మీరు ఊ అంటే.. ఆదాయం
- ఫ్లోర్‌లీడర్లతో మేయర్ భేటీ
- ఐవీ ప్యాలెస్, బృందావన్ అపార్ట్‌మెంట్స్‌పై చర్చ
- ఆదాయం వస్తుందని సూచన
- తర్వాత చెబుతామన్న పుణ్యశీల
విజయవాడ సెంట్రల్ : ‘నగరపాలక సంస్థ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది.. మీరు సహకరిస్తే ఆదాయం రాబట్టొచ్చ’ని మేయర్ కోనేరు శ్రీధర్ ఫ్లోర్‌లీడర్లతో అన్నారు. తన చాంబర్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సోమవారం ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఐవీ ప్యాలెస్ బకాయిలు రూ.8,50,34,241 ఉన్నాయన్నారు. లీజుదారుడైన అరుణ్‌కుమార్‌కు జనవరిలో నోటీసులు ఇచ్చామన్నారు.కోర్టు కండిషన్ ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో ఐవీ ప్యాలెస్ బకాయిలు వసూలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు.
ఈక్రమంలో అరుణ్‌కుమార్‌తో చర్చలు సాగించగా రూ.6 కోట్లు అయితే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారన్నారు. ప్రస్తుతం రూ.1.55 లక్షలు చెల్లిస్తున్న అద్దెను రూ.5.85 లక్షల చొప్పున వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీల సభ్యులు సహకరించినట్లైతే రూ.6 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.
అపార్ట్‌మెంట్స్ బేరం పెడదాం..
కార్పొరేషన్‌కు చెందిన బృందావన్ అపార్ట్‌మెంట్స్‌లోని ఆరు ప్లాట్లు విక్రయిస్తే రూ.7.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం 15 ఫ్లాట్స్‌కు గాను మూడు అద్దెకు ఇవ్వగా మిగిలినవి కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు. ఇందులో ఆరు అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇటీవలే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చారన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వీటిని విక్రయిస్తే కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ బి.ఎన్. పుణ్యశీల మాట్లాడుతూ విమర్శలకు తావులేకుండా ఏకాభిప్రాయంతోనే ఏదైనా చేయాలన్నారు. ఇందుకు గాను తమపార్టీ సభ్యులతో చర్చించి రెండు మూడు రోజుల్లో తమ అభిప్రాయాన్ని చెబుతామన్నారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం ఫ్లోర్ లీడర్లు జి.హరిబాబు, ఉత్తమ్‌చంద్ బండారీ, జి.ఆదిలక్ష్మి, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు.