ఈనెల 26వ తేదీన కార్మికులకు సబ్బులు, దుస్తులు అందజేస్తున్న చైర్‌పర్సన్, కమిషనర్
సాక్షి, మధిర: సాధారణంగా అందరూ స్నానానికి ఉపయోగించే సబ్బు ధర రూ.20 మొదలు రూ.60వరకు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం రూ.96 విలువైన సబ్బులను పంపిణీ చేశారు. ఇదేమిటి, ఇంత ఖరీదైన సబ్బును కార్మికులకు ఇచ్చారా అని ఆశ్చర్యపోతున్నారా! అయితే, సబ్బు విలువైనదేమీ కాదు సాధారణమైనదే. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు కలిసి సబ్బు ధరను అమాంతం పెంచేశారు. కారణమేమిటో పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు కదా?!
‘గణతంత్ర’ వేడుకల్లో పంపిణీ
ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె డబ్బాలు, శానిటైజర్లతో పాటు దుస్తులు అందజేయాలని నిర్ణయించారు. ఈమేరకు కార్మికులకు మున్సిపల్ చైర్‌పర్సన్ మొండితోక లత, కమిషనర్ అంబటి రమాదేవి చేతుల మీదుగా వీటిని ఇచ్చేశారు. ఇక వీటి కొనుగోలుకు సంబంధించి బిల్లులను కౌన్సిల్ సమావేశంలో సభ్యులతో ఆమోదించుకుంటేనే చెక్కులు జారీ చేయడం సాధ్యమవుతుంది.
చదవండి: కరీంనగర్‌లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి
ఇందుకోసం 31వ తేదీన మధిర మున్సిపల్ సాధారణ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సంబంధించి ఎజెండాలో కొన్ని అంశాలను పొందుపర్చి అధి కార, ప్రతిపక్ష కౌన్సిలర్లకు కాపీలను శనివారం అందజేశారు. ఇక ఈ కాపీలను చూడగానే సభ్యుల కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటారా... కార్మికులకు అందజేసిన 675 సబ్బుల కోసం రూ.96చొప్పున మొత్తం రూ.64,800 ఖర్చు చేసినట్లుగా లెక్కల్లో చూపించారు.
చదవండి: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు
కౌన్సిల్ ఎజెండా కాపీలో సబ్బుల ధర వివరాలు...
ఇదేం సబ్బు?
ఒక్కో సబ్బును రూ.96 చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినట్లు బిల్లు ఉండడంతో సభ్యులు ఇవేం సబ్బులు అంటూ 26వ తేదీన వాట్సప్ గ్రూప్‌ల్లో షేర్ చేసిన ఫొటోలను వెనక్కి వెళ్లి మరీ ఆసక్తిగా పరిశీలించారు. తీరా చూస్తే ఆ ఫొటోలో 100గ్రాముల సంతూర్ సబ్బు కనిపించింది. ఇదే బరువు కలిగిన సబ్బు పంపిణీ చేసి ఉంటే మార్కెట్‌లో ఒక్కో సబ్బు ఎమ్మార్పీ రూ.33 ఉండగా హోల్‌సేల్‌గా రూ.29.50కు వస్తుంది. ఒకవేళ 125 గ్రాముల బరువు కలిగిన సబ్బు అయితే ఆఫర్ ప్యాక్‌లో నాలుగింటితో పాటు మరో సబ్బు ఉచితంగా వస్తుంది. ఈ ప్యాక్ ఎమ్మార్పీ రూ.190 ఉండగా హోల్‌సేల్‌గా రూ.173కు ఇస్తామని స్థానిక వ్యాపారుల్లో ఎవరిని అడిగినా చెబుతారు. అంటే ఒక సబ్బు ఖరీదు రూ.35లోపు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు మాత్రం కౌన్సిల్ ఎజెండాలో జత చేసి బిల్లులను రూ.96గా చూపించడం గమనార్హం.
కార్మికుల పేరిట దోపిడీ
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కుటుంబ సభ్యులకు ఆపద ఉంటుందని తెలిసినా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నారు. కరోనా మొదటి దశ నుంచి వైరస్ సోకిన వారి ఇళ్ల వద్ద, కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మొదలు అన్ని పనుల్లో వీరే కీలకంగా నిలుస్తున్నారు. అలాంటిది అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా కార్మికులకు ఇచ్చిన సబ్బులకు కూడా అసలు కంటే ఎక్కువ బిల్లులను మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది.
అయితే, ఈనెల 31న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని కౌన్సిలర్లు ప్రశ్నిస్తారా, లేక బిల్లులను ఆమోదిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఒక్కో సబ్బుకు రూ.96గా బిల్లులు సిద్ధం చేయడంతో పాటు శానిటైజర్లు, కొబ్బరినూనె ధరలను కూడా ఎక్కువగానే చూపినట్లు తెలుస్తుండగా, అజెండా కాపీలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవిని సంప్రదించేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment