ఫిక్స్‌డ్ రేట్ !
అవినీతికి మారుపేరుగా సర్కిల్ కార్యాలయాలు
డబ్బు ఇవ్వకుంటే కాళ్లరిగేలా తిరగాల్సిందే...
సిటిజన్ చార్టర్‌కు మంగళం పాడిన ఉద్యోగులు
పర్యవేక్షణ లేక కొందరు అధికారులు, ఉద్యోగుల బరితెగింపు
పనులు సకాలంలో జరగక నగర వాసుల ఇబ్బందులు
వరంగల్ అర్బన్ :గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటుచేసిన సర్కిల్ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ఇక్కడ ఫైళ్లు, పని ఏదైనా ముడుపులు లేనిదే ముందుకు కదలడం లేదు. కాసులు ఇవ్వడానికి నిరాకరిస్తే కాళ్లరిగేలా తిరిగినా పని జరగని పరిస్థితి నెలకొంది. కొత్త ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తి పేరు మార్పిడి, నల్లా కనెక్షన్లు, ఇంటి నిర్మాణాల అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ జారీ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, అభివృద్ధి పనులే కాకుండా ఇతర కార్యకలాపాలు ఏవైనా సరే ప్రతీ పనికో రేట్ ఫిక్స్ చేసిన కొందరు అధికారులు, ఉద్యోగులు వసూళ్లకు బరితెగిస్తున్నారు. కొన్ని కార్యకలపాలకు దళారులు నియమించుకోగా.. మరికొన్నింటికి నేరుగానే డబ్బు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అధిక మొత్తంలో ‘మాముళ్లు’ వచ్చే పోస్టింగ్ కోసం రూ.లక్షల్లో ముట్టచెప్పేందుకు కూడా వెనుకాడడం లేదని తెలుస్తోంది.
జనాభాకు అనుగుణంగా..
వరంగల్ మహా నగర జనాభా 10లక్షలకు పైచిలుకు చేరగా విస్తీర్ణమూ పెరిగింది. దీంతో పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సుమారు మూడేళ్ల కిందట కాశిబుగ్గ, కాజీపేట రెండు ప్రాంతాల్లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 80శాతం సేవలు అయా సర్కిల్ కార్యాలయాల నుంచే లభిస్తున్నాయి. దీంతో ప్రజలు అయా సర్కిల్ కార్యాలయాలను అశ్రయిస్తున్నారు. అయితే, ఇక్కడ పాలకవర్గం, ఉన్నతాధికారులు ఆజమాయిషీ కానీ ప్రత్యక్ష పర్యవేక్షణ కానీ లేకపోవడంతో అధికారులు, ఉద్యోగులదే ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రజల అవసరాల తీవ్రతను బట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అలా అడిగిన డబ్బు ఇవ్వని వారు పనుల పైళ్లు మూలన పడుతుండడం గమనార్హం. పారదర్శకత కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నా ఉద్యోగులు తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
బయటకు కనబడేవి రెండు చేతులే......
కాసుల కోసం చాచిన చేతులు బయటకు కనిపించేవి ఒకరి చేతులే అయినా.. వివిధ హోదాల్లో కింది స్థాయి నుంచి ఫైనల్ సంతకం చేసే ఉన్నతాధికారుల వరకు వచ్చే డబ్బు వాటాలుగా పంపకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పైసలు ముట్టచెప్పకపోతే పౌరసేవల్లో తీవ్ర జాప్యం చేస్తూ ప్రజాసేవలను పరిహాసం చేస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ–ఆఫీస్‌లో 12,082 దరఖాస్తులు రాగా అందులో సిటిజన్ చార్టర్ ప్రకారం 4,127 పరిష్కరించారు. మిగతా 7,955 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా రెండు సర్కిల్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడమే ఉద్యోగుల అవినీతికి నిదర్శనమని చెప్పొచ్చు. కొందరు క్షేత్ర స్థాయి సిబ్బంది, కార్యాలయాల్లోని క్లర్కులు, సూపరింటెండెంట్లు, ఆపై అధికారులు, ఉన్నతాధికారులు వరకు వసూలు చేసినా సొమ్మును భాగాలుగా వేసి ఎవరికి నిర్ధేశించిన మొత్తాన్ని వారికి పువ్వుల్లో పెట్టి అందచేయడం సర్కిల్ కార్యాలయాల్లో ఓ ‘మామూలు’ వ్యవహరంగా మారింది. అయితే, సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలపై పాలక వర్గం కానీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకోకపోవడంతో అవినీతి హెచ్చరిల్లుతోంది.
పన్నుల విభాగంలో లంచాల గోల....
పన్నుల విభాగంలో అవినీతి మూడు పూలు ఆరు కాయాలుగా విస్తరించింది. కొందరు ఆర్‌ఓలు, ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు, క్లర్కులు, సూపరింటెండెంట్లు దోపిడీ పర్వాన్ని యథేచ్చగా కొనసాగిస్తున్నారు. అధునాతన భవనానికి ఆర్డినరీగా పన్ను విధించడం, ఏదైనా ఒక భవనంలోని కొన్ని గదులు కమర్షియల్ రూపంలో అద్దెకు ఇచ్చినా రెసిడెన్షియల్‌గా, కొన్ని గదులను అద్దెకిస్తున్నా యాజమానే మొత్తం వాడుకుంటున్నట్లు, అసలే అసెస్‌మెంట్ చేయకుండా, రివిజన్ పిటిషన్ పేరుతో పన్ను తగ్గిస్తూ ఇలా బల్దియాకు సమకూరాల్సిన రూ.కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆమ్యామ్యాలు పుచ్చుకోవడం ద్వారా కొల్లగొడుతున్నారు.
అవినీతి ప్రణాళిక:
ప్రణాళిక విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. భవన నిర్మాణ అనుమతులకు ‘ఆన్‌లైన్’ ద్వారా దరఖాస్తు చేసుకోవడం వల్ల సకాలంలో మంజూరు కాకపోవడంతో పాటు అనేక నిబంధనలు అడ్డువస్తున్నాయి. దీంతో అనధికారిక నిర్మాణాల జోరు కొనసాగుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఏ ఒక్క పత్రం లేకున్నా అనుమతి రావడం లేదు. కాలం చెల్లినా మాస్టర్ ప్లాన్, అనుమతుల్లో జాప్యం, అధికారులు, సిబ్బంది ఒత్తిళ్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో అనధికారిక నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇలా అనధికారికంగా జరిగే నిర్మాణాల యజమానుల నుంచి వసూలు చేసే మొత్తాన్ని అందరూ పంచుకుంటున్నారని తెలుస్తోంది. ఇక వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమానులు ట్రేడ్ లైసెన్స్ పొందాలంటే రూ.3 నుంచి 5వేల వరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందికి ముట్టచెప్పాల్సిందే. లేదంటే సమీపంలోని షాపులు, ఇళ్ల వారి నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ తీసుకురావాలనే నిబంధనలు చూపెడుతూ దండుకుంటున్నారు. నల్లా కనెక్షన్ విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. నల్లా కనెక్షన్ కావాలంటే బల్దియాకు అన్ని రకాల ఫీజులు చెల్లించినా రూ.3వేల నుంచి10వేల వరకు ఇంజినీర్లకు సిబ్బందికి ముట్టచెప్పాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
పర్యవేక్షణ కరువై
సర్కిల్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడింది. ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు కార్యకలాపాలపై తరచుగా పర్యవేక్షిస్తే ప్రజలకు కొంత మేరకు పారదర్శకమైన సేవలు లభిస్తాయి. అలాంటివేవీ లేకపోవడంతో సర్కిల్ అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. అలాగే, పాలక వర్గం పెద్దలు కూడా పట్టించుకోకపోవడం ప్రజల ఇబ్బందులకు కారణమవుతోంది.