నగరానికి కొత్త ప్రాజెక్టులు తెస్తా
విజయవాడ సెంట్రల్ : ‘ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందించా. మార్చిలోపు జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పనులు పూర్తిచేస్తాం. కొత్త సంవత్సరంలో నగరపాలక సంస్థకు నూతన ప్రాజెక్టులు తెస్తా..’ అని మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014వ సంవత్సరం టీడీపీకి అచ్చొచ్చిందని పేర్కొన్నారు. రాజధాని నగరానికి తొలి మేయర్ కావడం సంతోషంగా ఉందన్నారు.
జూలై 3వ తేదీన తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టే సమయానికి నగరపాలక సంస్థ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఉద్యోగులకు నాలుగు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించి రూ.70 కోట్ల నిధులు రాబట్టగలిగానని తెలిపారు. ఉద్యోగులకు మూడు నెలల జీతాలు చెల్లించినట్లు పేర్కొన్నారు. చిన్న, పెద్ద కాంట్రాక్టర్లకు రూ.12.50 కోట్లు చెల్లించినట్లు వివరించారు. అనుమతులు లేకుండా గత పాలకులు చేపట్టిన 127 పనులను ర్యాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి పంపామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జేఎన్‌ఎన్యూఆర్‌ఎం డీటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) లను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపామని వివరించారు.
పేదలకు ఇళ్ల కేటాయింపునకు కృషి
నగరంలో నిర్మించిన 3,500 గృహాలను అర్హులైన పేదలకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. జనవరి నెలాఖరుకు రాజీవ్ ఆవాస యోజన(రే) పథకానికి రూ.21కోట్లు విడుదలవుతాయని, ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వన్‌టౌన్‌లో రూ.3కోట్లతో వాటర్ ట్యాంక్, పాలప్రాజెక్ట్ వద్ద రూ.50 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణ పనులను చేపట్టామని పేర్కొన్నారు. సింగ్‌నగర్, పాయకాపురం, వాంబేకాలనీ ప్రాంతాల్లో మార్చిలోపు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టామని వివరించారు. రూ.1.89 కోట్లతో సింగ్‌నగర్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.