- డివిజన్ల పునర్విభజనలో నిబంధనలకు తిలోదకాలు
- నగర పాలక సంస్థ అధికారుల తీరుపై అనుమానాలు
వరంగల్ అర్బన్ : వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా పునర్విభజన చేయాల్సిన అధికారులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారనే ఆరోపణలు వినవస్తున్నాయి. హడవుడిగా, తప్పల తడుకగా, అస్పష్టమైన ముసాయిదాను తయారీ చేసిన వారు ఆ తర్వాత తప్పలను దిద్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల అదేశించిన నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నారు. ఈనెల 8న నూతన డివిజన్ల ముసాయిదాను ప్రకటించిన అధికారులు తిరిగి రద్దు చేసినట్లు చెప్పారు. మార్నాడు ఉదయమే అనేక మార్పులతో మారోమారు ముసాయిదాను విడుదల చేయడం గమనార్హం. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
9వ డివిజన్‌ను గ్రెయిన్ మార్కెట్ పరిధి, దయానంద కాలనీ, గిరిజన హాస్టల్ గృహ సముదాయం, యాకుబ్‌పూరా ప్రాంతాలు రైల్వే గేట్‌కు ఒకవైపు ఉంటాయి. పుప్పాలగుట్ట, ఏసీరెడ్డి నగర్, సీపీఎం గుడిసెలు, శివనగర్ హరిజనవాడ, ఖిలావరంగల్‌లోని తూర్పుకోట, పశ్చిమకోట, కాపువాడ, వడ్లవారి వీధి, గొల్లవాడ రైల్వే గ్రేట్ అవతలి ప్రాంతంలో ఉన్నాయి. ఈ కాలనీలకు ఎక్కడా పొంతన లేదు. బల్దియా అధికారులు చెబుతున్నట్లు రోడ్డు నెట్ వర్కింగ్ కూడా లేదు. మరి డివిజన్‌ను ఏ ప్రతిపాదికన రూపకల్పన చేశారో వారికే తెలియాలి. ఈ డివిజన్‌లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
18వ డివిజన్‌లోని మేదరవాడ, జేపీఎన్ రోడ్డు, కృష్ణాకాలనీ, అండర్‌బ్రిడ్జి జేపీఎన్ రోడ్డు, సీకేఎం ఆస్పత్రి ఉండగా వీటికి తోడు అండర్ రైల్వే గేట్ అవతలి ప్రాంతంలోని శివనగర్, భూపేష్‌నగర్, ఫోర్టు రోడ్డు, పెరుకవాడ, రైల్వే గేట్, పాడిమాల్లారెడ్డి కాలనీలను ఏ ప్రతిపాదికన తీసుకున్నారో తెలియదు.
విలీన గ్రామమైన ఏనుమాములలో సూమారు 15వేల జనాభా ఉంది. ఈ గ్రామాన్ని 2వ డివిజన్‌లోని కొన్ని వార్డులను, 12వ డివిజన్‌లోని మరి కొన్ని రెవెన్యూ వార్డులను మిలితం చేయడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 1వ డివిజన్‌గా రూపకల్పన చేసిన ఆరేపల్లిలోని కొన్ని రెవెన్యూ బ్లాక్‌లు తీసుకోగా, 58వ డివిజన్‌లో మరికొన్ని బ్లాక్‌లను తీసుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. విలీన గ్రామాలకు, నగర శివారులోని కాలనీలను జోడించి ముసాయిదాలో డివిజన్లను రూపకల్పన చేశారు.
గతంలో రెండుమార్లుగా జరిగిన డివిజన్ల పునర్విభజనలో రాజకీయ జోక్యం ఉందనే నేపథ్యంలో టీడీపీకి చెందిన నాయకులు హైకోర్టును అశ్రయించారు. దీంతో రెండుమార్లు పునర్విభజన ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో చేపట్టిన పునర్విభజన అస్పస్టంగా, అశాస్త్రీయంగా, ప్రజలకు అసౌకర్యంగా ఉందని, అధికార పార్టీకి చెందిన నేతల అభిప్రాయాల మేరకే డివిజన్లు తయారు చేసినట్లు వాదనలు బలంగా వినవస్తున్నాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తమ డివిజన్లను అనూకూలంగా మార్చుకునేందుకు అధికారులను పావులుగా ఉపయోగించుకున్నారనే అరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే డివిజన్ల ముసాయిదాను పరీశీలించిన వివిధ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు డివిజన్ల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనాలు, సలహాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన అంశం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.