కామ్రేడ్ల స్నేహానికి మరో పరీక్ష
కాంగ్రెస్‌తో అవగాహనకు ససేమిరా అంటున్న సీపీఎం
సర్దుబాటుకు సీపీఐ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నికలు సీపీఐ, సీపీఎం స్నేహానికి పరీక్షగా మారనున్నాయి. ఈ పార్టీల మధ్య కొంతకాలంపాటు సయోధ్య, ఆ తర్వా త ఏదో ఒక రూపంలో స్నేహానికి వి ఘాతం రావడం మామూలే. ఏవైనా ఎన్నికలు వచ్చినపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ వ్యూహాన్ని అనుసరించాలనే విషయంపై ఒక్కోపార్టీ ఒక్కో విధానాన్ని పాటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2014 ఎన్నికలు ముగిశాక జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పాలక బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులు, సర్దుబాట్లు చేసుకునే ప్రసక్తే లేదంటూ ఆ పార్టీల నాయకులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా వామపక్షభావ జాలమున్న వ్యక్తులు, శక్తులు, ఆయా సామాజిక సంస్థలు, కులసంఘాలను కలుపుకుని వెళ్లే ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఖమ్మం పరిధిలో సీపీఎంకు బలం ఉండటంతో, సొంతంగా పదిసీట్ల వరకు పోటీచేసి నాలుగైదు సీట్లయినా గెలుచుకోగలమనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. సీపీఐ ఇటీవల జరిగిన ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ మద్దతును తీసుకోవడంతో, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వ క తప్పని పరిస్థితి. కాంగ్రెస్‌తో కలసి సీపీఐ, సీపీఎం పోటీచేస్తే కొన్ని ఎక్కువ సీట్లు గెలవొచ్చునని, అయితే సీపీఎం అందుకు సిద్ధం కాకపోవచ్చని వామపక్షాల నేతలు భావిస్తున్నారు. గత ఒప్పందం కారణంగా కాంగ్రెస్‌తో అవగాహనకు సీపీఐ మొగ్గుచూపవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు చెరోవైపు వెళ్లాల్సిన పరిస్థితులు రావొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనిపై జాతీయ నాయకత్వానికి తెలియజేసి, తదనుగుణంగా వ్యవహరించేం దుకు సీపీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీ రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీపీఐ ముఖ్యనేత ఒకరు సాక్షికి తెలిపారు. త్వరలోనే సీపీఐ, సీపీఎం ముఖ్యనాయకులు సమావేశమై ఖమ్మం ఎన్నికలపై చర్చించి తమ వైఖరులను స్పష్టం చేయనున్నట్లు సమాచారం.