నగర పాలక సంస్థలోని శానిటరీ విభాగంలో మరో దందా
రూ.లక్షలు గడిస్తున్న జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు
బల్దియూ ఆదాయూనికి గండి చెత్తపారబోస్తే జరిమానాలు
చిరువ్యాపారులపై పెను ప్రభావం
హన్మకొండ : వరంగల్ నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య విభాగం పాలన గాడి తప్పుతోంది. చెత్తపేరిట జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు డబ్బులు గుంజుతూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఫలితంగా బల్దియూ ఆదాయూనికి గండిపడుతోంది. ఈ అక్రమ దందాపై చర్యలు తీసుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు మిన్నకుండి పోతున్నారు.
దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ జరుగుతోంది. దీనికి సమాంతరంగా రోడ్ల వెంట చెత్తాచెదారం పారబోసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలకు నగరపాలక సంస్థ ఉపక్రమించింది. ఇందులో భాగంగా రోడ్లపై చెత్త వేస్తున్న చిరు వ్యాపారులు, వాణిజ్య సముదాయ నిర్వాహకులకు పేరుకుపోరుున చెత్తను బట్టి రూ.300, రూ.500, రూ.1000 జరిమానా విధిస్తున్నారు. ఈ బాధ్యతలు శానిటరీ విభాగంలో పనిచేసే జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చూసుకుంటున్నారు. వచ్చిన డబ్బును నగరపాలక సంస్థ ట్రెజరీలో జమ చేయాలి.
అడిగినంత..
పక్షం రోజులగా కొందరు జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు జరిమానాల పేరిట రశీదులు జారీ చేయకుండా జేబులు నింపుకుంటున్నారు. బయటకు నామామాత్రంగా జరిమానలు విధిస్తూ రశీదులు జారీ చేస్తున్నా.. లోపాయికారీగా చిరువ్యాపారులు, వాణిజ్య సముదాయాలు, దుకాణాదారుల నుంచి రూ.200-రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే రశీదు కావాలంటే రూ.1000 జరిమానా కట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న చిరువ్యాపారులు అడిగినంత ముట్టజెప్పుతున్నారు.
అక్రమ వసూళ్లు
రెండు రోజుల క్రితం వరంగల్ బీట్‌జబార్, బట్టలబజార్, ఆర్‌ఎన్‌టీ రోడ్డులో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కనీసం రూ.300 ఇవ్వనిదే కుదరదంటూ చిరువ్యాపారులపై తమ ప్రతాపం చూపించారు. దీంతో కొందరు చిరువ్యాపారులు ఎదురు తిరిగారు. ఈ ఘటనతో ఈ నయాదందా మొదటిసారి వెలుగులోకి వచ్చింది. వరంగల్‌తో పాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోనూ చిరువ్యాపారులపై ఇదే తరహాలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనితో క్రమంగా ఆస్పత్రులు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, తినుబండారాల షాపుల నిర్వాహకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక చికెన్, మటన్ సెంటర్లు, చేపల అమ్మకం దార్లు, పండ్ల విక్రయాదారులపై వీరి ఆగడాలు శృతి మించుతున్నారుు. వీరికి రకరకాల నిబంధనలు వివరిస్తూ నెలవారీగా రూ.500 నుంచి రూ.1000 వరకు రశీదుల్లేకుండా డబ్బులను గుంజుతున్నారు. ఇలా అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ములను ప్రజారోగ్య విభాగంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ వ్యవహారంలో తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
రశీదుల్లేవ్.. అంతా జేబులోకే..!
Published Mon, Dec 1 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement