వరంగల్‌ మేయర్‌.. ఎవరికివారే! | Special Meeting for Election of GWMC mayor on April 27 | Sakshi
Sakshi News home page

వరంగల్‌ మేయర్‌.. ఎవరికివారే!

Published Mon, Apr 22 2019 5:03 AM | Last Updated on Mon, Apr 22 2019 5:03 AM

 Special Meeting for Election of GWMC mayor on April 27 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌ ఎన్నిక టీఆర్‌ఎస్‌ పార్టీలో కొత్త రాజకీయానికి తెరతీస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంలో కీలక పదవి విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మెజారిటీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధేయులకు కాకుండా, కొత్తగా వచ్చినవారికి ఈ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నివేదించాలని వారు భావిస్తున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా ఉన్న నన్నపునేని నరేందర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  నన్నపునేని నరేందర్‌ మేయర్‌ పదవికి రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్‌ 27వ తేదీన మేయర్‌ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ దగ్గరపడుతుండటంతో ఎవరికి వారు మేయర్‌ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, బోయినపల్లి రంజిత్‌రావు, వద్దిరాజు గణేశ్, గుండు ఆశ్రితారెడ్డి మేయర్‌ పదవిని ఆశిస్తున్నారు.  

ఒకటి, రెండు రోజుల్లో సమావేశం 
వరంగల్‌ మేయర్‌ ఎంపిక కోసం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ త్వరలోనే ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. గ్రేటర్‌ వరంగల్‌లో 58 డివిజన్‌లున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌లో 2016 మార్చిలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ 1, సీపీఎం 1, కాంగ్రెస్‌ 4, టీఆర్‌ఎస్‌ 44 డివిజన్లలో విజయం సాధించాయి. స్వతంత్రులు ఎనిమిది మంది గెలిచారు. స్వతంత్రులందరూ టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్‌ మేయర్‌ పదవిని జనరల్‌ కేటగిరికి కేటాయించినా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేందర్‌కు అవకాశం ఇచ్చారు.

కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో, టీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్‌ ఎంబాడి రవీందర్‌ కాంగ్రెస్‌లో చేరగా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌ పదవి అధికార పార్టీకి దక్కడం లాంఛనమే. ప్రస్తుతం మేయర్‌ పదవిని ఓసీ వర్గానికి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. గుండా ప్రకాశ్‌రావు, బోయినపల్లి రంజిత్‌రావు, వద్దిరాజు గణేశ్, గుండు ఆశ్రితారెడ్డి, నాగమళ్ల ఝాన్సీలలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందో మరి.

ముగ్గురి అభిప్రాయాలు కీలకం
గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా, వర్ధన్నపేట సగం సెగ్మెంట్‌ ఉంటాయి. మేయర్‌ ఎన్నిక విషయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల అభిప్రాయాలు కీలకం కానున్నాయి. ఈ ముగ్గురితో పాటు మరో కార్పొరేటర్‌ నాగమళ్ల ఝాన్సీ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్కువమంది కార్పొరేట ర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌ వరం గల్‌ ఎన్నికలు 2016లో జరిగాయి. ఝాన్సీ టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అప్పట్లో మేయర్‌ ఎన్నిక ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి కాకుండా టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచినవారిలోనే ఒకరికి మేయర్‌గా అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ కార్పొరేటర్లు అధిష్టానాన్ని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement