water meter
-
నల్లా-ఆధార్ లింక్ చేశారా? లేదంటే.. ఏకంగా 9 నెలల బిల్లు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా పథకానికి ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకునే గడువు ఈ నెల 15తో ముగియనుంది. కానీ మహానగరం పరిధిలో ఇంకా 4.19 లక్షలమంది గృహ వినియోగదారులు తమ ఆధార్ నెంబరును నల్లా కనెక్షన్ నెంబరుతో అనుసంధానం చేసుకోకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికంగా అపార్ట్మెంట్ వాసులే ఉన్నారు. మొత్తంగా జలమండలి పరిధిలో 9.77 లక్షల మేర గృహవినియోగ నల్లాలుండగా..ఇందులో ఇప్పటివరకు 5.58 లక్షల మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పొందేందుకు ఆధార్ అనుసంధానంతోపాటు ప్రతీ నల్లాకు నీటి మీటరును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 5.70 లక్షలమంది నీటిమీటర్లను ఏర్పాటుచేసుకున్నారు. మరో 4.07 లక్షల నల్లాలకు నీటిమీటర్లు లేవని వాటర్‌బోర్డు పరిశీలనలో తేలింది. ఈ వారంలోగా ఆధార్ అనుసంధానం చేసుకోవడంతోపాటు నల్లాకు నీటిమీటరును ఏర్పాటుచేసుకోని పక్షంలో సదరు వినియోగదారులు ఏకంగా 9 నెలల నీటిబిల్లు చెల్లించాల్సి ఉంటుందని వాటర్‌బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం నీటిమీటర్లున్న వారు సైతం తమ నీటి మీటరు పనిచేస్తుందో లేదో తనిఖీచేసుకోవాలని సూచించింది. కాగా నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న ప్రతీ ఫ్లాట్ వినియోగదారులు తమ ఆధార్‌ను నల్లా కనెక్షన్ నెంబరుకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోని వారికి నీటిబిల్లును జారీచేస్తామని జలమండలి ప్రకటించింది. కాగానగరంలో అపార్ట్మెంట్ల వాసులు కోవిడ్,లాక్డౌన్, వర్క్‌ఫ్రం హోం కారణంగా స్వస్థలాలకు తరలి వెళ్లడం, ఇతర దేశాల్లో నివసించడం వెరసి ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. అనుసంధానం ఇలా చేసుకోండి.. నల్లాకనెక్షన్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానాన్ని డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.హైదరాబాద్‌వాటర్.జిఓవి.ఐఎన్ వెబ్సైట్లో లాగిన్ అయి పూర్తి చేసుకోవడం లేదా సమీప మీ సేవా కేంద్రాలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జలమండలి సూచించింది. ఇతర వివరాలకు 155313 జలమండలి కాల్‌సెంటర్‌ను సంప్రదించాలని కోరింది. -
అవి‘నీటి’ ధారలు
బహుళ అంతస్తులకూ సాధారణ కనెక్షన్లు కమర్షియల్ భవనాలదీ అదే తీరు నిబంధనలకు విరుద్ధంగా నల్లాల ఏర్పాటు 545 మీటర్లలో పనిచేయనివి 210 పట్టించుకోని గ్రేటర్ పాలకవర్గం మహా నగరపాలక సంస్థకు ఏటా రూ.10 కోట్ల మేర గండి వరంగల్ అర్బన్ : సాధారణంగా నలుగురు సభ్యులు ఉన్న ఓ కుటుంబం నల్లా నీళ్లు వాడుకున్నందుకు నెలకు రూ.150 చొప్పున బిల్లు చెల్లిస్తున్నారు. అంతే సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉన్న పది నుంచి ఇరవై కుటుంబాలు నివసించే అపార్ట్మెంట్ల యజమానులు సైతం అదే బిల్లు చెల్లిస్తున్నారు! అంతేకాకుండా షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు భారీ భవనాలకు సైతం సాధారణ నల్లా కనెక్షన్లను తీసుకోవడం.. పెద్దసైజులో పైపులు బిగించుకుని ఇష్టారాజ్యంగా నీళ్లు లాగుతున్నారు. ఇదంతా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘మాములు’గా జరుగుతోంది. ఇదంతా గుట్టుగా కాదు.. బల్దియా ఇంజినీర్లు, ఉన్నతధికారులు, పాలకవర్గానికి తెలిసే జరుగుతున్నా పెద్దలపై ప్రేమతో వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఏం జరుగుతోంది...? అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, చిన్న, మధ్యతరగతి, స్టార్ హోటళ్లే కాకుండా ఫంక్షన్ హాళ్ల బాధ్యులు నిబంధనల ప్రకారం కమర్షియల్ నల్లా కనెక్షన్లు తీసుకోవాలి. ఇందుకోసం తొలుత గ్రేటర్‌కు రూ.లక్ష డిపాజిట్ చెల్లించడమే కాకుండా రోడ్డు కటింగ్, ఇతరత్రా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీటి మీటర్లను సైతం వినియోగదారులే బిగించుకోవాలి. ఆయా మీటర్లలో నమోదయ్యే రీడింగ్‌ను నెలకోసారి బల్దియా సిబ్బంది సేకరించి వాడుకున్న నీటిలో లీటర్ల వారీగా పన్ను వసూలు చేయాలి. కానీ ఈ నిబంధనలను అటు ఉద్యోగులు, ఇటు యజమానులు ఖాతరు చేయడం లేదు. 4 నుంచి 6 వేల కనెక్షన్లు.. మహా నగరంలో 19,500 వరకు వాణిజ్యపరమైన భవనాలు ఉండగా, 18,373 మంది ట్రేడ్ లెసైన్‌సలు పొందారు. ఈ లెక్కన నగరంలో 4 నుంచి 6వేల వరకు కమర్షియల్ నల్లాలు ఉండాలి. కానీ ట్రైసిటీలో 545 కమర్షియల్ నల్లాలే ఉన్నట్లుగా బల్దియా లెక్కలు చెబుతున్నారుు. నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణ కోటాలో వాణిజ్య అవసరాలకు నల్లా కనెక్షన్లు ఇస్తున్నట్లు దీని ప్రకారం అర్థమవుతోంది. స్థానిక ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది చేతులు తడుపుతున్న కొందరు గృహ నిర్మాణ కోటాలో వాణిజ్య అవసరాలకు నల్లా నీటిని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. మీటర్లకు బ్రేక్ ట్రైసిటీలో అధికారిక లెక్కల ప్రకారం 545 కమర్షియల్ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 335 నల్లాలకు సంబంధించిన మీటర్లే రీడింగ్ చూపిస్తున్నాయి. మిగిలిన 210 నల్లా రీడింగ్ మీటర్లు పాడయ్యాయి. ఈ మీటర్లు తిరగక నెలో, రెండు నెలలో కాదు.. ఐదేళ్లు దాటుతోంది. అంటే వాణిజ్య అవసరాలకు వేల సంఖ్యలో సాధారణ నల్లా కనెక్షన్లుగా నీటిని వాడుకుంటుండగా.. నిబంధనల ప్రకారం కనెక్షన్ తీసుకున్న వారి మీటర్లు సైతం తిరగడం లేదన్న మాట! ఇలా రెండు విధాలుగా బల్దియా ఖజానాకు గండి పడుతోంది. లెక్కల్లో గోల్మాల్ సామాన్యుల నుంచి ముక్కుపిండి నల్లా పన్నులు వసూలు చేసే బల్దియా సిబ్బంది.. వాణిజ్య అవసరాలకు నీటిని ఉపయోగిస్తున్న వారిని చూసీచూడనట్లు వదిలేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక పలుచోట్ల నల్లా మీటర్లు తిరగకపోవడంతో సాధారణ కనెక్షన్ల ప్రకారం రూ.150 చొప్పున పన్ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటిలో ఎన్నింటికి వాణిజ్య నల్లా కనెక్షన్లు ఉన్నాయి.. ఇందులో అన్నింటికీ మీటర్లు ఉన్నాయా, ఉంటే పనిచేస్తున్నాయా, లేదా అనే విషయం అంతుచిక్కడం లేదు. బల్దియా ఇంజినీర్లు కూడా వీటిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో వ్యాపార, వాణిజ్య సంస్థల్లో తనిఖీ చేస్తేఅక్రమ కమర్షియల్ కనెక్షన్లు వెలుగులోకి రానున్నాయి. తద్వారా అన్నింటికీ మీటర్లు బిగించి, లెక్క ప్రకారం పన్ను వసూలు చేస్తే బల్దియాకు ఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని కొందరు ఇంజినీరింగ్ విభాగం అధికారులే చెబుతున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, పాలకవర్గం పెద్దలు ఎప్పటికి స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
స్పందన అంతంతే..!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 8.79 లక్షల నల్లాలకు నీటి మీటర్లు ఏర్పాటు చేయాలనుకున్న జలమండలి సంకల్పానికి.. నెలరోజులుగా వినియోగదారుల నుంచి స్పందన నామమాత్రంగానే లభిస్తోంది. మహానగరంలో ప్రస్తుతం 1.69 లక్షల నల్లాలకు మాత్రమే నీటి మీటర్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి. మిగతా 7.10 లక్షల నల్లాలకు డాకెట్ సరాసరి(ఒక పైపులైన్కున్న నల్లా కనెక్షన్ల సగటు నీటి వినియోగాన్ని బట్టి) పేరుతో నీటి బిల్లులిస్తుండడంతో... వీధిలో తక్కువ నీటిని ఉపయోగించుకున్నవారికీ.. అధికంగా నీటిని వినియోగించుకుంటున్న వారికి ఒకే రీతిన బిల్లులు జారీ అవుతున్నాయి. ఈనేపథ్యంలో అన్ని నల్లాలకు మీటర్లు బిగించడం ద్వారా శాస్త్రీయంగా నీటి చుక్కను లెక్కగట్టి ఇటు వినియోగదారులకు.. అటు బోర్డుకు నష్టం కలగని రీతిలో బిల్లులు జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, లైన్మెన్లు, మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు నీటి మీటర్ల ఏర్పాటుపై జలమండలి ముద్రించిన కరపత్రం అందజేసి.. వినియోగదారుల్లో సరైన అవగాహన కల్పించడంలో విఫలమౌతుండడంతో ఈ ప్రక్రియ ప్రహాసనంగా మారుతోంది. మరోవైపు ఆగస్టు నెలాఖరులోగా నీటిమీటర్లు ఏర్పాటు చేసుకుంటే నీటిబిల్లులో 5 శాతం రాయితీ ప్రకటించినా ఈ ఆఫర్ వినియోగదారులను ఆకట్టుకోకపోవడం గమనార్హం. సెప్టెంబరు నెలాఖరులోగా మీటర్లు ఏర్పాటు చేసుకోనివారికి రెట్టింపు నీటి బిల్లులు జారీ చేస్తామని జలమండలి స్పష్టం చేస్తోంది. కాగా శివారు ప్రాంతాల్లో నాలుగు రోజులకోమారు నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాలకు చెందిన వినియోగదారులు మాత్రం నీటి మీటర్లు ఏర్పాటు చేసుకున్నా చేసుకోకపోయినా తమకు పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతుండడం గమనార్హం. అన్ని మీటర్లకు తూనికలు కొలతల శాఖ గుర్తింపుపై అనుమానాలు..? నగరంలో నీటిమీటర్లను విక్రయించేందుకు గతంలో జలమండలి యూరో, ఐఎస్ఐ ప్రమాణాలున్న 9 కంపెనీలను ఎంపిక చేసింది. అయితే ఆయా సంస్థలు తయారు చేస్తున్న పలు రకాల మీటర్లలో కొన్ని రకాల(మోడల్స్) మీటర్లకుSమాత్రమే తూనికలు కొలతల శాఖ ధ్రువీకరణ ఉందని, మరికొన్నింటికి లేవన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కానీ వినియోగదారులు మాత్రం ఈ తొమ్మిది కంపెనీలకు చెందిన మీటర్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు స్పష్టతనివ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. లేని పక్షంలో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు చేసిన పక్షంలో వినియోగదారులు బలిపశువులు అవుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి మీటర్లు దొరికే ప్రదేశాలివే... 1.గోషామహల్, ఖైరతాబాద్, నారాయణగూడ, ఎస్.ఆర్.నగర్, మారేడ్‌పల్లి, భాగ్యనగర్, ఎన్టీఆర్నగర్, సైనిక్‌పురి రిజర్వాయర్, బీరప్పగడ్డ రిజర్వాయర్(ఉప్పల్), బుద్వేల్ ఫిల్లింగ్ పాయింట్ల వద్ద నున్న జలమండలి కార్యాలయాల వద్ద నీటిమీటర్లు లభ్యమౌతాయి. మీటర్ రీడర్లు లేదా లైన్మెన్ల సహాయంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇతర వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.హైదరాబాద్‌వాటర్.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో సంప్రదించాలి. లేదా 155313 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌చేయాలని జలమండలి ప్రకటించింది. జలమండలి ఎంపిక చేసిన మీటర్ కంపెనీలివే.. ఒక్కో మీటరు ఖరీదు: మీటర్ రకాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2000 మధ్యన ఉంటుంది. మీటర్ కంపెనీ –సంప్రదించాల్సిన వ్యక్తి–మీటర్ల సైజు– మీటర్ రకం– ఫోన్ నెంబరు 1. డెక్కన్ పవర్ ప్రోడక్ట్స్ –సీతారామ్‌రెడ్డి–15, 20 ఎంఎం–బీ–మీటర్స్, జీఎన్డీ5– 9849008490 2. మాంటెక్ కన్స్ట్రక్షన్స్–పీసీరావు–15,20 ఎంఎం–జెన్నర్మైనో, మెన్ఈటీఎక్స్ –9866306233 3. దేశ్వాన్సిస్టమ్స్–ఎస్.జె.హెన్రీ–15ఎంఎం–ఎల్ష్టర్–ఎన్100– 8793336925 4. శ్రీరంగ్అకార్డ్జెవి–కపిల్కరియా–15,20ఎంఎం–ఎల్ష్టర్–ఎన్100– 09324646964 5. బట్రాన్–సంతోష్–15,20ఎంఎం–ఐల్ట్రాన్ యూనిమాగ్– 9392462798 6. భారత్ప్రిసిషన్–కుక్రెజా–15,20ఎంఎం–ఇన్ఫ్రెన్షియల్ టైప్– 09312273380 7. జనరల్వాటర్మీటర్–నరేష్చంద్ర–15,20ఎంఎం–చాంబెల్,మాగ్నటిక్– 040–24603591 8. భారతి ఇంజినీరింగ్వర్క్స్–వేణుగోపాల్–15,20ఎంఎం–జెన్నర్– 8099921242 9. గ్లోబల్వాటర్అండ్ ఎన్విరాన్మెంటల్–చైతన్య–15,20ఎంఎం–గ్లోబల్– 9490469750 -
ప్రజలకు జలమండలి బంపర్ ఆఫర్!
► నీటి మీటర్ ఏర్పాటు చేసుకుంటే 5 శాతం బిల్లు రాయితీ ► రూ.1 చెల్లిస్తే అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ ► ఆగస్టు 31 వరకు అందరికీ అవకాశం సాక్షి, సిటీబ్యూరో: నల్లా వినియోగదారులకు జలమండలి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 30 లోగా తమ ఇంట్లోని నల్లాకు మీటర్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఏడాది పాటు నెలవారీ నీటిబిల్లులో 5 శాతం రాయితీ ప్రకటించింది. ఉదాహరణకుæనెలకు రూ.500 బిల్లు చెల్లించే గృహ వినియోగదారులు తమ ఇళ్లలో నీటి మీటర్ ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.25 చొప్పున రాయితీ పొందవచ్చు. ఈ లెక్కన ఏడాదికి రూ.300 ఆదా చేసుకోవచ్చు. నీటి బిల్లు అధికంగా చెల్లించేవారు ఈ ఆఫర్‌తో గరిష్ట ప్రయోజనం పొందనుండడం విశేషం. ఈ ఆఫర్‌తో నగరంలోని సుమారు మూడు లక్షలమంది వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆఫర్ ఆగస్టు ఒకటి నుంచి వచ్చే ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. మీటర్ల ఏర్పాటు దిశగా వినియోగదారులను ప్రోత్సహించిన లైన్మెన్లకు సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇక నీటి మీటర్ ఏర్పాటు చేసుకోని వినియోగదారులు రెట్టింపు నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తక్షణం మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ ఆగస్టు ఒకటి నుంచి మీటర్ రీడింగ్ సిబ్బంది నగరంలో 3 లక్షలమంది గృహ వినియోగదారులకు స్వయంగా నోటీసులు అందజేస్తారని తెలిపారు. నోటీసులకు స్పందించని వారి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. పేద కుటుంబాలకు రూ.1కే నల్లా క్రమబద్ధీకరణ బస్తీల్లో నివాసం ఉండే నిరుపేదల(బీపీఎల్కుటుంబాలు)కు కూడా జలమండలి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అక్రమ నల్లా కనెక్షన్ కలిగిన వారు ముందుకు వచ్చి రూ.1 చెల్లిస్తే సదరు వినియోగదారుని నల్లాను(15 ఎంఎం పరిమాణం)48 గంటల్లోగా క్రమబద్ధీకరిస్తామని ఎండీ తెలిపారు. ఇటీవలే బీపీఎల్ కుటుంబాలకు రూ.1కే నల్లా కనెక్షన్ జారీ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 24న జి.ఓ.ఆర్.నెం.372 ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు పదిలక్షల బీపీఎల్ కుటుంబాలుండగా..తొలివిడతగా మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని పేదలకు రూ.1కే నల్లా కనెక్షన్లను సైతం తక్షణం మంజూరు చేస్తామన్నారు. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు అందరికీ అవకాశం.. గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాలు కలిగిన వినియోగదారులకు తమ నల్లాల క్రమమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించాలని జలమండలి ఫోకస్ గ్రూపు సమావేశం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సదరు వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకురావాలని ఎండీ సూచించారు. లేకుంటే సదరు వినియోగదారులకు కనెక్షన్ ఛార్జీలు రెట్టింపు చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందించే ఉద్యోగులకు ప్రోత్సాహకాలివే.. అక్రమ నల్లాలపై సమాచారం అందించే పౌరులు, ఉద్యోగులకు అక్రమార్కుల నుంచి వసూలు చేసే కనెక్షన్ ఛార్జీల్లో 25 శాతం ప్రోత్సాహకం అందిస్తామని ఎండీ తెలిపారు. అక్రమ నల్లాను గుర్తించిన బోర్డు లైన్మెన్లకు ప్రతి కనెక్షన్‌కు రూ.200 ప్రోత్సాహకం అందిస్తామన్నారు.