు వాటాలుగా పంపకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పైసలు ముట్టచెప్పకపోతే పౌరసేవల్లో తీవ్ర జాప్యం చేస్తూ ప్రజాసేవలను పరిహాసం చేస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ–ఆఫీస్‌లో 12,082 దరఖాస్తులు రాగా అందులో సిటిజన్ చార్టర్ ప్రకారం 4,127 పరిష్కరించారు. మిగతా 7,955 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా రెండు సర్కిల్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడమే ఉద్యోగుల అవినీతికి నిదర్శనమని చెప్పొచ్చు. కొందరు క్షేత్ర స్థాయి సిబ్బంది, కార్యాలయాల్లోని క్లర్కులు, సూపరింటెండెంట్లు, ఆపై అధికారులు, ఉన్నతాధికారులు వరకు వసూలు చేసినా సొమ్మును భాగాలుగా వేసి ఎవరికి నిర్ధేశించిన మొత్తాన్ని వారికి పువ్వుల్లో పెట్టి అందచేయడం సర్కిల్ కార్యాలయాల్లో ఓ ‘మామూలు’ వ్యవహరంగా మారింది. అయితే, సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలపై పాలక వర్గం కానీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకోకపోవడంతో అవినీతి హెచ్చరిల్లుతోంది. పన్నుల విభాగంలో లంచాల గోల.... పన్నుల విభాగంలో అవినీతి మూడు పూలు ఆరు కాయాలుగా విస్తరించింది. కొందరు ఆర్ఓలు, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, క్లర్కులు, సూపరింటెండెంట్లు దోపిడీ పర్వాన్ని యథేచ్చగా కొనసాగిస్తున్నారు. అధునాతన భవనానికి ఆర్డినరీగా పన్ను విధించడం, ఏదైనా ఒక భవనంలోని కొన్ని గదులు కమర్షియల్ రూపంలో అద్దెకు ఇచ్చినా రెసిడెన్షియల్‌గా, కొన్ని గదులను అద్దెకిస్తున్నా యాజమానే మొత్తం వాడుకుంటున్నట్లు, అసలే అసెస్మెంట్ చేయకుండా, రివిజన్ పిటిషన్ పేరుతో పన్ను తగ్గిస్తూ ఇలా బల్దియాకు సమకూరాల్సిన రూ.కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆమ్యామ్యాలు పుచ్చుకోవడం ద్వారా కొల్లగొడుతున్నారు. అవినీతి ప్రణాళిక: ప్రణాళిక విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. భవన నిర్మాణ అనుమతులకు ‘ఆన్లైన్’ ద్వారా దరఖాస్తు చేసుకోవడం వల్ల సకాలంలో మంజూరు కాకపోవడంతో పాటు అనేక నిబంధనలు అడ్డువస్తున్నాయి. దీంతో అనధికారిక నిర్మాణాల జోరు కొనసాగుతోంది. ఆన్లైన్ దరఖాస్తుల్లో ఏ ఒక్క పత్రం లేకున్నా అనుమతి రావడం లేదు. కాలం చెల్లినా మాస్టర్ ప్లాన్, అనుమతుల్లో జాప్యం, అధికారులు, సిబ్బంది ఒత్తిళ్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో అనధికారిక నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇలా అనధికారికంగా జరిగే నిర్మాణాల యజమానుల నుంచి వసూలు చేసే మొత్తాన్ని అందరూ పంచుకుంటున్నారని తెలుస్తోంది. ఇక వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమానులు ట్రేడ్ లైసెన్స్ పొందాలంటే రూ.3 నుంచి 5వేల వరకు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బందికి ముట్టచెప్పాల్సిందే. లేదంటే సమీపంలోని షాపులు, ఇళ్ల వారి నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ తీసుకురావాలనే నిబంధనలు చూపెడుతూ దండుకుంటున్నారు. నల్లా కనెక్షన్ విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. నల్లా కనెక్షన్ కావాలంటే బల్దియాకు అన్ని రకాల ఫీజులు చెల్లించినా రూ.3వేల నుంచి10వేల వరకు ఇంజినీర్లకు సిబ్బందికి ముట్టచెప్పాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. పర్యవేక్షణ కరువై సర్కిల్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడింది. ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు కార్యకలాపాలపై తరచుగా పర్యవేక్షిస్తే ప్రజలకు కొంత మేరకు పారదర్శకమైన సేవలు లభిస్తాయి. అలాంటివేవీ లేకపోవడంతో సర్కిల్ అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. అలాగే, పాలక వర్గం పెద్దలు కూడా పట్టించుకోకపోవడం ప్రజల ఇబ్బందులకు కారణమవుతోంది. -
అవి‘నీటి’ ధారలు
బహుళ అంతస్తులకూ సాధారణ కనెక్షన్లు కమర్షియల్ భవనాలదీ అదే తీరు నిబంధనలకు విరుద్ధంగా నల్లాల ఏర్పాటు 545 మీటర్లలో పనిచేయనివి 210 పట్టించుకోని గ్రేటర్ పాలకవర్గం మహా నగరపాలక సంస్థకు ఏటా రూ.10 కోట్ల మేర గండి వరంగల్ అర్బన్ : సాధారణంగా నలుగురు సభ్యులు ఉన్న ఓ కుటుంబం నల్లా నీళ్లు వాడుకున్నందుకు నెలకు రూ.150 చొప్పున బిల్లు చెల్లిస్తున్నారు. అంతే సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉన్న పది నుంచి ఇరవై కుటుంబాలు నివసించే అపార్ట్మెంట్ల యజమానులు సైతం అదే బిల్లు చెల్లిస్తున్నారు! అంతేకాకుండా షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు భారీ భవనాలకు సైతం సాధారణ నల్లా కనెక్షన్లను తీసుకోవడం.. పెద్దసైజులో పైపులు బిగించుకుని ఇష్టారాజ్యంగా నీళ్లు లాగుతున్నారు. ఇదంతా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘మాములు’గా జరుగుతోంది. ఇదంతా గుట్టుగా కాదు.. బల్దియా ఇంజినీర్లు, ఉన్నతధికారులు, పాలకవర్గానికి తెలిసే జరుగుతున్నా పెద్దలపై ప్రేమతో వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఏం జరుగుతోంది...? అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, చిన్న, మధ్యతరగతి, స్టార్ హోటళ్లే కాకుండా ఫంక్షన్ హాళ్ల బాధ్యులు నిబంధనల ప్రకారం కమర్షియల్ నల్లా కనెక్షన్లు తీసుకోవాలి. ఇందుకోసం తొలుత గ్రేటర్‌కు రూ.లక్ష డిపాజిట్ చెల్లించడమే కాకుండా రోడ్డు కటింగ్, ఇతరత్రా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీటి మీటర్లను సైతం వినియోగదారులే బిగించుకోవాలి. ఆయా మీటర్లలో నమోదయ్యే రీడింగ్‌ను నెలకోసారి బల్దియా సిబ్బంది సేకరించి వాడుకున్న నీటిలో లీటర్ల వారీగా పన్ను వసూలు చేయాలి. కానీ ఈ నిబంధనలను అటు ఉద్యోగులు, ఇటు యజమానులు ఖాతరు చేయడం లేదు. 4 నుంచి 6 వేల కనెక్షన్లు.. మహా నగరంలో 19,500 వరకు వాణిజ్యపరమైన భవనాలు ఉండగా, 18,373 మంది ట్రేడ్ లెసైన్‌సలు పొందారు. ఈ లెక్కన నగరంలో 4 నుంచి 6వేల వరకు కమర్షియల్ నల్లాలు ఉండాలి. కానీ ట్రైసిటీలో 545 కమర్షియల్ నల్లాలే ఉన్నట్లుగా బల్దియా లెక్కలు చెబుతున్నారుు. నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణ కోటాలో వాణిజ్య అవసరాలకు నల్లా కనెక్షన్లు ఇస్తున్నట్లు దీని ప్రకారం అర్థమవుతోంది. స్థానిక ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది చేతులు తడుపుతున్న కొందరు గృహ నిర్మాణ కోటాలో వాణిజ్య అవసరాలకు నల్లా నీటిని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. మీటర్లకు బ్రేక్ ట్రైసిటీలో అధికారిక లెక్కల ప్రకారం 545 కమర్షియల్ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 335 నల్లాలకు సంబంధించిన మీటర్లే రీడింగ్ చూపిస్తున్నాయి. మిగిలిన 210 నల్లా రీడింగ్ మీటర్లు పాడయ్యాయి. ఈ మీటర్లు తిరగక నెలో, రెండు నెలలో కాదు.. ఐదేళ్లు దాటుతోంది. అంటే వాణిజ్య అవసరాలకు వేల సంఖ్యలో సాధారణ నల్లా కనెక్షన్లుగా నీటిని వాడుకుంటుండగా.. నిబంధనల ప్రకారం కనెక్షన్ తీసుకున్న వారి మీటర్లు సైతం తిరగడం లేదన్న మాట! ఇలా రెండు విధాలుగా బల్దియా ఖజానాకు గండి పడుతోంది. లెక్కల్లో గోల్మాల్ సామాన్యుల నుంచి ముక్కుపిండి నల్లా పన్నులు వసూలు చేసే బల్దియా సిబ్బంది.. వాణిజ్య అవసరాలకు నీటిని ఉపయోగిస్తున్న వారిని చూసీచూడనట్లు వదిలేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక పలుచోట్ల నల్లా మీటర్లు తిరగకపోవడంతో సాధారణ కనెక్షన్ల ప్రకారం రూ.150 చొప్పున పన్ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటిలో ఎన్నింటికి వాణిజ్య నల్లా కనెక్షన్లు ఉన్నాయి.. ఇందులో అన్నింటికీ మీటర్లు ఉన్నాయా, ఉంటే పనిచేస్తున్నాయా, లేదా అనే విషయం అంతుచిక్కడం లేదు. బల్దియా ఇంజినీర్లు కూడా వీటిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో వ్యాపార, వాణిజ్య సంస్థల్లో తనిఖీ చేస్తేఅక్రమ కమర్షియల్ కనెక్షన్లు వెలుగులోకి రానున్నాయి. తద్వారా అన్నింటికీ మీటర్లు బిగించి, లెక్క ప్రకారం పన్ను వసూలు చేస్తే బల్దియాకు ఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని కొందరు ఇంజినీరింగ్ విభాగం అధికారులే చెబుతున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, పాలకవర్గం పెద్దలు ఎప్పటికి స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
‘పుర’ పొత్తులపై నిర్ణయం మీదే
జిల్లా పార్టీలకు అధికారం కట్టబెట్టిన సీపీఐ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల్లో స్థానిక పొత్తులకు సంబంధించిన నిర్ణయాధికారం జిల్లా పార్టీలకే కట్టబెడుతూ సీపీఐ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఖమ్మం ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కలసి పోటీచేస్తే కొంత ప్రయోజనం ఉంటుందని జిల్లా పార్టీ నుంచి సీపీఐ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే వామపక్షాలుగా సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేద్దామని, కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం ససేమిరా అంటుండడంతో మధ్యే మార్గంగా సీపీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే సీపీఎంతో ఒకసారి చర్చలు జరపగా, కాంగ్రెస్‌తో పొత్తును ఆ పార్టీ నేతలు తోసిపుచ్చారు. అయితే సీపీఎంతో మరోసారి చర్చించాలని సోమవారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గభేటీలో నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం కలసి పోటీచేస్తే సీపీఎంకే లాభం తప్ప సీపీఐకు ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వామపక్షాలకు కొంత బలమున్న ఖమ్మం కార్పొరేషన్లో మూడు పార్టీలూ కలసి వెళ్లాలని, లేనిపక్షంలో కాంగ్రెస్‌తో కలసి పోటీచేస్తే ఒకటి, రెండు సీట్లయినా గెలిచే అవకాశం ఉంటుందని ఖమ్మం సీపీఐ నాయకులు పట్టుపడుతున్నారు. రాష్ట్ర పార్టీగా కాకుండా జిల్లా పార్టీకే పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ నిర్ణయించింది. మరోవైపు సీపీఐతో అవగాహన కుదుర్చుకునేందుకు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు సైతం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తుకు అవకాశం లేదని సీపీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక వరంగల్ కార్పొరేషన్కొస్తే, వామపక్షాలకు పెద్దగా బలం లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్‌తో ఈ రెండు పార్టీలు సర్దుబాటు చేసుకునే అవకాశముందని అంటున్నారు. -
నిర్లక్ష్యంతో నిధుల గల్లంతు..?!
- యూసీ సమర్పించడంలో బల్దియా జాప్యం - కన్నెర్ర చేసిన కేంద్ర ప్రభుత్వం - రూ. 20 కోట్లపై నీలినీడలు - మధ్యలో ఆగిన 60 పనులు - జనరల్ ఫండ్ వైపు చూపులు సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరపాలక సంస్థ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ. 20 కోట్ల నిధులు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నిధుల ఆధారంగా చేపడుతున్న అరవైకి పైగా వివిధ రకాల పనులు మధ్యలో ఆగిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు జనరల్ ఫండ్ ద్వారా చేపట్టేందుకు బల్దియా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యూసీ సమర్పించడంలో నిర్లక్ష్యం.. పద మూడో ఆర్థిక ప్రణాళిక కింద ఐదేళ్ల కాలవ్యవధి (2010-15)లో వివిధ అభివృద్ధి పథకాల కోసం కార్పొరేషన్ అధికారులు రూ. 51.31 కోట్ల విలువైన ప్రతిపాదనలు రూపొందిం చారు. అయితే వీటి ప్రకారం కేంద్రం ఒక్కో ఆర్థిక సంవత్సరానికి విడతల వారీగా నిధులు మంజూరు చేసింది. గత నాలు గేళ్లలో రూ.35.56 కోట్లు విడుదలయ్యాయి. కాగా, ఈ నిధులు ఖర్చు చేసిన విధానంపై ధ్రువీకర ణ పత్రాన్ని(యుటిలిటీ సర్టిఫికెట్, యూసీ) కార్పొరేషన్ అధికారులు కేంద్రానికి సమర్పించలేదు. నాలుగేళ్లకు సంబంధించి రూ 35.56 కోట్లు ఖర్చు చేసిన అధికారులు కేవలం రూ .2.38 కోట్లకు సంబంధించిన యూసీలనే కేంద్రానికి పంపించారు. దాంతో చివరిదైన 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ 16.73 కోట్లను కేంద్రం విడుదల చేయకుండా నిలిపేసింది. మరోవైపు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పద మూడో ఆర్థిక ప్రణాళిక కింద కార్పొరేషన్‌కు రావాల్సిన రూ 16.73 కోట్ల నిధుల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే తరహా పొరపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్జీఎఫ్) నిధుల విషయంలో దొర్లడంతో రూ 3.23 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి. బీఆర్జీఎఫ్ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7.38 కోట్లకు మంజూరు చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు రూ.4.15కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన రూ. 3.23 కోట్ల నిధులు ఇవ్వలేమంటూ కార్పోరేషన్ అధికారులకు కేంద్రం లేఖను పంపింది. జనరల్ ఫండ్‌కు ఎసరు..! బీఆర్జీఎఫ్, పదమూడో ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు మొత్తం రూ.19.96 కోట్లు నిలిచిపోవడంతో వాటి ఆధారంగా చేపడుతున్న పనులు ఏ విధంగా పూర్తి చేయాలనే అంశం పై కార్పొరేషన్ అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. అయితే నిధుల ఆధారంగా చేపడుతున్న అరవైకి పైగా అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లుల చెల్లింపు, సగంలో ఆగిన పనులు ఏ రకంగా పూర్తి చేయాలనే అంశంపై కార్పొరేషన్ అధికారులు కిందా మీదా అవుతున్నారు. చివరకు ఈ బిల్లుల చెల్లింపునకు జనరల్ ఫండ్ నిధుల ద్వారా చెల్లించేందుకు పావులు కదుపుతున్నారు. సాధారణంగా జనరల్ ఫండ్‌ను అత్యవసర పనులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులకే ఉపయోగించాలి. కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జనరల్ ఫండ్ నిధులపై కన్నేశారు. -
నాటు కోడి.. కల్లు సీసా..
పని చేయకున్నా జీతం మాట వినకుంటే అదనపు పని కార్పొరేషన్లో ఓ ఉద్యోగి లీలలు నెలకు రెండు, మూడు సార్లు సార్ నుంచి ఫోన్ వస్తుంది. రెండు సీసాల కల్లు, నాటు కోడిపులుసు,ఓ మద్యం బాటిల్ ఇస్తే చాలు. నెలంతా పని చేయకున్నా జీతం పొందవచ్చు. కాదని సార్ మాటకు ఎదురుచెబితే అంతే. వరంగల్ నగర పాలక సంస్థలో ఓ అధికారి తీరు.. హన్మకొండ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో నీటి సరఫరా, చెత్త సేకరణ తదితర పనుల కోసం టిప్పర్లు, ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు ఉన్నాయి. వీటిని నడిపేందుకు సంస్థ పరిధిలో 56 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగులకు నెలకు రూ.10,160 వేతనం చెల్లిస్తున్నారు. హాజరు, సెలవులు తదితర వ్యవహారాలు పర్యవేక్షించే ఉద్యోగి నుంచి డ్రైవర్లకు నిత్యం వేధింపులు ఎదురవుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండే డ్రైవర్లను ఒక విధంగా.. మాట విననివారిని టార్గెట్ చేయడం నిత్యకృత్యంగా మారిం ది. దీనితో సార్‌ను మచ్చిక చేసుకుంటే చాలు అనే ధోరణి డ్రైవర్లలో పెరిగింది. తమకు కేటాయించిన పనిని పక్కన పెట్టి సదరు ఉద్యోగి పనిచేసి పెడితే చాలు. ఈ అంశంలో పైస్థాయి అధికారులకు కొన్ని పనులు జరుగుతుండటంతో ఎవరూ వ్యవహారంపై పెదవి విప్పడం లేదు. దీని కారణంగా పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్ము అధికారి విలాసాలకు ఖర్చైపోతుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. రాంపూర్ డంపింగ్ యార్డులో చెత్తను పక్కకు జరిపే డోజర్‌ను నడిపే డ్రైవర్‌కు ఇన్ఫెక్షన్ సోకి పది రోజులు ఆస్పత్రి పాలయ్యాడు. విధి నిర్వహణలో అనారోగ్యం పాలయినా ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా జీతంలో కోత విధించారు. అదేసమయంలో తమకు అనుకూలంగాా ఉన్న ఓ డ్రైవర్‌కు చేయి బెనికిందనే సాకుతో ఎనిమిది నెలలుగా జీతం చెల్లిస్తున్నారు. ఈ విధానం బాగుండటంతో ప్రస్తుతం అనారోగ్య కారణం పేరుతో పని లేకుండా నలుగురు డ్రైవర్లు నెలల తరబడి జీతం పొందుతున్నారు. రాంపూర్ డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న తాటిచెట్ల కల్లు గీసేందుకు ఓ డ్రైవర్‌కు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి సదరు డ్రైవరుకు వాహనాలు నడిపించడం కంటే ఈ రెండో పని చేయడమే ఎక్కువగా జరుగుతోంది. ఏడాది కిందట ఓ డ్రైవరు చనిపోతే అతని స్థానంలో సరైన అర్హతలు లేని వ్యక్తికి డ్రైవరుగా ఉద్యోగం కల్పించడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారం సదరు ఉద్యోగి కనుసన్నల్లోనే జరిగిందని.. రూ.2 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపించాయి. {పజారోగ్య విభాగం, అకౌంట్స్ విభాగాల్లోని ఉన్నతాధికారులకు అద్దె ప్రతిపాదికన కార్లను కార్పొరేషన్ కేటాయించింది. ఈ కారు డ్రైవర్ల జీతభత్యాలను కాంట్రాక్టర్లే చెల్లించాలి. కానీ.. కార్పొరేషన్ నుంచి జీతం తీసుకునే డ్రైవర్లకు పని అప్పగిస్తున్నారు. పై అధికారుల నుంచి ఒత్తిడి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆఖరికి రాంపూర్ డంప్‌యార్డులో చెత్త ఏరుకునే వారి దగ్గర నుంచి అనధికార సభ్యత రుసుముగా నెలకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. కాదంటే వారిని లోపలికి రానివ్వడం లేదు. -
‘ఈపీఎఫ్’ ఝలక్
వరంగల్ నగరపాలక సంస్థకు రూ.2.80 కోట్ల జరిమానా బల్దియా బద్దకంతో ప్రావిడెండ్ ఫండ్ చెల్లించని వైనం గతంలో ఈఎస్ఐ షాక్‌తో మారని అధికార యంత్రాంగం కమిషనర్ చొరవతో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని వేడుకోలు వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థకు ఈపీఎఫ్ శాఖ ఝలక్ ఇచ్చింది. అవుట్ సోర్సింగ్ కార్మికుల సొమ్మును సకాలంలో జమ చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పపట్టింది. రూ.2.80 కోట్ల జరిమానా చెల్లించాని హుకూం జారీ చేసింది. చెల్లించక పోతే ఆర్ఆర్ చట్టం కింద బల్దియా బ్యాంక్ ఖాతాల సొమ్మును రికవరీ చేసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో మహా నగరపాలక సంస్థ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. కాగా, గతేడాది కూడా బల్దియూ అధికారుల నిర్లక్ష్యంతో రూ.71 లక్షలు జరిమానా పడింది. ఈ సొమ్ము నేరుగా బల్దియా ఎస్బీహెచ్ బ్యాంక్ నుంచి నేరుగా ఈఎస్ఐ శాఖ ఖాతాల్లోకి మళ్లింది. అరుునా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడలేదు. తీరుమారని బల్దియూ 2010 సంవత్సరంలో రాష్ర్ట ప్రభుత్వం నగర పాలక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్యంలో కాంట్రాక్టు పద్ధతిపై 1,431 మంది పారిశుదధ్య కార్మికులు, 66 మంది జవాన్లు, 277 మంది ట్రై సైకిల్ కార్మికులు, అర్బన్ మలేరియా విభాగంలో 60 మంది కార్మికులు, 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. దీంతో అదే ఏడాది ఆగస్టు నుంచి నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది వేతనాల్లో ఫీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము మినహా ఇస్తున్నప్పటికీ కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం లేదు. పలుమార్లు ఈఎస్ఐ, ఈఫీఎస్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నోటీసులు, మోమోలు అందచేశారు. అయినా బల్దియా అధికారులు, సిబ్బంది పెడచెవిన పెట్టారు. దీంతో ఈపీఎఫ్ శాఖ అధికారులు బల్దియాపై కొరఢా ఝులిపించారు. సకాలంలో ఈపీఎఫ్ సొమ్ము జమ చేయని కారణంగా జరిమానగా రూ.2.80 కోట్లు చెల్లించాలని కొద్ది నెలల కిందట నోటీసులు జారీ చేశారు. తాజాగా మారోమారు ఈపీఎఫ్ శాఖ నుంచి బల్దియాకు నోటీసులు అందాయి. ఇటీవల బల్దియా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్పరాజ్ అహ్మద్ దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగారు. ఈపీఎఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మొయిన్ బ్రాంచ్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అధికారులతో సమావేశమైమయ్యారు. జరిమానా సొమ్ము చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ శాఖల అధికారులు సూచించారు. జరిమానా సొమ్ము వాయిదా పద్ధతిలో చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు, సిబ్బంది తీరులో మార్పు రావాల్సి ఉందని కమిషనర్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. -
బల్దియా బద్ధకం !
* యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం * రూ.52 లక్షలకు చేరిన బకాయిలు * పన్ను చెల్లించని హోటళ్లు,బార్లు, ఫంక్షన్ హాళ్లు సాక్షి, హన్మకొండ: అభివృద్ధి పనులు చేపట్టడంలోనే కాదు... ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలోనూ వరంగల్ నగరపాలక సంస్థ పనితీరు నిద్రమత్తును తలపిస్తోంది. వ్యాపార రంగంలో పేరెన్నిక గల బడా సంస్థల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయలేక అధికారులు చతికిలపడుతున్నారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లకు సంబంధించి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయూల్సిన బకాయిల విషయంలో కనీస మాత్రంగా విధులు నిర్వర్తించడంలేదు. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో ఈ మూడు కేటగిరిల సంస్థలు చెల్లించాల్సిన యూజర్ చార్జీలే రూ.51.65 లక్షలకు చేరుకున్నాయి. నగర పరిధిలో వాణిజ్య పరంగా సేవలు అందిస్తున్న హోటళ్లు, బార్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి నిత్యం వెలువడే చెత్తను సేకరిస్తున్నందుకు ఆయా సంస్థల నుంచి వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ యూజర్ చార్జీలు వసూలు చేయాలి. వీటి ని కేటగిరీల వారీగా విభజించి నెలకు కనిష్టంగా రూ.1000 నుంచి రూ.4,500 వరకు నిర్ణయించారు. ప్రతి నెలా మొదటివారంలోనే ఈ యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా... నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో యూజర్ చార్జీలు చెల్లించడంలో బడా సంస్థలు సైతం మొండికేస్తున్నాయి. స్టార్ హోటళ్లు 11 ఉండగా, ఒక్కొక్కటి నెలకు రూ.4500, మధ్య తరహా హోటళ్లు 12 ఉండగా, ఒక్కొక్కటి రూ.2500... చిన్న హోటళ్లు 82 ఉండగా, ఒక్కొక్కటి రూ.750 చొప్పున యూజర్ చార్జీ చెల్లించాలి. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లు ఒక్కొక్కటి నెలకు రూ.1200, చిన్న ఫంక్షన్ హాళ్లు రూ.1000 చెల్లించాలి. అవి సక్రమంగా వసూలు చేయకపోవడంతో గత ఏడాదికి యూజర్ చార్జీల రూపంలో రావాల్సిన రూ. 49.51 లక్షలు బకాయిలుగా పేరుకుపోయాయి. 2015 జనవరికి సంబంధించి ఈ మొత్తం రూ 2.14 లక్షలుగా ఉంది. యూజర్ చార్జీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు బల్దియా ఖజానాకు మొత్తం రూ.51.65 లక్షల ఆదాయం సమకూరుతుంది. బార్లదే అగ్రస్థానం యూజర్ చార్జీలను ఎగవేయడంలో బార్, రెస్టారెంట్లది అగ్రస్థానంగా ఉంది. నగర పరిధిలో మొత్తం 78 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు నెలకు రూ.1500, వైన్స్ దుకాణాలు రూ.1000 వంతున యూజర్ చార్జీలు చెల్లించాలి. బల్దియా లెక్కల ప్రకారం బార్లు, వైన్స్‌కు సంబంధించి యూజర్ చార్జీల బకాయిలు రూ. 22.84 లక్షలు ఉన్నాయి. వీటిలో మహర్షి (రాంపూర్), వెంకటరమణ (కాపువాడ), మధుశాల (ఏనుమాముల), ఆరుముఖ (కరీమాబాద్), మేఘన (హంటర్‌రోడ్డు), న్యూవాహిణి (అండర్‌బ్రిడ్జి), శ్రీవాసవి (ఫోర్టురోడ్డు), శ్రీవెంకటేశ్వర (ఎస్పీవీరోడ్డు), శ్రీవర్ష (ఎంజీరోడ్డు),శ్రీ శ్రావణి (ఎంజీరోడ్డు), కావేరి (ఎస్వీఎన్ రోడ్డు), శ్రీరుద్రాక్షిణి (ఎంజీ రోడ్డు), శ్రీబాలాజీ (దేశాయిపేట), శ్రీలక్ష్మి (దేశాయిపేట), సురేశ్ (నర్సంపేట రోడ్డు), భార్గవి (ఎల్బీనగర్), గిరిజ (లక్ష్మీపురం), మౌనిక(న్యూబస్టాండ్), రవిశివాజీ (విజయాటాకీస్ రోడ్డు), రామకృష్ణ (లష్కర్‌బజార్), రామా (హనుమాన్‌నగర్), శ్రీబాలాజీ (కిషన్‌పుర), రాజాశివాజీ (కొత్తూరు), న్యూ శ్రీనివాస (కుమార్‌పల్లి), మాతా (కుమార్‌పల్లి), తిరుమల (సర్క్యుట్హౌజ్), వెంకటేశ్వర (నక్కలగుట్ట),లాండ్‌మార్కు( నక్కలగుట్ట), ట్విలైట్ (బాలాసముద్రం), డాల్ఫిన్ (సుబేదారి), సోనా (సిద్ధార్థనగర్), శ్రీభవాని (సిద్దార్థనగర్)ు ఒక్కొక్కటి రూ 37,500 వంతున బకాయి చెల్లించాల్సి ఉంది. మిగిలిన బార్, రెస్టారెంట్లు బకాయిల చెల్లింపులో వీటి తర్వాత స్థానంలో ఉన్నాయి. భారీ బకాయిలు ఉన్న సంస్థలు... యూజర్ చార్జీల బకాయిల్లో నగరంలోని వివిధ హోటళ్లు రూ.15.14 లక్షలు, ఫంక్షన్ హళ్లు రూ 11.86 లక్షలు చెల్లించాల్సి ఉంది. వరంగల్ నగరపాలక సంస్థ రికార్డుల ప్రకారం హోటళ్ల విభాగంలో సుప్రభ హోటల్ రూ.1,12,500 బకాయి ఉండగా, రాజ్ లాడ్జ్, హవేలీ మల్టీ కుజిన్ రెస్టారెంట్, జూలూరి హోటల్, వరంగల్ బిర్యానీహౌస్, తయ్యాబ్ బిర్యానీ హౌజ్, శ్రీమంజునాథ హోటల్, నక్షత్ర హోటల్ యాజమాన్యాలు ఒక్కొక్కటి రూ. 62,500 వంతున యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు న్యూ ఫ్యామిలీ, సిటీదాబా రూ. 57,500, కాకతీయ హోటల్, అశోకా కాంప్లెక్స్ రూ. 45,000, నక్కలగుట్ట సురభి ఫుడ్కోర్ట్ రూ.1,12,500 బకాయి పడ్డాయి. ఫంక్షన్ హాళ్ల విభాగంలో పుష్పాంజలి, రాయల్, ఈడెన్ , చంద్ర, అనిల్ ఫంక్షన్‌హాళ్లకు సంబంధించిన యాజమాన్యాలు ఒక్కొక్కరు రూ 30,000 వంతున బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
అంతా మా ఇష్టం..
ఆగని ‘కళ్యాణలక్ష్మి’ కబ్జా నిబంధనలు హుష్‌కాకి కార్పొరేషన్ అధికారుల నిద్రమత్తు పార్కింగ్ కోసం నాలాపై స్లాబ్ నిర్మాణం విమర్శలు వెల్లువెత్తుతున్న వైనం హన్మకొండ : వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతు న్న పనుల్లో పారదర్శకత లోపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను కార్పొరేషన్ అధికారులు తమ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలకు కళ్యాణలక్ష్మి షాపిం గ్‌మాల్ ఎదుట ఉన్న నాలాపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణమే అద్దం పడుతోంది. కేవలం పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే బల్దియా అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. హన్మకొండ న గర నడిబొడ్డున ‘కళ్యాణలక్ష్మి నాలా స్లాబ్’ వ్యవహారంపై బల్దియా అధికారులు స్పందించిన తీరు ఇలా ఉంది. ఆగష్టు 2వ తేదీ.. ఫండ్ యువర్ సిటీలో నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ వ్య క్తులు నగరంలో ఏదైనా పని చేపట్టాలంటే ముందుగా నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్పొరేష న్ బహిరంగ నోటీసులు జారీ చేస్తుంది. సదరు పనిపై ప్ర జాభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. అభ్యంతరాలు, సూచనలు పరిశీలించి అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తాం. అనుమతి ఇస్తేనే నిర్మాణాలు జరపాలి. అనుమతి రాకుండా నిర్మాణం చేపడితే కూల్చివేస్తాం. కళ్యాణలక్ష్మి షా పింగ్ మాల్ ఎదురు నాలాపై నిర్మాణం కోసం కొందరు దరఖాస్తు చేశారు. అయితే అనుమతి ఇవ్వకముందే పను లు ప్రారంభించినందున నిర్మాణాన్ని నిలిపివేశాం. ఆగష్టు 20వ తేదీ.. ఫండ్ యువర్సిటీ కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ ఎదురు నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందు కు బల్దియా కమిషనర్ సువర్ణపండాదాస్ అనుమతించారు. దాని ప్రకారమే వారు నిర్మాణం చేపడుతున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్‌కు వెళ్లే దారి నిత్యం ర ద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం తమ దుకాణానికి వచ్చే కస్టమర్లు వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టింది. దీంతో ట్రాఫిక్ సమస్య లు పెరుగుతాయని తెలిసినా పట్టించుకోకుండా తమ వ్యా పారం సాఫీగా సాగితే చాలనే విధంగా 2012లో సదరు యాజమాన్యం స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి కలెక్టర్ రాహుల్బొ జ్జా, మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్ యాజమాన్యం పై కన్నెర్ర జేశారు. అనంతరం అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చి వేయించారు. ఇదిలా ఉండగా, సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం మరోసారి పనులు ప్రారంభించింది. కాగా, ఈ నిర్మాణంపై నగర పాలక సంస్థ సిటీ ప్లానింగ్ అధికారి రమేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా... ఫండ్ యువర్ సిటీ పథకం ద్వారా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత సంతృప్తి చెందినేతే నిర్మాణానికి అనుమతి ఇస్తామ ని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యా నికి కార్పొరేషన్ అనుమతి రాకముందే నిర్మాణం ప్రారంభించినందున పనులు నిలిపేశామని చెప్పారు. కాగా, సరిగ్గా పద్దెనిమిది రోజుల తర్వాత కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం నాలాపై తిరిగి స్లాబ్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకుండా... ఎవరి నుంచి అభ్యంతరాలు స్వీకరిం చకుం డా పనులు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నిర్మాణంపై సిటీ ప్లానింగ్ అధికారిని ‘సాక్షి’ మరోసారి వివరణ అడగగా... ప్రజాభిప్రాయ సేకరణ.. అభ్యంతరాల స్వీకరణపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కమిషనర్ సువర్ణపండాదాస్ అ నుమతి ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
రశీదుల్లేవ్.. అంతా జేబులోకే..!
నగర పాలక సంస్థలోని శానిటరీ విభాగంలో మరో దందా రూ.లక్షలు గడిస్తున్న జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బల్దియూ ఆదాయూనికి గండి చెత్తపారబోస్తే జరిమానాలు చిరువ్యాపారులపై పెను ప్రభావం హన్మకొండ : వరంగల్ నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య విభాగం పాలన గాడి తప్పుతోంది. చెత్తపేరిట జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు డబ్బులు గుంజుతూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఫలితంగా బల్దియూ ఆదాయూనికి గండిపడుతోంది. ఈ అక్రమ దందాపై చర్యలు తీసుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు మిన్నకుండి పోతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ జరుగుతోంది. దీనికి సమాంతరంగా రోడ్ల వెంట చెత్తాచెదారం పారబోసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలకు నగరపాలక సంస్థ ఉపక్రమించింది. ఇందులో భాగంగా రోడ్లపై చెత్త వేస్తున్న చిరు వ్యాపారులు, వాణిజ్య సముదాయ నిర్వాహకులకు పేరుకుపోరుున చెత్తను బట్టి రూ.300, రూ.500, రూ.1000 జరిమానా విధిస్తున్నారు. ఈ బాధ్యతలు శానిటరీ విభాగంలో పనిచేసే జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు చూసుకుంటున్నారు. వచ్చిన డబ్బును నగరపాలక సంస్థ ట్రెజరీలో జమ చేయాలి. అడిగినంత.. పక్షం రోజులగా కొందరు జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు జరిమానాల పేరిట రశీదులు జారీ చేయకుండా జేబులు నింపుకుంటున్నారు. బయటకు నామామాత్రంగా జరిమానలు విధిస్తూ రశీదులు జారీ చేస్తున్నా.. లోపాయికారీగా చిరువ్యాపారులు, వాణిజ్య సముదాయాలు, దుకాణాదారుల నుంచి రూ.200-రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే రశీదు కావాలంటే రూ.1000 జరిమానా కట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న చిరువ్యాపారులు అడిగినంత ముట్టజెప్పుతున్నారు. అక్రమ వసూళ్లు రెండు రోజుల క్రితం వరంగల్ బీట్జబార్, బట్టలబజార్, ఆర్ఎన్టీ రోడ్డులో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కనీసం రూ.300 ఇవ్వనిదే కుదరదంటూ చిరువ్యాపారులపై తమ ప్రతాపం చూపించారు. దీంతో కొందరు చిరువ్యాపారులు ఎదురు తిరిగారు. ఈ ఘటనతో ఈ నయాదందా మొదటిసారి వెలుగులోకి వచ్చింది. వరంగల్‌తో పాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోనూ చిరువ్యాపారులపై ఇదే తరహాలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనితో క్రమంగా ఆస్పత్రులు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, తినుబండారాల షాపుల నిర్వాహకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక చికెన్, మటన్ సెంటర్లు, చేపల అమ్మకం దార్లు, పండ్ల విక్రయాదారులపై వీరి ఆగడాలు శృతి మించుతున్నారుు. వీరికి రకరకాల నిబంధనలు వివరిస్తూ నెలవారీగా రూ.500 నుంచి రూ.1000 వరకు రశీదుల్లేకుండా డబ్బులను గుంజుతున్నారు. ఇలా అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ములను ప్రజారోగ్య విభాగంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ వ్యవహారంలో తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
రాజకీయ వి‘భజన’..!
డివిజన్ల పునర్విభజనలో నిబంధనలకు తిలోదకాలు నగర పాలక సంస్థ అధికారుల తీరుపై అనుమానాలు వరంగల్ అర్బన్ : వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా పునర్విభజన చేయాల్సిన అధికారులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారనే ఆరోపణలు వినవస్తున్నాయి. హడవుడిగా, తప్పల తడుకగా, అస్పష్టమైన ముసాయిదాను తయారీ చేసిన వారు ఆ తర్వాత తప్పలను దిద్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల అదేశించిన నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నారు. ఈనెల 8న నూతన డివిజన్ల ముసాయిదాను ప్రకటించిన అధికారులు తిరిగి రద్దు చేసినట్లు చెప్పారు. మార్నాడు ఉదయమే అనేక మార్పులతో మారోమారు ముసాయిదాను విడుదల చేయడం గమనార్హం. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 9వ డివిజన్‌ను గ్రెయిన్ మార్కెట్ పరిధి, దయానంద కాలనీ, గిరిజన హాస్టల్ గృహ సముదాయం, యాకుబ్పూరా ప్రాంతాలు రైల్వే గేట్‌కు ఒకవైపు ఉంటాయి. పుప్పాలగుట్ట, ఏసీరెడ్డి నగర్, సీపీఎం గుడిసెలు, శివనగర్ హరిజనవాడ, ఖిలావరంగల్‌లోని తూర్పుకోట, పశ్చిమకోట, కాపువాడ, వడ్లవారి వీధి, గొల్లవాడ రైల్వే గ్రేట్ అవతలి ప్రాంతంలో ఉన్నాయి. ఈ కాలనీలకు ఎక్కడా పొంతన లేదు. బల్దియా అధికారులు చెబుతున్నట్లు రోడ్డు నెట్ వర్కింగ్ కూడా లేదు. మరి డివిజన్‌ను ఏ ప్రతిపాదికన రూపకల్పన చేశారో వారికే తెలియాలి. ఈ డివిజన్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 18వ డివిజన్లోని మేదరవాడ, జేపీఎన్ రోడ్డు, కృష్ణాకాలనీ, అండర్‌బ్రిడ్జి జేపీఎన్ రోడ్డు, సీకేఎం ఆస్పత్రి ఉండగా వీటికి తోడు అండర్ రైల్వే గేట్ అవతలి ప్రాంతంలోని శివనగర్, భూపేష్‌నగర్, ఫోర్టు రోడ్డు, పెరుకవాడ, రైల్వే గేట్, పాడిమాల్లారెడ్డి కాలనీలను ఏ ప్రతిపాదికన తీసుకున్నారో తెలియదు. విలీన గ్రామమైన ఏనుమాములలో సూమారు 15వేల జనాభా ఉంది. ఈ గ్రామాన్ని 2వ డివిజన్లోని కొన్ని వార్డులను, 12వ డివిజన్లోని మరి కొన్ని రెవెన్యూ వార్డులను మిలితం చేయడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 1వ డివిజన్‌గా రూపకల్పన చేసిన ఆరేపల్లిలోని కొన్ని రెవెన్యూ బ్లాక్‌లు తీసుకోగా, 58వ డివిజన్లో మరికొన్ని బ్లాక్‌లను తీసుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. విలీన గ్రామాలకు, నగర శివారులోని కాలనీలను జోడించి ముసాయిదాలో డివిజన్లను రూపకల్పన చేశారు. గతంలో రెండుమార్లుగా జరిగిన డివిజన్ల పునర్విభజనలో రాజకీయ జోక్యం ఉందనే నేపథ్యంలో టీడీపీకి చెందిన నాయకులు హైకోర్టును అశ్రయించారు. దీంతో రెండుమార్లు పునర్విభజన ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో చేపట్టిన పునర్విభజన అస్పస్టంగా, అశాస్త్రీయంగా, ప్రజలకు అసౌకర్యంగా ఉందని, అధికార పార్టీకి చెందిన నేతల అభిప్రాయాల మేరకే డివిజన్లు తయారు చేసినట్లు వాదనలు బలంగా వినవస్తున్నాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తమ డివిజన్లను అనూకూలంగా మార్చుకునేందుకు అధికారులను పావులుగా ఉపయోగించుకున్నారనే అరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే డివిజన్ల ముసాయిదాను పరీశీలించిన వివిధ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు డివిజన్ల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనాలు, సలహాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన అంశం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. -
ఇక.. స్థానిక ఎమ్మెల్సీ
జూలైలో ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కీలకం కానున్న జెడ్పీ చైర్మన్ ఫలితం సాక్షిప్రతినిధి, వరంగల్ : రెండేళ్లుగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడి ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందే ఈ ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో వరంగల్ నగర పాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఇటీవలే 58 డివిజన్ల ఏర్పాటకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి పూర్తయిన తర్వాత నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం అక్టోబరుతో ముగియనుంది. హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో సంబంధం లేకుండానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సంస్థలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తే... ఎమ్మెల్సీ ఎన్నికకు ముందే నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మెదక్ లోక్‌సభ ఎన్నికతోపాటే ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక దగ్గరపడే పరిస్థితి ఉండడంతో జిల్లాలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్యనేతలు పలువురు దీనిపై దృష్టి పెడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఈ ఎమ్మెల్సీ పదవికి పోటీపడనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ వర్గాల సమచారం ప్రకారం డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ పడతారని వినిపిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అదే పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. దీంతో జెడ్పీ క్యాంపు విషయంలో రెండు పార్టీల నేతలు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలు ఈ నెల 9న మొదలవుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత స్థానిక సంస్థల ప్రజానిధుల ప్రమాణస్వీకార ప్రక్రియ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన జూన్ 12 తర్వాత వారంలోపే ఇది జరిగే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల చైర్మన్లు, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇలా స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిస్తే వీరంతా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా చేరినట్లవుతుంది. జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది. కాంగ్రెస్ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండా మురళీధర్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించడంతో ఈ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. శాసనమండలి ఆరంభమైన మొదట్లో జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికయ్యారు. 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలు కలిపి మొత్తం 929 ఉన్నాయి. వరంగల్ నగరపాలక సంస్థలోని 58 డివిజన్లు మినహాయిస్తే... మిగిలిన 871 స్థానాలకు ప్రస్తుతం ప్రతినిధులు ఎన్నికయ్యారు. వీరు వారంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.