ఈ ‘సమ్మె’ట ఇంకెన్నాళ్లు..! | To tenth day Sanitation Strike | Sakshi
Sakshi News home page

ఈ ‘సమ్మె’ట ఇంకెన్నాళ్లు..!

Published Mon, Jul 20 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

ఈ ‘సమ్మె’ట ఇంకెన్నాళ్లు..!

ఈ ‘సమ్మె’ట ఇంకెన్నాళ్లు..!

- పదో రోజుకు పారిశుధ్య సమ్మె
- ఎక్కడ చూసినా దుర్గంధం
- ముసురుకుంటున్న డెంగీ జ్వరాలు
విశాఖపట్నం సిటీ :
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె ఆదివారం నాటికి 10వ రోజుకు చేరింది. ప్రజారోగ్య శాఖలోని కొందరు అధికారులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పనులు పురమాయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ కార్మికులంతా ఒక్కసారిగా సమ్మెలోకి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కొందరు అధికారులకు బాధ్యతలను అప్పగించారు.

నగరంలో చెత్తను తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లడం, మురికివాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, దోమలు వృద్ధి చెందకుండా స్ప్రేయింగ్ చేయించడం, వివాదాలు జరిగే చోట పోలీస్‌స్టేషన్‌లకు ఫిర్యాదు చేయడం, చెత్త తొలగింపును అడ్డుకునే వారిపై కేసులు పెట్టడం, రోజూ దినసరి కార్మికులకు పనులు అప్పగించడం వంటి పనులతో బిజీగా ఉంటున్నారు. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలియక ఎవరి సహకారం లేకుండా అన్ని పనులు పురమాయించుకోవడానికి నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఉంది. సమ్మె త్వరగా ముగిస్తే ఓసారి పుష్కరాలకు వెళదామనుకుంటున్న వారికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సమ్మె ముగిసేలా లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ఘర్షణలు..!
సమ్మె మొదలవడంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించి చెత్తను తొలగించి సమ్మె ప్రభావం లేదని చెప్పుకునే ప్రయత్నం చేద్దామని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు కూలీలను పనుల్లోకి దించాలని చేసిన ఎత్తుగడను పారిశుధ్య కార్మికులు ఆదిలోనే అడ్డుకున్నారు. కూలీలు పనులు చేపడితే ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన కార్మికులు పలు చోట్ల అడ్డుకుంటున్నారు. ఆదివారం కూడా అక్కయ్యపాలెం వేణుగోపాలస్వామి గుడి వద్ద, జోన్-2 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులకు-కూలీలకు మధ్య ఘర్షణలు జరిగినట్టు తెలిసింది.
 
సమ్మె యథాతథం...!
సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. నగరంలో ఎక్కడ చెత్తలు అక్కడే అన్నచందంగా పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన చెత్తతో పోల్చుకుంటే రోజూ వారీగా పెరిగే చెత్తకుప్పలు మరింతగా రోడ్లను ఆక్రమించేస్తున్నాయి. ఇప్పటికే రహదారులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement