Khammam Municipal Corporation
-
రంగుల వాల్.. జిగేల్!
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాల్ ప్రాజెక్టులో భాగంగా పలు భవనాలు, ప్రహరీలపై వేసిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పాత మున్సిపల్ కార్యాలయంలో సిటీ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా లైబ్రరీ ప్రహరీపై గీసిన పుస్తకాలు, యువతి తదితర చిత్రాలతో పురాతన భవనం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. సిటీ లైబ్రరీతో పాటు ఇతర అభివృద్ధి పనులను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా?
సాక్షి, మధిర: సాధారణంగా అందరూ స్నానానికి ఉపయోగించే సబ్బు ధర రూ.20 మొదలు రూ.60వరకు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం రూ.96 విలువైన సబ్బులను పంపిణీ చేశారు. ఇదేమిటి, ఇంత ఖరీదైన సబ్బును కార్మికులకు ఇచ్చారా అని ఆశ్చర్యపోతున్నారా! అయితే, సబ్బు విలువైనదేమీ కాదు సాధారణమైనదే. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు కలిసి సబ్బు ధరను అమాంతం పెంచేశారు. కారణమేమిటో పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు కదా?! ‘గణతంత్ర’ వేడుకల్లో పంపిణీ ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె డబ్బాలు, శానిటైజర్లతో పాటు దుస్తులు అందజేయాలని నిర్ణయించారు. ఈమేరకు కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, కమిషనర్ అంబటి రమాదేవి చేతుల మీదుగా వీటిని ఇచ్చేశారు. ఇక వీటి కొనుగోలుకు సంబంధించి బిల్లులను కౌన్సిల్ సమావేశంలో సభ్యులతో ఆమోదించుకుంటేనే చెక్కులు జారీ చేయడం సాధ్యమవుతుంది. చదవండి: కరీంనగర్లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి ఇందుకోసం 31వ తేదీన మధిర మున్సిపల్ సాధారణ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సంబంధించి ఎజెండాలో కొన్ని అంశాలను పొందుపర్చి అధి కార, ప్రతిపక్ష కౌన్సిలర్లకు కాపీలను శనివారం అందజేశారు. ఇక ఈ కాపీలను చూడగానే సభ్యుల కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటారా... కార్మికులకు అందజేసిన 675 సబ్బుల కోసం రూ.96చొప్పున మొత్తం రూ.64,800 ఖర్చు చేసినట్లుగా లెక్కల్లో చూపించారు. చదవండి: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు కౌన్సిల్ ఎజెండా కాపీలో సబ్బుల ధర వివరాలు... ఇదేం సబ్బు? ఒక్కో సబ్బును రూ.96 చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినట్లు బిల్లు ఉండడంతో సభ్యులు ఇవేం సబ్బులు అంటూ 26వ తేదీన వాట్సప్ గ్రూప్‌ల్లో షేర్ చేసిన ఫొటోలను వెనక్కి వెళ్లి మరీ ఆసక్తిగా పరిశీలించారు. తీరా చూస్తే ఆ ఫొటోలో 100గ్రాముల సంతూర్ సబ్బు కనిపించింది. ఇదే బరువు కలిగిన సబ్బు పంపిణీ చేసి ఉంటే మార్కెట్లో ఒక్కో సబ్బు ఎమ్మార్పీ రూ.33 ఉండగా హోల్‌సేల్‌గా రూ.29.50కు వస్తుంది. ఒకవేళ 125 గ్రాముల బరువు కలిగిన సబ్బు అయితే ఆఫర్ ప్యాక్‌లో నాలుగింటితో పాటు మరో సబ్బు ఉచితంగా వస్తుంది. ఈ ప్యాక్ ఎమ్మార్పీ రూ.190 ఉండగా హోల్‌సేల్‌గా రూ.173కు ఇస్తామని స్థానిక వ్యాపారుల్లో ఎవరిని అడిగినా చెబుతారు. అంటే ఒక సబ్బు ఖరీదు రూ.35లోపు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు మాత్రం కౌన్సిల్ ఎజెండాలో జత చేసి బిల్లులను రూ.96గా చూపించడం గమనార్హం. కార్మికుల పేరిట దోపిడీ కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కుటుంబ సభ్యులకు ఆపద ఉంటుందని తెలిసినా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నారు. కరోనా మొదటి దశ నుంచి వైరస్ సోకిన వారి ఇళ్ల వద్ద, కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మొదలు అన్ని పనుల్లో వీరే కీలకంగా నిలుస్తున్నారు. అలాంటిది అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా కార్మికులకు ఇచ్చిన సబ్బులకు కూడా అసలు కంటే ఎక్కువ బిల్లులను మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది. అయితే, ఈనెల 31న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని కౌన్సిలర్లు ప్రశ్నిస్తారా, లేక బిల్లులను ఆమోదిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఒక్కో సబ్బుకు రూ.96గా బిల్లులు సిద్ధం చేయడంతో పాటు శానిటైజర్లు, కొబ్బరినూనె ధరలను కూడా ఎక్కువగానే చూపినట్లు తెలుస్తుండగా, అజెండా కాపీలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవిని సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
పేరుకున్న మురుగు
ఖమ్మం (సహకారనగర్) : నగరంలోని 25వ డివిజన్లోని విజయ్‌నగర్‌కాలనీ–2లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు. అనేక కాలనీల్లో సైడ్ కాల్వలు లేక పోవడంతో ఎక్కడి మురుగు అక్కడే పేరుకపోతోంది. దీంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగును తొలగించటంలో అధికారులు జాప్యం చేయడం మూలంగా మురుగు కంపుతో దినదినగండంగా గడపాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది మురుగును తొలగించటంలో నిర్లక్ష్యం చేస్తుండగా అధికారులు మాత్రం దృష్టి కేంద్రీకరించటం లేదని విమర్శిస్తున్నారు. నిత్యం మురుగు వాసనే.. విజయ్‌నగర్‌కాలనీ–2లోని పలు వీధుల్లోని ప్రజలు మురుగు కంపు భరించలేకపోతున్నామని చెబుతున్నారు. పొద్దున లేచింది మొదలు పడుకునేవరకు ఆ దుర్వాసననే పీల్చుకోవాల్సి వస్తోందని, చిన్న పిల్లలు రోగాలబారిన పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం నుంచి వేసవి కాలం వచ్చేంత వరకు కూడా నిత్యం మురుగు సమస్య వేధిస్తూనే ఉందనే ఆరోపణలున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు స్థానికులు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవటం లేదనే చెబుతున్నారు. డివిజన్లోని పలు ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల వెంట కూడా సైడ్‌డ్రెయిన్లు లేకపోవటంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోవటంతో స్థానికంగా నివాసం ఉండేందుకు ఆసక్తి కనబర్చటం లేదనే ఆరోపణలున్నాయి. మొలిచి, ఎండి.. మురికికూపంగా.. ఖాళీ స్థలాలు అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మురికికూపండా మారాయిని, గతంలో కురిసిన వర్షం నీరు ఇంకా అక్కడే నిలిచి ఉండటం, అందులో నాచు విపరీతంగా పెరిగి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు ఖాళీ స్థలాల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆయా ప్రాంతాలవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
'ఆ మూడు చోట్ల' కొనసాగుతున్న పోలింగ్
హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. సదరు ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లు, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లో 50 డివిజన్లు, అచ్చంపేటలో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్‌లో మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6, 43,862 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అచ్చంపేటలో పంచాయతీ ఎన్నికల కోసం 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 18614 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం పది గంటల వరకు అచ్చంపేటలో 19 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. వరంగల్‌లో ఉదయం 11.00 గంటల వరకు 18.5 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు నేటి సాయంత్రం 5.00 గంటలకు ముగియనున్నాయి. -
‘పుర’ పొత్తులపై నిర్ణయం మీదే
జిల్లా పార్టీలకు అధికారం కట్టబెట్టిన సీపీఐ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల్లో స్థానిక పొత్తులకు సంబంధించిన నిర్ణయాధికారం జిల్లా పార్టీలకే కట్టబెడుతూ సీపీఐ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఖమ్మం ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కలసి పోటీచేస్తే కొంత ప్రయోజనం ఉంటుందని జిల్లా పార్టీ నుంచి సీపీఐ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే వామపక్షాలుగా సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేద్దామని, కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం ససేమిరా అంటుండడంతో మధ్యే మార్గంగా సీపీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే సీపీఎంతో ఒకసారి చర్చలు జరపగా, కాంగ్రెస్‌తో పొత్తును ఆ పార్టీ నేతలు తోసిపుచ్చారు. అయితే సీపీఎంతో మరోసారి చర్చించాలని సోమవారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గభేటీలో నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం కలసి పోటీచేస్తే సీపీఎంకే లాభం తప్ప సీపీఐకు ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వామపక్షాలకు కొంత బలమున్న ఖమ్మం కార్పొరేషన్లో మూడు పార్టీలూ కలసి వెళ్లాలని, లేనిపక్షంలో కాంగ్రెస్‌తో కలసి పోటీచేస్తే ఒకటి, రెండు సీట్లయినా గెలిచే అవకాశం ఉంటుందని ఖమ్మం సీపీఐ నాయకులు పట్టుపడుతున్నారు. రాష్ట్ర పార్టీగా కాకుండా జిల్లా పార్టీకే పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ నిర్ణయించింది. మరోవైపు సీపీఐతో అవగాహన కుదుర్చుకునేందుకు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు సైతం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తుకు అవకాశం లేదని సీపీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక వరంగల్ కార్పొరేషన్కొస్తే, వామపక్షాలకు పెద్దగా బలం లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్‌తో ఈ రెండు పార్టీలు సర్దుబాటు చేసుకునే అవకాశముందని అంటున్నారు. -
కామ్రేడ్ల స్నేహానికి మరో పరీక్ష
కాంగ్రెస్‌తో అవగాహనకు ససేమిరా అంటున్న సీపీఎం సర్దుబాటుకు సీపీఐ ఓకే సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నికలు సీపీఐ, సీపీఎం స్నేహానికి పరీక్షగా మారనున్నాయి. ఈ పార్టీల మధ్య కొంతకాలంపాటు సయోధ్య, ఆ తర్వా త ఏదో ఒక రూపంలో స్నేహానికి వి ఘాతం రావడం మామూలే. ఏవైనా ఎన్నికలు వచ్చినపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ వ్యూహాన్ని అనుసరించాలనే విషయంపై ఒక్కోపార్టీ ఒక్కో విధానాన్ని పాటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2014 ఎన్నికలు ముగిశాక జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పాలక బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులు, సర్దుబాట్లు చేసుకునే ప్రసక్తే లేదంటూ ఆ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా వామపక్షభావ జాలమున్న వ్యక్తులు, శక్తులు, ఆయా సామాజిక సంస్థలు, కులసంఘాలను కలుపుకుని వెళ్లే ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఖమ్మం పరిధిలో సీపీఎంకు బలం ఉండటంతో, సొంతంగా పదిసీట్ల వరకు పోటీచేసి నాలుగైదు సీట్లయినా గెలుచుకోగలమనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. సీపీఐ ఇటీవల జరిగిన ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ మద్దతును తీసుకోవడంతో, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వ క తప్పని పరిస్థితి. కాంగ్రెస్‌తో కలసి సీపీఐ, సీపీఎం పోటీచేస్తే కొన్ని ఎక్కువ సీట్లు గెలవొచ్చునని, అయితే సీపీఎం అందుకు సిద్ధం కాకపోవచ్చని వామపక్షాల నేతలు భావిస్తున్నారు. గత ఒప్పందం కారణంగా కాంగ్రెస్‌తో అవగాహనకు సీపీఐ మొగ్గుచూపవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు చెరోవైపు వెళ్లాల్సిన పరిస్థితులు రావొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనిపై జాతీయ నాయకత్వానికి తెలియజేసి, తదనుగుణంగా వ్యవహరించేం దుకు సీపీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీ రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీపీఐ ముఖ్యనేత ఒకరు సాక్షికి తెలిపారు. త్వరలోనే సీపీఐ, సీపీఎం ముఖ్యనాయకులు సమావేశమై ఖమ్మం ఎన్నికలపై చర్చించి తమ వైఖరులను స్పష్టం చేయనున్నట్లు సమాచారం. -
కమిషనర్ కావలెను..!
- ఇన్చార్జి పాలనలో కార్పొరేషన్ - రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భర్తీ - ఖమ్మానికి మాత్రం గ్రహణం సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్ నియూమకంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఒక్క ఖమ్మం మినహా రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కమిషనర్లు నియమితులయ్యారు. ఖమ్మం అర్బన్ మండలంలోని తొమ్మిది పంచాయతీలతో కార్పొరేషన్‌గా అవతరించినప్పటికీ పూర్తిస్థాయి కమిషనర్ నియామకంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురపాలకాలపై మంగళవారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో కూడా ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ నియామక విషయం చర్చకు రాలేదని తెలిసింది. కార్పొరేషన్ స్థాయికి తగినట్టుగా ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాల్సుంది. నూతన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కమిషనర్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నగర ప్రజలకు సక్రమంగా అందడం లేదు. నగరంలో ఆసరా పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంకా వేలమంది లబ్ధిదారులు పింఛన్ కోసం కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. ఆహార భద్రత కార్డుల ప్రక్రియ ప్రహసనంగా మారే పరిస్థితుంది. ఇన్చార్జి కమిషనర్ పాలనలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది మధ్య సఖ్యత లేకపోవడంతో పాలన గాడి తప్పింది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనులపై కార్పొరేషన్ కార్యాలయూనికి వస్తున్న ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదు. నగరంలోని రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. త్వరలో జీహెచ్ఎంసీ, వరంగల్‌తోపాటు ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.., ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తారని ప్రచారం జరుగుతున్నా.. కమిషనర్ నియామకం దిశగా మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం ఈ వేసవిలో ఖమ్మం నగరానికి మంచినీటి ఎద్దడి పొంచి ఉంది. ఆ దిశగా ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయలేదు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొనైనా ఐఏఎస్ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమిస్తే పాలన గాడిలో పడడంతోపాటు నగర ప్రజల సమస్యలకు మోక్షం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.