పని చేయకున్నా జీతం
మాట వినకుంటే అదనపు పని కార్పొరేషన్‌లో
ఓ ఉద్యోగి లీలలు
నెలకు రెండు, మూడు సార్లు సార్ నుంచి ఫోన్ వస్తుంది. రెండు సీసాల కల్లు, నాటు కోడిపులుసు,ఓ మద్యం బాటిల్ ఇస్తే చాలు. నెలంతా పని చేయకున్నా జీతం పొందవచ్చు. కాదని సార్ మాటకు ఎదురుచెబితే అంతే. వరంగల్ నగర పాలక సంస్థలో ఓ అధికారి తీరు..
హన్మకొండ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో నీటి సరఫరా, చెత్త సేకరణ తదితర పనుల కోసం టిప్పర్లు, ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు ఉన్నాయి. వీటిని నడిపేందుకు సంస్థ పరిధిలో 56 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగులకు నెలకు రూ.10,160 వేతనం చెల్లిస్తున్నారు. హాజరు, సెలవులు తదితర వ్యవహారాలు పర్యవేక్షించే ఉద్యోగి నుంచి డ్రైవర్లకు నిత్యం వేధింపులు ఎదురవుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండే డ్రైవర్లను ఒక విధంగా.. మాట విననివారిని టార్గెట్ చేయడం నిత్యకృత్యంగా మారిం ది. దీనితో సార్‌ను మచ్చిక చేసుకుంటే చాలు అనే ధోరణి డ్రైవర్లలో పెరిగింది. తమకు కేటాయించిన పనిని పక్కన పెట్టి సదరు ఉద్యోగి పనిచేసి పెడితే చాలు. ఈ అంశంలో పైస్థాయి అధికారులకు కొన్ని పనులు జరుగుతుండటంతో ఎవరూ వ్యవహారంపై పెదవి విప్పడం లేదు. దీని కారణంగా పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్ము అధికారి విలాసాలకు ఖర్చైపోతుంది.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
రాంపూర్ డంపింగ్ యార్డులో చెత్తను పక్కకు జరిపే డోజర్‌ను నడిపే డ్రైవర్‌కు ఇన్‌ఫెక్షన్ సోకి పది రోజులు ఆస్పత్రి పాలయ్యాడు. విధి నిర్వహణలో అనారోగ్యం పాలయినా ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా జీతంలో కోత విధించారు. అదేసమయంలో తమకు అనుకూలంగాా ఉన్న ఓ డ్రైవర్‌కు చేయి బెనికిందనే సాకుతో ఎనిమిది నెలలుగా జీతం చెల్లిస్తున్నారు. ఈ విధానం బాగుండటంతో ప్రస్తుతం అనారోగ్య కారణం పేరుతో పని లేకుండా నలుగురు డ్రైవర్లు నెలల తరబడి జీతం పొందుతున్నారు.
రాంపూర్ డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న తాటిచెట్ల కల్లు గీసేందుకు ఓ డ్రైవర్‌కు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి సదరు డ్రైవరుకు వాహనాలు నడిపించడం కంటే ఈ రెండో పని చేయడమే ఎక్కువగా జరుగుతోంది.
ఏడాది కిందట ఓ డ్రైవరు చనిపోతే అతని స్థానంలో సరైన అర్హతలు లేని వ్యక్తికి డ్రైవరుగా ఉద్యోగం కల్పించడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారం సదరు ఉద్యోగి కనుసన్నల్లోనే జరిగిందని.. రూ.2 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపించాయి.
{పజారోగ్య విభాగం, అకౌంట్స్ విభాగాల్లోని ఉన్నతాధికారులకు అద్దె ప్రతిపాదికన కార్లను కార్పొరేషన్ కేటాయించింది. ఈ కారు డ్రైవర్ల జీతభత్యాలను కాంట్రాక్టర్లే చెల్లించాలి. కానీ.. కార్పొరేషన్ నుంచి జీతం తీసుకునే డ్రైవర్లకు పని అప్పగిస్తున్నారు. పై అధికారుల నుంచి ఒత్తిడి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆఖరికి రాంపూర్ డంప్‌యార్డులో చెత్త ఏరుకునే వారి దగ్గర నుంచి అనధికార సభ్యత రుసుముగా నెలకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. కాదంటే వారిని లోపలికి రానివ్వడం లేదు.
నాటు కోడి.. కల్లు సీసా..
Published Thu, Mar 5 2015 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement