బల్దియా బద్ధకం ! | transfers in Warangal Municipal Corporation | Sakshi
Sakshi News home page

బల్దియా బద్ధకం !

Published Sat, Jan 17 2015 5:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

బల్దియా బద్ధకం !

బల్దియా బద్ధకం !

* యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం
* రూ.52 లక్షలకు చేరిన బకాయిలు
* పన్ను చెల్లించని హోటళ్లు,బార్లు, ఫంక్షన్ హాళ్లు

సాక్షి, హన్మకొండ: అభివృద్ధి పనులు చేపట్టడంలోనే కాదు... ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలోనూ వరంగల్ నగరపాలక సంస్థ పనితీరు నిద్రమత్తును తలపిస్తోంది. వ్యాపార రంగంలో పేరెన్నిక గల బడా సంస్థల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయలేక అధికారులు చతికిలపడుతున్నారు. హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లకు సంబంధించి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయూల్సిన బకాయిల విషయంలో కనీస మాత్రంగా విధులు నిర్వర్తించడంలేదు.

నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో ఈ మూడు కేటగిరిల సంస్థలు చెల్లించాల్సిన యూజర్ చార్జీలే రూ.51.65 లక్షలకు చేరుకున్నాయి. నగర పరిధిలో వాణిజ్య పరంగా సేవలు అందిస్తున్న  హోటళ్లు, బార్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి నిత్యం వెలువడే చెత్తను సేకరిస్తున్నందుకు ఆయా సంస్థల నుంచి  వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ యూజర్ చార్జీలు వసూలు చేయాలి. వీటి ని కేటగిరీల వారీగా విభజించి నెలకు కనిష్టంగా రూ.1000 నుంచి రూ.4,500 వరకు నిర్ణయించారు. ప్రతి నెలా మొదటివారంలోనే ఈ యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా... నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో యూజర్ చార్జీలు చెల్లించడంలో బడా సంస్థలు సైతం మొండికేస్తున్నాయి. స్టార్ హోటళ్లు 11 ఉండగా, ఒక్కొక్కటి నెలకు రూ.4500, మధ్య తరహా హోటళ్లు 12 ఉండగా, ఒక్కొక్కటి రూ.2500... చిన్న హోటళ్లు 82 ఉండగా, ఒక్కొక్కటి రూ.750 చొప్పున యూజర్ చార్జీ చెల్లించాలి. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లు ఒక్కొక్కటి  నెలకు రూ.1200, చిన్న ఫంక్షన్ హాళ్లు రూ.1000 చెల్లించాలి.

అవి సక్రమంగా వసూలు చేయకపోవడంతో గత ఏడాదికి యూజర్ చార్జీల రూపంలో రావాల్సిన రూ. 49.51 లక్షలు బకాయిలుగా పేరుకుపోయాయి. 2015 జనవరికి సంబంధించి ఈ మొత్తం రూ 2.14 లక్షలుగా ఉంది. యూజర్ చార్జీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు బల్దియా ఖజానాకు మొత్తం రూ.51.65 లక్షల ఆదాయం సమకూరుతుంది.
 
బార్లదే అగ్రస్థానం
యూజర్ చార్జీలను ఎగవేయడంలో బార్, రెస్టారెంట్లది అగ్రస్థానంగా ఉంది. నగర పరిధిలో మొత్తం 78 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు నెలకు రూ.1500, వైన్స్ దుకాణాలు రూ.1000 వంతున యూజర్ చార్జీలు చెల్లించాలి. బల్దియా లెక్కల ప్రకారం బార్లు, వైన్స్‌కు సంబంధించి యూజర్ చార్జీల బకాయిలు  రూ. 22.84 లక్షలు ఉన్నాయి.  వీటిలో మహర్షి (రాంపూర్), వెంకటరమణ (కాపువాడ), మధుశాల (ఏనుమాముల), ఆరుముఖ (కరీమాబాద్), మేఘన (హంటర్‌రోడ్డు), న్యూవాహిణి (అండర్‌బ్రిడ్జి),  శ్రీవాసవి (ఫోర్టురోడ్డు), శ్రీవెంకటేశ్వర (ఎస్పీవీరోడ్డు), శ్రీవర్ష (ఎంజీరోడ్డు),శ్రీ శ్రావణి (ఎంజీరోడ్డు), కావేరి (ఎస్వీఎన్ రోడ్డు), శ్రీరుద్రాక్షిణి (ఎంజీ రోడ్డు),  శ్రీబాలాజీ (దేశాయిపేట), శ్రీలక్ష్మి (దేశాయిపేట), సురేశ్ (నర్సంపేట రోడ్డు), భార్గవి (ఎల్‌బీనగర్), గిరిజ (లక్ష్మీపురం), మౌనిక(న్యూబస్టాండ్), రవిశివాజీ (విజయాటాకీస్ రోడ్డు), రామకృష్ణ (లష్కర్‌బజార్), రామా (హనుమాన్‌నగర్), శ్రీబాలాజీ (కిషన్‌పుర), రాజాశివాజీ (కొత్తూరు), న్యూ శ్రీనివాస (కుమార్‌పల్లి), మాతా (కుమార్‌పల్లి), తిరుమల (సర్క్యుట్‌హౌజ్), వెంకటేశ్వర (నక్కలగుట్ట),లాండ్‌మార్కు( నక్కలగుట్ట), ట్విలైట్ (బాలాసముద్రం), డాల్ఫిన్ (సుబేదారి), సోనా (సిద్ధార్థనగర్), శ్రీభవాని (సిద్దార్థనగర్)ు ఒక్కొక్కటి రూ 37,500 వంతున బకాయి చెల్లించాల్సి ఉంది. మిగిలిన బార్, రెస్టారెంట్లు బకాయిల చెల్లింపులో వీటి తర్వాత స్థానంలో ఉన్నాయి.
 
భారీ బకాయిలు ఉన్న సంస్థలు...
యూజర్ చార్జీల బకాయిల్లో నగరంలోని వివిధ హోటళ్లు రూ.15.14 లక్షలు, ఫంక్షన్ హళ్లు రూ 11.86 లక్షలు చెల్లించాల్సి ఉంది. వరంగల్ నగరపాలక సంస్థ రికార్డుల ప్రకారం హోటళ్ల విభాగంలో సుప్రభ హోటల్ రూ.1,12,500 బకాయి ఉండగా, రాజ్ లాడ్జ్, హవేలీ మల్టీ కుజిన్ రెస్టారెంట్, జూలూరి హోటల్, వరంగల్ బిర్యానీహౌస్, తయ్యాబ్ బిర్యానీ హౌజ్, శ్రీమంజునాథ హోటల్, నక్షత్ర హోటల్ యాజమాన్యాలు ఒక్కొక్కటి  రూ. 62,500 వంతున యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంది.

వీటితోపాటు న్యూ ఫ్యామిలీ, సిటీదాబా రూ. 57,500,  కాకతీయ హోటల్, అశోకా కాంప్లెక్స్ రూ. 45,000, నక్కలగుట్ట సురభి ఫుడ్‌కోర్ట్ రూ.1,12,500 బకాయి పడ్డాయి.  ఫంక్షన్ హాళ్ల విభాగంలో  పుష్పాంజలి, రాయల్, ఈడెన్ , చంద్ర,  అనిల్ ఫంక్షన్‌హాళ్లకు సంబంధించిన యాజమాన్యాలు ఒక్కొక్కరు రూ 30,000 వంతున బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement