ఖమ్మం (సహకారనగర్) : నగరంలోని 25వ డివిజన్‌లోని విజయ్‌నగర్‌కాలనీ–2లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు. అనేక కాలనీల్లో సైడ్ కాల్వలు లేక పోవడంతో ఎక్కడి మురుగు అక్కడే పేరుకపోతోంది. దీంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగును తొలగించటంలో అధికారులు జాప్యం చేయడం మూలంగా మురుగు కంపుతో దినదినగండంగా గడపాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది మురుగును తొలగించటంలో నిర్లక్ష్యం చేస్తుండగా అధికారులు మాత్రం దృష్టి కేంద్రీకరించటం లేదని విమర్శిస్తున్నారు.
నిత్యం మురుగు వాసనే..
విజయ్‌నగర్‌కాలనీ–2లోని పలు వీధుల్లోని ప్రజలు మురుగు కంపు భరించలేకపోతున్నామని చెబుతున్నారు. పొద్దున లేచింది మొదలు పడుకునేవరకు ఆ దుర్వాసననే పీల్చుకోవాల్సి వస్తోందని, చిన్న పిల్లలు రోగాలబారిన పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం నుంచి వేసవి కాలం వచ్చేంత వరకు కూడా నిత్యం మురుగు సమస్య వేధిస్తూనే ఉందనే ఆరోపణలున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు స్థానికులు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవటం లేదనే చెబుతున్నారు. డివిజన్‌లోని పలు ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల వెంట కూడా సైడ్‌డ్రెయిన్లు లేకపోవటంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోవటంతో స్థానికంగా నివాసం ఉండేందుకు ఆసక్తి కనబర్చటం లేదనే ఆరోపణలున్నాయి.
మొలిచి, ఎండి.. మురికికూపంగా..
ఖాళీ స్థలాలు అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మురికికూపండా మారాయిని, గతంలో కురిసిన వర్షం నీరు ఇంకా అక్కడే నిలిచి ఉండటం, అందులో నాచు విపరీతంగా పెరిగి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు ఖాళీ స్థలాల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆయా ప్రాంతాలవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment