- బహుళ అంతస్తులకూ సాధారణ కనెక్షన్లు
- కమర్షియల్ భవనాలదీ అదే తీరు
- నిబంధనలకు విరుద్ధంగా నల్లాల ఏర్పాటు
- 545 మీటర్లలో పనిచేయనివి 210
- పట్టించుకోని గ్రేటర్ పాలకవర్గం
- మహా నగరపాలక సంస్థకు ఏటా రూ.10 కోట్ల మేర గండి
వరంగల్ అర్బన్ : సాధారణంగా నలుగురు సభ్యులు ఉన్న ఓ కుటుంబం నల్లా నీళ్లు వాడుకున్నందుకు నెలకు రూ.150 చొప్పున బిల్లు చెల్లిస్తున్నారు. అంతే సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉన్న పది నుంచి ఇరవై కుటుంబాలు నివసించే అపార్ట్‌మెంట్ల యజమానులు సైతం అదే బిల్లు చెల్లిస్తున్నారు! అంతేకాకుండా షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు భారీ భవనాలకు సైతం సాధారణ నల్లా కనెక్షన్లను తీసుకోవడం.. పెద్దసైజులో పైపులు బిగించుకుని ఇష్టారాజ్యంగా నీళ్లు లాగుతున్నారు. ఇదంతా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘మాములు’గా జరుగుతోంది. ఇదంతా గుట్టుగా కాదు.. బల్దియా ఇంజినీర్లు, ఉన్నతధికారులు, పాలకవర్గానికి తెలిసే జరుగుతున్నా పెద్దలపై ప్రేమతో వదిలేస్తున్నారని తెలుస్తోంది.
ఏం జరుగుతోంది...?
అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, చిన్న, మధ్యతరగతి, స్టార్ హోటళ్లే కాకుండా ఫంక్షన్ హాళ్ల బాధ్యులు నిబంధనల ప్రకారం కమర్షియల్ నల్లా కనెక్షన్లు తీసుకోవాలి. ఇందుకోసం తొలుత గ్రేటర్‌కు రూ.లక్ష డిపాజిట్ చెల్లించడమే కాకుండా రోడ్డు కటింగ్, ఇతరత్రా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా నీటి మీటర్లను సైతం వినియోగదారులే బిగించుకోవాలి. ఆయా మీటర్లలో నమోదయ్యే రీడింగ్‌ను నెలకోసారి బల్దియా సిబ్బంది సేకరించి వాడుకున్న నీటిలో లీటర్ల వారీగా పన్ను వసూలు చేయాలి. కానీ ఈ నిబంధనలను అటు ఉద్యోగులు, ఇటు యజమానులు ఖాతరు చేయడం లేదు.
4 నుంచి 6 వేల కనెక్షన్లు..
మహా నగరంలో 19,500 వరకు వాణిజ్యపరమైన భవనాలు ఉండగా, 18,373 మంది ట్రేడ్ లెసైన్‌సలు పొందారు. ఈ లెక్కన నగరంలో 4 నుంచి 6వేల వరకు కమర్షియల్ నల్లాలు ఉండాలి. కానీ ట్రైసిటీలో 545 కమర్షియల్ నల్లాలే ఉన్నట్లుగా బల్దియా లెక్కలు చెబుతున్నారుు. నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణ కోటాలో వాణిజ్య అవసరాలకు నల్లా కనెక్షన్లు ఇస్తున్నట్లు దీని ప్రకారం అర్థమవుతోంది. స్థానిక ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది చేతులు తడుపుతున్న కొందరు గృహ నిర్మాణ కోటాలో వాణిజ్య అవసరాలకు నల్లా నీటిని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
మీటర్లకు బ్రేక్
ట్రైసిటీలో అధికారిక లెక్కల ప్రకారం 545 కమర్షియల్ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 335 నల్లాలకు సంబంధించిన మీటర్లే రీడింగ్ చూపిస్తున్నాయి. మిగిలిన 210 నల్లా రీడింగ్ మీటర్లు పాడయ్యాయి. ఈ మీటర్లు తిరగక నెలో, రెండు నెలలో కాదు.. ఐదేళ్లు దాటుతోంది. అంటే వాణిజ్య అవసరాలకు వేల సంఖ్యలో సాధారణ నల్లా కనెక్షన్లుగా నీటిని వాడుకుంటుండగా.. నిబంధనల ప్రకారం కనెక్షన్ తీసుకున్న వారి మీటర్లు సైతం తిరగడం లేదన్న మాట! ఇలా రెండు విధాలుగా బల్దియా ఖజానాకు గండి పడుతోంది.
లెక్కల్లో గోల్‌మాల్
సామాన్యుల నుంచి ముక్కుపిండి నల్లా పన్నులు వసూలు చేసే బల్దియా సిబ్బంది.. వాణిజ్య అవసరాలకు నీటిని ఉపయోగిస్తున్న వారిని చూసీచూడనట్లు వదిలేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక పలుచోట్ల నల్లా మీటర్లు తిరగకపోవడంతో సాధారణ కనెక్షన్ల ప్రకారం రూ.150 చొప్పున పన్ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటిలో ఎన్నింటికి వాణిజ్య నల్లా కనెక్షన్లు ఉన్నాయి.. ఇందులో అన్నింటికీ మీటర్లు ఉన్నాయా, ఉంటే పనిచేస్తున్నాయా, లేదా అనే విషయం అంతుచిక్కడం లేదు.
బల్దియా ఇంజినీర్లు కూడా వీటిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో వ్యాపార, వాణిజ్య సంస్థల్లో తనిఖీ చేస్తేఅక్రమ కమర్షియల్ కనెక్షన్లు వెలుగులోకి రానున్నాయి. తద్వారా అన్నింటికీ మీటర్లు బిగించి, లెక్క ప్రకారం పన్ను వసూలు చేస్తే బల్దియాకు ఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని కొందరు ఇంజినీరింగ్ విభాగం అధికారులే చెబుతున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, పాలకవర్గం పెద్దలు ఎప్పటికి స్పందిస్తారో వేచి చూడాల్సిందే.