Commissioner Praveen
-
ఈ ‘సమ్మె’ట ఇంకెన్నాళ్లు..!
- పదో రోజుకు పారిశుధ్య సమ్మె - ఎక్కడ చూసినా దుర్గంధం - ముసురుకుంటున్న డెంగీ జ్వరాలు విశాఖపట్నం సిటీ : మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె ఆదివారం నాటికి 10వ రోజుకు చేరింది. ప్రజారోగ్య శాఖలోని కొందరు అధికారులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పనులు పురమాయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెగ్యులర్, ఔట్సోర్సింగ్ కార్మికులంతా ఒక్కసారిగా సమ్మెలోకి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కొందరు అధికారులకు బాధ్యతలను అప్పగించారు. నగరంలో చెత్తను తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లడం, మురికివాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, దోమలు వృద్ధి చెందకుండా స్ప్రేయింగ్ చేయించడం, వివాదాలు జరిగే చోట పోలీస్స్టేషన్లకు ఫిర్యాదు చేయడం, చెత్త తొలగింపును అడ్డుకునే వారిపై కేసులు పెట్టడం, రోజూ దినసరి కార్మికులకు పనులు అప్పగించడం వంటి పనులతో బిజీగా ఉంటున్నారు. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలియక ఎవరి సహకారం లేకుండా అన్ని పనులు పురమాయించుకోవడానికి నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఉంది. సమ్మె త్వరగా ముగిస్తే ఓసారి పుష్కరాలకు వెళదామనుకుంటున్న వారికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సమ్మె ముగిసేలా లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఘర్షణలు..! సమ్మె మొదలవడంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించి చెత్తను తొలగించి సమ్మె ప్రభావం లేదని చెప్పుకునే ప్రయత్నం చేద్దామని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు కూలీలను పనుల్లోకి దించాలని చేసిన ఎత్తుగడను పారిశుధ్య కార్మికులు ఆదిలోనే అడ్డుకున్నారు. కూలీలు పనులు చేపడితే ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన కార్మికులు పలు చోట్ల అడ్డుకుంటున్నారు. ఆదివారం కూడా అక్కయ్యపాలెం వేణుగోపాలస్వామి గుడి వద్ద, జోన్-2 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులకు-కూలీలకు మధ్య ఘర్షణలు జరిగినట్టు తెలిసింది. సమ్మె యథాతథం...! సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. నగరంలో ఎక్కడ చెత్తలు అక్కడే అన్నచందంగా పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన చెత్తతో పోల్చుకుంటే రోజూ వారీగా పెరిగే చెత్తకుప్పలు మరింతగా రోడ్లను ఆక్రమించేస్తున్నాయి. ఇప్పటికే రహదారులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. -
మాట వినకుంటే సరెండర్
జీవీఎంసీ అధికారులపై ఎమ్మెల్యేల ఒత్తిడి విశాఖపట్నం సిటీ : జీవీఎంసీలో కొందరు అధికారులను ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఆ అధికారులపై ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ వేటు వేయిస్తున్నారు. బదిలీ కాకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేసేయాలని కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. దీనికి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తలొగ్గుతుండడం గమనార్హం. జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ సీఎంఓహెచ్ డాక్టర్ ఎం.ఎస్.రాజును గుట్టు చప్పుడు కాకుండా గత వారం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థాన ంలో జోన్-4 ఏఎంఓహెచ్‌గా ఉన్న డాక్టర్ ఎం.వి.వి.మురళీమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేల మాట వినలేదనే..!: తూర్పు, దక్షిణ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఒత్తిడితోనే ఎం.ఎస్ రాజును సరెండర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజారోగ్య విభాగంలో కొన్ని పోస్టులకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కొందరి పేర్లను సిఫార్సు చేశారు. అదే విధంగా తాము చెప్పిన వారికే పారిశుధ్య కాంట్రాక్టు ఇవ్వాలని పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆ సిఫార్సులను సీఎంహెచ్ఓ ఆమోదించలేదని తెలుస్తోంది. దాంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యేలు సీఎంఓహెచ్‌ను సరెండర్ చేయాలని కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఖాళీ అయిన సీఎంఓహెచ్ పోస్టు కోసం అప్పుడే కొందరు వైద్యులు పైరవీలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో అప్పుడే హైదరాబాద్‌లో వాలిపోయారని అంటున్నారు. గతంలో పని చేసిన వైద్యాధికారులతో పాటు హైదరాబాద్ నుంచి కొందరు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరి కొందరు, మంత్రి నారాయణ సొంత జిల్లాకు చెందిన వైద్యులు కొందరు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ మురళీమోహన్‌కు సీఎంఓహెచ్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి. కానీ రాజకీయ సిఫార్సు లేకపోవడం మైనస్ కాగలదని అంచనా వేస్తున్నారు. సీఈపై కూడా వేటు..?: చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్‌కు కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన పట్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. దాంతో ఆయన్ను కూడా మార్చాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనికి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సరేనన్నట్టు తెలుస్తోంది. కాగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికారులపై వేటు వేయడంపై జీవీఎంసీలో కలకలం రేపుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే జీవీఎంసీలో పని చేసేందుకు ఓ ఒక్క అధికారి ముందుకు రారని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలు సెల్లార్లను తొలగించకుండా అడ్డుకోగలిగారు.