బది‘లీలలు’ రాయబేరాలు
మేయర్ ఆదేశాలు బేఖాతర్
పదిరోజులు తిరక్కుండానే కోరుకున్న చోటుకు
ప్రజారోగ్య శాఖలో సి‘ఫార్సు’లు
మెత్తబడుతున్న అధికారులు
విజయవాడ సెంట్రల్ : ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ పాట గుర్తొస్తోంది నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖలో జరుగుతున్న అంతర్గత బదిలీలను చూస్తుంటే. పట్టు మని పది రోజులు కూడా కాకుం డానే తమకు కావాల్సిన డివిజన్లలో పాగా వేసేందుకు కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు (ఎస్.ఐ.లు) పావులు కదుపుతున్నారు. ఇందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడగడుతున్నారు. మూడేళ్లకు పైగా ఒకే సీట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కదిలించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్ జి.వీరపాండియన్‌ను కోరారు. ఈ క్రమంలో ఆయన అన్ని విభాగాల దుమ్ము దులిపారు. ఇష్టమైనా.. కష్టమైనా కదలాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పారు. అవకతవకలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో లాటరీ విధానంలో బదిలీలు చేశారు. కొద్దిపాటి వివాదాలు మినహా బదిలీలు ప్రశాంతంగానే సాగాయి. డివిజన్‌లో బాధ్యతలు చేపట్టిన రెండో రోజు నుంచే తాము కోరుకున్న డివిజన్ల కోసం కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించారు.
పావులు కదుపుతున్నారు..
డివిజన్ పెద్దదైంది. మేం చేయలేం. మమ్మల్ని చిన్న డివిజన్‌కు పంపా లంటూ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య శాఖలో 55 ఎస్.ఐ.ల పోస్టులకు గాను 36 మందిని బదిలీ చేశారు. లాటరీ విధానంలో దండిగా ఆదాయం వచ్చే డివిజన్లను కొందరు కోల్పోయారు. దీంతో తిరిగి వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వన్‌టౌన్, సూర్యారావుపేట, సింగ్‌నగర్ ప్రాంతాల్లోని కొన్ని డివిజన్లలో ఎస్.ఐ. పోస్టుల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఎస్.ఐ.ల మార్పులకు సంబంధించి గట్టిగా పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 21వ డివిజన్‌లో నైట్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మార్పుకు సంబంధించి పాలక పక్షానికి చెందిన కార్పొరేటర్ దగ్గరుండి పనిచేయించారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. మీరు కమిషనర్‌కు ఫైల్ పెట్టండి.. మేం మాట్లాడుకుంటాం అంటూ హుకుం జారీ చేయడంతో అధికారులు కిమ్మనకుండా చెప్పినట్లు చేస్తున్నారని తెలుస్తోంది. రెండు నెలల కిందట 56 మంది శానిటరీ మేస్త్రుల్ని లాటరీ పద్ధతిలో అంతర్గత బదిలీలు చేశారు. ఇందులో 17 మంది పోస్టింగ్ ఇచ్చిన డివిజన్లలో కాకుండా తాము పనిచేద్దామనుకున్న డివిజన్లలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు లేనట్లు సమాచారం. ఇదే తరహాలో ఎస్.ఐ. పోస్టుల్ని మార్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
కొత్త డీసీఆర్ కోసం టీడీపీ ఎమ్మెల్యే యత్నం..
నగరపాలక సంస్థలో మేయర్ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. ఒకే సీటులో మూడేళ్లు దాటిన వారిని కదల్చడం ద్వారా కొంత వరకు అవినీతిని కట్టడి చేయవచ్చన్నది మేయర్ ఆలోచన. కమిషనర్ సహకారంతో పీఠాలు కదిలించగలిగారు. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు టౌన్‌ప్లానింగ్‌ను శాసిస్తున్నారు. మరి కొందరు ప్రజారోగ్య శాఖలో చక్రం తిప్పుతున్నారు. అవసరమైతే తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెప్పి పనిచేయించుకుంటున్నారనే వాదనలు న్నాయి. డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి త్వరలో రిలీవ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఖాళీ అవుతున్న డీసీఆర్ పోస్టులో తనకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణతో సంప్రదింపులు జరిపారని సమాచారం. మేయర్‌తో సంబంధం లేకుండానే పోస్టింగ్‌లు.. ఊస్టింగ్‌లు జరిగిపోవడంతో ఆయన ఒకింత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.