ఇక.. స్థానిక ఎమ్మెల్సీ
- జూలైలో ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు
- పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు
- కీలకం కానున్న జెడ్పీ చైర్మన్ ఫలితం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రెండేళ్లుగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడి ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందే ఈ ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో వరంగల్ నగర పాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత రావడం లేదు.
ఇటీవలే 58 డివిజన్ల ఏర్పాటకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి పూర్తయిన తర్వాత నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం అక్టోబరుతో ముగియనుంది. హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో సంబంధం లేకుండానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సంస్థలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తే... ఎమ్మెల్సీ ఎన్నికకు ముందే నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మెదక్ లోక్‌సభ ఎన్నికతోపాటే ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక దగ్గరపడే పరిస్థితి ఉండడంతో జిల్లాలోని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ముఖ్యనేతలు పలువురు దీనిపై దృష్టి పెడుతున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఈ ఎమ్మెల్సీ పదవికి పోటీపడనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ వర్గాల సమచారం ప్రకారం డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ పడతారని వినిపిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అదే పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది.
దీంతో జెడ్పీ క్యాంపు విషయంలో రెండు పార్టీల నేతలు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలు ఈ నెల 9న మొదలవుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత స్థానిక సంస్థల ప్రజానిధుల ప్రమాణస్వీకార ప్రక్రియ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన జూన్ 12 తర్వాత వారంలోపే ఇది జరిగే పరిస్థితి కనిపిస్తోంది.
స్థానిక సంస్థల చైర్మన్లు, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇలా స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిస్తే వీరంతా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా చేరినట్లవుతుంది. జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది. కాంగ్రెస్ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండా మురళీధర్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించడంతో ఈ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
శాసనమండలి ఆరంభమైన మొదట్లో జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికయ్యారు. 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలు కలిపి మొత్తం 929 ఉన్నాయి. వరంగల్ నగరపాలక సంస్థలోని 58 డివిజన్లు మినహాయిస్తే... మిగిలిన 871 స్థానాలకు ప్రస్తుతం ప్రతినిధులు ఎన్నికయ్యారు. వీరు వారంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.