Department of Public Health
-
దేశంలో ప్రజారోగ్య విభాగం ఏర్పాటు కావాలి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ లాంటి మహమ్మారి ఇంకొకటి తాకేలోపు దేశంలో ప్రజారోగ్య విభాగం ఏర్పాటు తప్పనిసరి అని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (వెల్లూరు) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జాకబ్ జాన్ స్పష్టంచేశారు. ఇలాంటి విభాగం లేనందున కోవిడ్ వ్యాధి నిర్వహణ బాధ్యతలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థల చేతుల్లో పెట్టాల్సివచ్చిందని వాపోయారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చిందని, మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయని అన్నారు. ‘కోవిడ్ నేర్పిన పాఠాలు’ అన్న అంశంపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వచ్చిన తొలినాళ్లలో 2020 మే 3 నాటికి కేసుల సంఖ్య 6.4 లక్షలకు చేరుకోవచ్చునని భారత వైద్య పరిశోధన సమాఖ్య జరిపిన సర్వే తెలిపిందని, కానీ ఆ రోజుకు అధికారికంగా నమోదైన కేసులు 42 వేలు మాత్రమేనని చెప్పారు. 2020 మార్చిలో కేరళలో మూడు కేసులు దిగుమతి కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారిని పరిశీలించగలిగే వ్యవస్థ లేకపోవడంతో అసలు కేసులెన్ని అన్నది స్పష్టం కాలేదని వివరించారు. ప్రజారోగ్య వ్యవస్థ ఉంటే దేశంలో ఏమూలనైనా కారణాలు తెలియకుండా ఎవరైనా మరణించినా, కొత్త లక్షణాలతో ఎవరికైనా వ్యాధి సోకినా ఆ విషయం వెంటనే అన్ని స్థాయిల్లోని అధికారులకు తెలిసిపోతుందని, కట్టడి చర్యలు సులువు అవుతాయని తేల్చిచెప్పారు. జిల్లాస్థాయిలో నిర్ణయాలు తీసుకునేలా.. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడాన్ని అడ్డుకోకపోవడమే భారత్ చేసిన అతిపెద్ద తప్పిదమని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. తొలిదశ కరోనాను సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాతి కాలంలో ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండో దశ అనివార్యమైందన్నారు. సెరోసర్వేల ప్రకారం 60 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారని.. అయితే ఈ యాంటీబాడీలు వైరస్‌ను నాశనం చేసేవా? కాదా? అన్నది ఎవరూ పరిశీలించలేదని పేర్కొన్నారు. కోవిడ్ తరహా మహమ్మారులను సమర్థంగా కట్టడి చేయాలంటే జిల్లాస్థాయిలోనే నిర్ణయాలు తీసుకోగల వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
‘పొరుగు’ రోగులను ఇబ్బంది పెట్టట్లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం వచ్చే పొరుగు రాష్ట్రాల కోవిడ్–19 బాధితులను ఏమాత్రం ఇబ్బంది పెట్టడంలేదని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇక్కడి ఆస్పత్రుల్లో ముందుగా బెడ్ రిజర్వ్ చేసుకుని వస్తే మంచిదని, బెడ్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడటం సరికాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వస్తున్న రోగులను అడ్డుకుంటున్నట్లు వస్తున్న విమర్శలపై శ్రీనివాసరావు ఈమేరకు స్పందించారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతోనే నిండిపోయాయని తెలిపారు. కొందరు కోవిడ్–19 బాధితులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నారని, సకాలంలో చికిత్స దొరక్క ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా బెడ్ రిజర్వ్ చేసుకుని ఆస్పత్రితో యాజమాన్యంతో ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ నుంచి అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ‘బెడ్ రిజర్వ్ చేసుకున్న ఆస్పత్రి వర్గాలు ప్రభుత్వానికి నిర్ణీత పద్ధతి ప్రకారం రోగి సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని పరిశీలించి, వెంటనే అనుమతి జారీ చేస్తాం. ఆ ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీసు బృందాలకు పంపిస్తాం. వారు దాన్ని పరిశీలించి వెంటనే రోగులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. చాలా సులభంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. రిజర్వ్ చేసుకున్న బెడ్‌ను మరో రోగికి కేటాయించడానికి వీల్లేదు’అని ఆయన చెప్పారు. దీని వల్ల ఇతర రాష్ట్రాల నుంచి రోగి రాగానే చికిత్స మొదలు పెట్టడానికి అవకాశం కలుగుతోందన్నారు. నిమిషాలు, గంటల వ్యవధిలోనే కంట్రోల్ రూమ్ నుంచి అనుమతులు ఇస్తున్నామని, శుక్రవారం ఐదుగురు పేషెంట్లకు ఈ తరహాలో అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. బిహార్, ఢిల్లీ నుంచి కూడా పేషెంట్లు.. రాష్ట్రంలోని 17 జిల్లాలు పొరుగు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నాయని, సరిహద్దు రాష్ట్రాలే కాకుం డా బిహార్, ఢిల్లీ నుంచి కూడా పేషెంట్లు హైదరాబాద్‌కు వస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 15–20 పెద్ద ఆస్పత్రుల్లోనే బెడ్లకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. ఆస్పత్రుల వారీగా బెడ్ల లభ్యతపై లైవ్ డాష్ బోర్డ్ తీసుకొచ్చామని, పేషెంట్ ఏదైనా ఆస్పత్రికి వెళ్లడానికి ముందు రోగి పరిస్థితిని బట్టి నోడల్ ఆఫీసర్ ఆస్పత్రిలో మాట్లాడి అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. అలాంటప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందవచ్చని సూచించారు. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పడకల వివరాలను లైవ్‌లో అప్డేట్ చేస్తున్నా మని, నాణ్యమైనవైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభు త్వం కేటాయిస్తున్న ఆక్సిజ¯Œ ఏ రోజుకి ఆ రోజే సరిపోతోందని, దీంతో ఆక్సిజ¯Œ ఆడిట్ విధానం పెట్టుకున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావొచ్చన్నారు. సెకండ్‌వేవ్‌లో పరిస్థితులు పూర్తి భిన్న ంగా ఉన్నాయని, గతంలో ఎవరైనా కరోనా బాధి తుడు ఆస్పత్రిలో చేరితే వారంలో డిశ్చార్జి అయ్యేవారని, ఇప్పుడు 2–3 వారాలు పడుతోందన్నారు. రాష్ట్రంలో 18 వేల బెడ్స్ ఉంటే 53 వేలకు పెం చారని, ఇతర రాష్ట్రాల వారినే కాకుండా మన రాష్ట్రంలోని వారికి కూడా మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖపై ఉందని చెప్పారు. -
స్వర్ణ ప్యాలెస్ రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి బ్యూరో: అగ్నిప్రమాదం సంభవిస్తే దాన్ని నివారించే రక్షణ వ్యవస్థ లేకపోవడం, హోటల్ నిర్మాణం నిబంధనల మేరకు లేకపోవడం వల్లే విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనకు కారణాలని అధికారులు నిర్ధారించారు. వీటితోపాటు హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణలోనూ అవకతవకలు జరిగినట్లు తేలింది. అలాగే హోటల్లో అమర్చిన విద్యుత్ పరికరాల్లో కూడా నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఘటనపై విచారణ చేస్తున్న అధికార బృందాల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. గత రెండు రోజులుగా ఘటనా స్థలంలో వివిధ కోణాల్లో అధ్యయనం చేసిన అగ్నిమాపక, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలోని కమిటీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈవో ఆధ్వర్యంలోని కమిటీ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నివేదికలు సమర్పించనున్నాయి. ఫైర్ సేఫ్టీ పరికరాలు నిల్.. ► స్వర్ణ ప్యాలెస్ అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోలేదు. ► అగ్నిమాపక భద్రతకు అవసరమైన పరికరాలేవీ హోటల్లో లేవు. ► పైపులు ఉన్నా వాటికి వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు.ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే స్మోక్ డిటెక్టర్లు, అలారం వ్యవస్థ, ఎమర్జెన్సీ లైట్లూ లేవు. ► మంటలు ఆర్పే వాటర్ స్ప్రింక్లర్లు, మోటార్లు ఉన్నా వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ► హోటల్ రిసెప్షన్, రూముల్లో ఫాల్‌సీలింగ్, చెక్కతో నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి ఇవే ప్రధాన కారణం. ► అత్యవసర మార్గం ఉన్నా ఉపయోగం లేకుండా దాన్ని చెక్క తలుపుతో మూసి ఉంచారు. ► భవనంలో ఉన్న మెట్ల మార్గం సైతం ఇరుకిరుకుగానే ఉంది. ► మొదట ప్రమాదం చోటు చేసుకున్న రిసెప్షన్ పక్కనే బ్యాటరీలు, ఇతర విద్యుత్ పరికరాలు ఉన్నాయి. ప్రమాద తీవ్రత అక్కడే ఎక్కువగా ఉండటంతో ఆ ఫ్లోర్లో వైరింగ్ అంతా కరిగిపోయింది. రోగుల భద్రత గాలికి.. రిసెప్షన్లో ఎవరూ లేని వైనం ► రోగుల భద్రత విషయంలో ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగినప్పుడు హోటల్ రిసెప్షన్లో ఎవరూ లేరు. ► రోగులు రిసెప్షన్‌కు ఫోన్ చేసి ఏదైనా సహాయం అడిగితే చేయడానికి రిసెప్షన్‌తో సహా ఆ ఫ్లోర్ మొత్తంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ► రిసెప్షన్ వద్ద ప్రమాదం జరిగి మంటలు పై అంతస్తులకు వ్యాపించినా అప్రమత్తం చేసేవారే లేరు. -
ప్రజారోగ్యం ప్రక్షాళన
ఇద్దరు ఏఎంఓహెచ్‌ల కుర్చీలు ఖాళీ ట్రేడ్లకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి పూర్తిస్థాయిలో ఆధార్ అటెండెన్స్‌కు కసరత్తు విజయవాడ సెంట్రల్ : ప్రజారోగ్య శాఖలో పేరుకుపోయిన అవినీతి మకిలిని వదిలించేందుకు కమిషనర్ జి.వీరపాండియన్ కసరత్తు చేస్తున్నారు. టార్గెట్లు, డెడ్లైన్లతో ఠారెత్తిస్తున్నారు. మాట వినకుంటే సస్పెన్షన్ తప్పదన్న హెచ్చరికలు జారీచేస్తున్నారు. దీర్ఘకాలికంగా పాతుకుపోయిన అధికారుల పీఠాలు కదిలిస్తున్నారు. తొలి విడతగా ఏఎంఓహెచ్ (అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు) 1, 3 ఎం.గోపీనాయక్, పి.రత్నావళిని సాగనంపాలని నిర్ణయించారు. దీంతో వారిద్దరూ హైదరాబాద్‌లో పైరవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్ర‘దక్షిణ’లు డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు చెందిన గోపీనాయక్, రత్నావళి 2012 ఆగస్టులో డిప్యుటేషన్‌పై నగరపాలక సంస్థకు వచ్చారు. గత ఏడాదితోనే వీరి డిప్యుటేషన్ గడువు పూర్తికాగా వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో ఏడాది పొడిగించాల్సిందిగా పేరెంట్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ ఏడాది ఆగస్ట్ వరకు పొడిగించారు. వీరి పనితీరు బాగోలేదంటూ మేయర్ కోనేరు శ్రీధర్ పలుమార్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ స్వీయ పర్యవేక్షణలోనూ అదే తేలింది. ఈ క్రమంలో మరో ఏడాది తమను నగరపాలక సంస్థలోనే కొనసాగించాలని కోరుతూ అధికారులిద్దరూ పేరెంట్ డిపార్ట్మెంట్ చుట్టూ ప్ర‘దక్షిణ’లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల రెండున రత్నావళిని రిలీవ్ చేయాలంటూ వారం రోజుల క్రితమే పబ్లిక్‌హెల్త్ అండ్ ఫ్యామిటీ వెల్ఫేర్ డెరైక్టర్ ఉత్తర్వులిచ్చారు. ప్రజారోగ్యశాఖకు చెందిన ఈ ఉత్తర్వుల్ని అదనపు కమిషనర్ జి.నాగరాజుకు చేరాల్సి ఉండగా, రత్నావళి మధ్యలో హైజాక్ చేశారని సమాచారం. ఇది కమిషనర్ చెవినపడటంతో సీరియస్ అయ్యారు. వెంటనే ఆమెను రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఆ స్థానంలో ఆయుర్వేద ఆస్పత్రి ఇన్చార్జిగా పనిచేస్తున్న రామకోటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. గోపీనాయక్ డిప్యుటేషన్ గడువు ఈ నెల 6 తేదీతో ముగియనుంది. అక్రమాలకు చెక్ డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌ఓ) ట్రేడ్ లెసైన్సుల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని కమిషనర్ నిర్ణయించారు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు ఆరు రోజుల్లోపు జారీ చేయాలని డెడ్‌లైన్ విధించారు. గడువులోపు సర్టిఫికెట్లు జారీ చేయకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నగరంలో 36 వేల డీఅండ్‌ఓ ట్రేడ్ లెసైన్స్‌లు ఉన్నాయి. ఇందులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గతంలో గవర్నర్‌పేట ప్రాంతంలో వసూలుచేసిన సొమ్మును ఎస్ఐ సొంత ఖర్చులకు వాడేసిన సంగతి తెలిసిందే. సుమారు 8 వేల డీఅండ్‌ఓ ట్రేడ్ లెసైన్స్‌ల నుంచి రూ.1.50 కోట్లు వసూలు కావాల్సిఉంది. నగరంలో వ్యాపారాలు విస్తరిస్తున్నప్పటికీ ఆస్థాయిలో డీఅండ్‌ఓ ట్రేడ్ల వసూళ్లు పెరగడం లేదు. ఎస్ఐల చేతివాటంపై విమర్శలున్నాయి. ఈక్రమం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను తెరపైకి తేవడం ద్వారా పారదర్శకంగా వ్యవహరించవచ్చన్నది కమిషనర్ ఆలోచనగా తెలుస్తోంది. ఆధార్ తప్పనిసరి పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే ప్రజారోగ్యశాఖ గాడితప్పిందన్న అభిప్రాయానికి కమిషనర్ వచ్చారు. మస్తర్ల మాయ పేరుతో ప్రతి నెలా లక్షలాది రూపాయల్ని నొక్కేస్తున్నారు. ఆధార్ అటెండెన్స్‌తో అక్రమాలను సరిదిద్దాలన్నది కమిషనర్ ఆలోచన. ఏడెనిమిది డివిజన్లలో మాత్రమే ప్రస్తుతం ఆధార్ అటెండెన్స్ విధానం అమల్లో ఉంది. దీన్ని అన్ని డివిజన్లలో అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ క మ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) ద్వారా ట్యాబ్‌లు సిద్ధం చేశారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి త్వరలోనే ఆధార్ అటెండెన్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మూడు సర్కిళ్ల పరిధిలో 12 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరుపై కమిషనర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిపై వేటు వేయనున్నట్లు సమాచారం. -
ఈ ‘సమ్మె’ట ఇంకెన్నాళ్లు..!
- పదో రోజుకు పారిశుధ్య సమ్మె - ఎక్కడ చూసినా దుర్గంధం - ముసురుకుంటున్న డెంగీ జ్వరాలు విశాఖపట్నం సిటీ : మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె ఆదివారం నాటికి 10వ రోజుకు చేరింది. ప్రజారోగ్య శాఖలోని కొందరు అధికారులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పనులు పురమాయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెగ్యులర్, ఔట్సోర్సింగ్ కార్మికులంతా ఒక్కసారిగా సమ్మెలోకి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కొందరు అధికారులకు బాధ్యతలను అప్పగించారు. నగరంలో చెత్తను తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లడం, మురికివాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, దోమలు వృద్ధి చెందకుండా స్ప్రేయింగ్ చేయించడం, వివాదాలు జరిగే చోట పోలీస్స్టేషన్లకు ఫిర్యాదు చేయడం, చెత్త తొలగింపును అడ్డుకునే వారిపై కేసులు పెట్టడం, రోజూ దినసరి కార్మికులకు పనులు అప్పగించడం వంటి పనులతో బిజీగా ఉంటున్నారు. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలియక ఎవరి సహకారం లేకుండా అన్ని పనులు పురమాయించుకోవడానికి నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఉంది. సమ్మె త్వరగా ముగిస్తే ఓసారి పుష్కరాలకు వెళదామనుకుంటున్న వారికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సమ్మె ముగిసేలా లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఘర్షణలు..! సమ్మె మొదలవడంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించి చెత్తను తొలగించి సమ్మె ప్రభావం లేదని చెప్పుకునే ప్రయత్నం చేద్దామని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు కూలీలను పనుల్లోకి దించాలని చేసిన ఎత్తుగడను పారిశుధ్య కార్మికులు ఆదిలోనే అడ్డుకున్నారు. కూలీలు పనులు చేపడితే ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన కార్మికులు పలు చోట్ల అడ్డుకుంటున్నారు. ఆదివారం కూడా అక్కయ్యపాలెం వేణుగోపాలస్వామి గుడి వద్ద, జోన్-2 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులకు-కూలీలకు మధ్య ఘర్షణలు జరిగినట్టు తెలిసింది. సమ్మె యథాతథం...! సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. నగరంలో ఎక్కడ చెత్తలు అక్కడే అన్నచందంగా పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన చెత్తతో పోల్చుకుంటే రోజూ వారీగా పెరిగే చెత్తకుప్పలు మరింతగా రోడ్లను ఆక్రమించేస్తున్నాయి. ఇప్పటికే రహదారులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. -
బది‘లీలలు’ రాయబేరాలు
మేయర్ ఆదేశాలు బేఖాతర్ పదిరోజులు తిరక్కుండానే కోరుకున్న చోటుకు ప్రజారోగ్య శాఖలో సి‘ఫార్సు’లు మెత్తబడుతున్న అధికారులు విజయవాడ సెంట్రల్ : ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ పాట గుర్తొస్తోంది నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖలో జరుగుతున్న అంతర్గత బదిలీలను చూస్తుంటే. పట్టు మని పది రోజులు కూడా కాకుం డానే తమకు కావాల్సిన డివిజన్లలో పాగా వేసేందుకు కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు (ఎస్.ఐ.లు) పావులు కదుపుతున్నారు. ఇందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడగడుతున్నారు. మూడేళ్లకు పైగా ఒకే సీట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కదిలించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్ జి.వీరపాండియన్‌ను కోరారు. ఈ క్రమంలో ఆయన అన్ని విభాగాల దుమ్ము దులిపారు. ఇష్టమైనా.. కష్టమైనా కదలాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పారు. అవకతవకలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో లాటరీ విధానంలో బదిలీలు చేశారు. కొద్దిపాటి వివాదాలు మినహా బదిలీలు ప్రశాంతంగానే సాగాయి. డివిజన్లో బాధ్యతలు చేపట్టిన రెండో రోజు నుంచే తాము కోరుకున్న డివిజన్ల కోసం కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. పావులు కదుపుతున్నారు.. డివిజన్ పెద్దదైంది. మేం చేయలేం. మమ్మల్ని చిన్న డివిజన్‌కు పంపా లంటూ శానిటరీ ఇన్స్పెక్టర్లు రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య శాఖలో 55 ఎస్.ఐ.ల పోస్టులకు గాను 36 మందిని బదిలీ చేశారు. లాటరీ విధానంలో దండిగా ఆదాయం వచ్చే డివిజన్లను కొందరు కోల్పోయారు. దీంతో తిరిగి వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వన్‌టౌన్, సూర్యారావుపేట, సింగ్‌నగర్ ప్రాంతాల్లోని కొన్ని డివిజన్లలో ఎస్.ఐ. పోస్టుల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఎస్.ఐ.ల మార్పులకు సంబంధించి గట్టిగా పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 21వ డివిజన్లో నైట్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మార్పుకు సంబంధించి పాలక పక్షానికి చెందిన కార్పొరేటర్ దగ్గరుండి పనిచేయించారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. మీరు కమిషనర్‌కు ఫైల్ పెట్టండి.. మేం మాట్లాడుకుంటాం అంటూ హుకుం జారీ చేయడంతో అధికారులు కిమ్మనకుండా చెప్పినట్లు చేస్తున్నారని తెలుస్తోంది. రెండు నెలల కిందట 56 మంది శానిటరీ మేస్త్రుల్ని లాటరీ పద్ధతిలో అంతర్గత బదిలీలు చేశారు. ఇందులో 17 మంది పోస్టింగ్ ఇచ్చిన డివిజన్లలో కాకుండా తాము పనిచేద్దామనుకున్న డివిజన్లలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు లేనట్లు సమాచారం. ఇదే తరహాలో ఎస్.ఐ. పోస్టుల్ని మార్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కొత్త డీసీఆర్ కోసం టీడీపీ ఎమ్మెల్యే యత్నం.. నగరపాలక సంస్థలో మేయర్ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. ఒకే సీటులో మూడేళ్లు దాటిన వారిని కదల్చడం ద్వారా కొంత వరకు అవినీతిని కట్టడి చేయవచ్చన్నది మేయర్ ఆలోచన. కమిషనర్ సహకారంతో పీఠాలు కదిలించగలిగారు. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు టౌన్‌ప్లానింగ్‌ను శాసిస్తున్నారు. మరి కొందరు ప్రజారోగ్య శాఖలో చక్రం తిప్పుతున్నారు. అవసరమైతే తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెప్పి పనిచేయించుకుంటున్నారనే వాదనలు న్నాయి. డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి త్వరలో రిలీవ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖాళీ అవుతున్న డీసీఆర్ పోస్టులో తనకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణతో సంప్రదింపులు జరిపారని సమాచారం. మేయర్‌తో సంబంధం లేకుండానే పోస్టింగ్‌లు.. ఊస్టింగ్‌లు జరిగిపోవడంతో ఆయన ఒకింత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. -
రశీదుల్లేవ్.. అంతా జేబులోకే..!
నగర పాలక సంస్థలోని శానిటరీ విభాగంలో మరో దందా రూ.లక్షలు గడిస్తున్న జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బల్దియూ ఆదాయూనికి గండి చెత్తపారబోస్తే జరిమానాలు చిరువ్యాపారులపై పెను ప్రభావం హన్మకొండ : వరంగల్ నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య విభాగం పాలన గాడి తప్పుతోంది. చెత్తపేరిట జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు డబ్బులు గుంజుతూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఫలితంగా బల్దియూ ఆదాయూనికి గండిపడుతోంది. ఈ అక్రమ దందాపై చర్యలు తీసుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు మిన్నకుండి పోతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ జరుగుతోంది. దీనికి సమాంతరంగా రోడ్ల వెంట చెత్తాచెదారం పారబోసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలకు నగరపాలక సంస్థ ఉపక్రమించింది. ఇందులో భాగంగా రోడ్లపై చెత్త వేస్తున్న చిరు వ్యాపారులు, వాణిజ్య సముదాయ నిర్వాహకులకు పేరుకుపోరుున చెత్తను బట్టి రూ.300, రూ.500, రూ.1000 జరిమానా విధిస్తున్నారు. ఈ బాధ్యతలు శానిటరీ విభాగంలో పనిచేసే జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు చూసుకుంటున్నారు. వచ్చిన డబ్బును నగరపాలక సంస్థ ట్రెజరీలో జమ చేయాలి. అడిగినంత.. పక్షం రోజులగా కొందరు జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు జరిమానాల పేరిట రశీదులు జారీ చేయకుండా జేబులు నింపుకుంటున్నారు. బయటకు నామామాత్రంగా జరిమానలు విధిస్తూ రశీదులు జారీ చేస్తున్నా.. లోపాయికారీగా చిరువ్యాపారులు, వాణిజ్య సముదాయాలు, దుకాణాదారుల నుంచి రూ.200-రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే రశీదు కావాలంటే రూ.1000 జరిమానా కట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న చిరువ్యాపారులు అడిగినంత ముట్టజెప్పుతున్నారు. అక్రమ వసూళ్లు రెండు రోజుల క్రితం వరంగల్ బీట్జబార్, బట్టలబజార్, ఆర్ఎన్టీ రోడ్డులో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కనీసం రూ.300 ఇవ్వనిదే కుదరదంటూ చిరువ్యాపారులపై తమ ప్రతాపం చూపించారు. దీంతో కొందరు చిరువ్యాపారులు ఎదురు తిరిగారు. ఈ ఘటనతో ఈ నయాదందా మొదటిసారి వెలుగులోకి వచ్చింది. వరంగల్‌తో పాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోనూ చిరువ్యాపారులపై ఇదే తరహాలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనితో క్రమంగా ఆస్పత్రులు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, తినుబండారాల షాపుల నిర్వాహకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక చికెన్, మటన్ సెంటర్లు, చేపల అమ్మకం దార్లు, పండ్ల విక్రయాదారులపై వీరి ఆగడాలు శృతి మించుతున్నారుు. వీరికి రకరకాల నిబంధనలు వివరిస్తూ నెలవారీగా రూ.500 నుంచి రూ.1000 వరకు రశీదుల్లేకుండా డబ్బులను గుంజుతున్నారు. ఇలా అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ములను ప్రజారోగ్య విభాగంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ వ్యవహారంలో తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.