జలమండలి ఫోకస్ గ్రూపు సమావేశంలో ఎండీ, బోర్డు డైరెక్టర్లు
► నీటి మీటర్ ఏర్పాటు చేసుకుంటే 5 శాతం బిల్లు రాయితీ
► రూ.1 చెల్లిస్తే అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ
► ఆగస్టు 31 వరకు అందరికీ అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: నల్లా వినియోగదారులకు జలమండలి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 30 లోగా తమ ఇంట్లోని నల్లాకు మీటర్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఏడాది పాటు నెలవారీ నీటిబిల్లులో 5 శాతం రాయితీ ప్రకటించింది. ఉదాహరణకుæనెలకు రూ.500 బిల్లు చెల్లించే గృహ వినియోగదారులు తమ ఇళ్లలో నీటి మీటర్ ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.25 చొప్పున రాయితీ పొందవచ్చు. ఈ లెక్కన ఏడాదికి రూ.300 ఆదా చేసుకోవచ్చు. నీటి బిల్లు అధికంగా చెల్లించేవారు ఈ ఆఫర్‌తో గరిష్ట ప్రయోజనం పొందనుండడం విశేషం. ఈ ఆఫర్‌తో నగరంలోని సుమారు మూడు లక్షలమంది వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
ఈ ఆఫర్ ఆగస్టు ఒకటి నుంచి వచ్చే ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. మీటర్ల ఏర్పాటు దిశగా వినియోగదారులను ప్రోత్సహించిన లైన్‌మెన్‌లకు సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇక నీటి మీటర్ ఏర్పాటు చేసుకోని వినియోగదారులు రెట్టింపు నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తక్షణం మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ ఆగస్టు ఒకటి నుంచి మీటర్ రీడింగ్ సిబ్బంది నగరంలో 3 లక్షలమంది గృహ వినియోగదారులకు స్వయంగా నోటీసులు అందజేస్తారని తెలిపారు. నోటీసులకు స్పందించని వారి నల్లా కనెక్షన్‌లు తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.
పేద కుటుంబాలకు రూ.1కే నల్లా క్రమబద్ధీకరణ
బస్తీల్లో నివాసం ఉండే నిరుపేదల(బీపీఎల్‌కుటుంబాలు)కు కూడా జలమండలి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అక్రమ నల్లా కనెక్షన్ కలిగిన వారు ముందుకు వచ్చి రూ.1 చెల్లిస్తే సదరు వినియోగదారుని నల్లాను(15 ఎంఎం పరిమాణం)48 గంటల్లోగా క్రమబద్ధీకరిస్తామని ఎండీ తెలిపారు. ఇటీవలే బీపీఎల్ కుటుంబాలకు రూ.1కే నల్లా కనెక్షన్ జారీ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 24న జి.ఓ.ఆర్.నెం.372 ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు పదిలక్షల బీపీఎల్ కుటుంబాలుండగా..తొలివిడతగా మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని పేదలకు రూ.1కే నల్లా కనెక్షన్లను సైతం తక్షణం మంజూరు చేస్తామన్నారు.
అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు అందరికీ అవకాశం..
గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాలు కలిగిన వినియోగదారులకు తమ నల్లాల క్రమమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించాలని జలమండలి ఫోకస్ గ్రూపు సమావేశం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సదరు వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకురావాలని ఎండీ సూచించారు. లేకుంటే సదరు వినియోగదారులకు కనెక్షన్ ఛార్జీలు రెట్టింపు చేస్తామని హెచ్చరించారు.
సమాచారం అందించే ఉద్యోగులకు ప్రోత్సాహకాలివే..
అక్రమ నల్లాలపై సమాచారం అందించే పౌరులు, ఉద్యోగులకు అక్రమార్కుల నుంచి వసూలు చేసే కనెక్షన్ ఛార్జీల్లో 25 శాతం ప్రోత్సాహకం అందిస్తామని ఎండీ తెలిపారు. అక్రమ నల్లాను గుర్తించిన బోర్డు లైన్‌మెన్లకు ప్రతి కనెక్షన్‌కు రూ.200 ప్రోత్సాహకం అందిస్తామన్నారు.