దిక్కులేని దివాణం
కార్పొరేషన్‌లో పడకేసిన పాలన
బోసిపోతున్న కార్యాలయం
ఎక్కడి పనులు అక్కడే..
సిబ్బంది ఇష్టారాజ్యం
7న కౌన్సిల్ సమావేశంతో హైరానా
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో పాలన పడకేసింది. కమిషనర్ జి.వీరపాండియన్ ఏప్రిల్ 24 నుంచి సెలవులో ఉన్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రధాన విభాగాల్లోని ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కీలక విభాగాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సీట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకే కొందరు ఉద్యోగులు ఇంటిదారి పడుతున్నారు. కమిషనర్ ఉన్న సమయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజాప్రతినిధులు, ప్రజలతో సందడిగా ఉండే వరండా జనాల్లేక బోసిపోయింది. ఈ నేపథ్యంలో ఈనెల ఏడో తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ కోనేరు శ్రీధర్ నిర్ణయించారు. దీంతో అధికారులు హైరానా పడుతున్నారు. సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కమిషనర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గడువు ముంచుకురావడంతో ఇన్‌చార్జి కమిషనర్ జి.నాగరాజు ప్రియాంబుల్స్‌పై సంతకాలు చేసే పనిలో పడ్డారు.
‘ప్రజారోగ్యా’నికి అనారోగ్యం
ప్రజారోగ్య విభాగంలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ మూడు రోజులుగా సెలవులో ఉన్నారు. ఏఎంవోహెచ్‌ల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో డివిజన్లలో చెత్తకుప్పలు పేరుకుపోయి పారిశుధ్యం క్షీణిస్తోందని ప్రజలు ఆరోపిస్తూ 103కు ఫిర్యాదులు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో పనిచేసే డ్వాక్వా, సీఎంఈవై పారిశుధ్య కార్మికులకు సంబంధించి టెండర్ పిలవాలన్న సీడీఎంఏ నిర్ణయం మేరకు ఆ ప్రక్రియ చేపట్టాల్సిందిగా కమిషనర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. గ్రేటర్ విశాఖపట్నంలో ఇదే విషయమై కార్మికులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రజారోగ్యశాఖాధికారులు పునరాలోచలో పడినట్టు తెలుస్తోంది. కమిషనర్ వస్తే కానీ, టెండర్‌పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని సమాచారం.
అధికారుల ఎదురుచూపులు
టౌన్‌ప్లానింగ్ విభాగంలో నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లుగా, టీపీఎస్ రాంబాబు టీపీవోగా పదోన్నతిపై వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కమిషనర్ లేకపోవడంతో వీరు విధుల నుంచి రిలీవ్ కాలేదు. రాష్ట్రంలోని మిగితా జిల్లాల్లో పదోన్నతులు పొందిన ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో జాయిన్ కాగా, ఇక్కడి ఉద్యోగులు మాత్రం కమిషనర్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. కమిషనర్ ఈనెల 3, 4 తేదీల్లో వస్తారని ఒకవైపు ప్రచారం సాగుతుండగా, కౌన్సిల్ మీటింగ్ వరకు వచ్చే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సూపరింటెండెంట్లతో పాటు వివిధ విభాగాల్లో బదిలీలకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్ పడ్డాయి. బదిలీ అయిన ఉద్యోగులు కొందరు ఇంకా విధుల్లో చేరలేదని భోగట్టా. ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలో కమిషనర్ లేకపోవడంతో కార్పొరేషన్ దిక్కులేని దివాణంలా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.