‘పుర’ పొత్తులపై నిర్ణయం మీదే
జిల్లా పార్టీలకు అధికారం కట్టబెట్టిన సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల్లో స్థానిక పొత్తులకు సంబంధించిన నిర్ణయాధికారం జిల్లా పార్టీలకే కట్టబెడుతూ సీపీఐ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఖమ్మం ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కలసి పోటీచేస్తే కొంత ప్రయోజనం ఉంటుందని జిల్లా పార్టీ నుంచి సీపీఐ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే వామపక్షాలుగా సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేద్దామని, కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం ససేమిరా అంటుండడంతో మధ్యే మార్గంగా సీపీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే సీపీఎంతో ఒకసారి చర్చలు జరపగా, కాంగ్రెస్‌తో పొత్తును ఆ పార్టీ నేతలు తోసిపుచ్చారు. అయితే సీపీఎంతో మరోసారి చర్చించాలని సోమవారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గభేటీలో నిర్ణయించారు.
సీపీఐ, సీపీఎం కలసి పోటీచేస్తే సీపీఎంకే లాభం తప్ప సీపీఐకు ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వామపక్షాలకు కొంత బలమున్న ఖమ్మం కార్పొరేషన్‌లో మూడు పార్టీలూ కలసి వెళ్లాలని, లేనిపక్షంలో కాంగ్రెస్‌తో కలసి పోటీచేస్తే ఒకటి, రెండు సీట్లయినా గెలిచే అవకాశం ఉంటుందని ఖమ్మం సీపీఐ నాయకులు పట్టుపడుతున్నారు. రాష్ట్ర పార్టీగా కాకుండా జిల్లా పార్టీకే పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ నిర్ణయించింది. మరోవైపు సీపీఐతో అవగాహన కుదుర్చుకునేందుకు ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు సైతం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తుకు అవకాశం లేదని సీపీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక వరంగల్ కార్పొరేషన్‌కొస్తే, వామపక్షాలకు పెద్దగా బలం లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్‌తో ఈ రెండు పార్టీలు సర్దుబాటు చేసుకునే అవకాశముందని అంటున్నారు.