మాట వినకుంటే సరెండర్ | Heard the word surrender | Sakshi
Sakshi News home page

మాట వినకుంటే సరెండర్

Published Tue, Jul 7 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

Heard the word surrender

జీవీఎంసీ అధికారులపై ఎమ్మెల్యేల ఒత్తిడి
 
విశాఖపట్నం సిటీ : జీవీఎంసీలో కొందరు అధికారులను ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఆ అధికారులపై ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ వేటు వేయిస్తున్నారు. బదిలీ కాకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేసేయాలని కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. దీనికి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తలొగ్గుతుండడం గమనార్హం. జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ సీఎంఓహెచ్ డాక్టర్ ఎం.ఎస్.రాజును గుట్టు చప్పుడు కాకుండా గత వారం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థాన ంలో జోన్-4 ఏఎంఓహెచ్‌గా ఉన్న డాక్టర్ ఎం.వి.వి.మురళీమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఎమ్మెల్యేల మాట వినలేదనే..!: తూర్పు, దక్షిణ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఒత్తిడితోనే ఎం.ఎస్ రాజును సరెండర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజారోగ్య విభాగంలో కొన్ని పోస్టులకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కొందరి పేర్లను సిఫార్సు చేశారు. అదే విధంగా తాము చెప్పిన వారికే పారిశుధ్య కాంట్రాక్టు ఇవ్వాలని పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆ సిఫార్సులను సీఎంహెచ్‌ఓ ఆమోదించలేదని తెలుస్తోంది. దాంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యేలు సీఎంఓహెచ్‌ను సరెండర్ చేయాలని కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఖాళీ అయిన సీఎంఓహెచ్ పోస్టు కోసం అప్పుడే కొందరు వైద్యులు పైరవీలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో అప్పుడే హైదరాబాద్‌లో వాలిపోయారని అంటున్నారు. గతంలో పని చేసిన వైద్యాధికారులతో పాటు హైదరాబాద్ నుంచి కొందరు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరి కొందరు, మంత్రి నారాయణ సొంత జిల్లాకు చెందిన వైద్యులు కొందరు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్ మురళీమోహన్‌కు సీఎంఓహెచ్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి. కానీ రాజకీయ సిఫార్సు లేకపోవడం మైనస్ కాగలదని అంచనా వేస్తున్నారు.

సీఈపై కూడా వేటు..?: చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్‌కు కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన పట్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. దాంతో ఆయన్ను కూడా మార్చాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనికి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సరేనన్నట్టు తెలుస్తోంది. కాగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికారులపై వేటు వేయడంపై జీవీఎంసీలో కలకలం రేపుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే జీవీఎంసీలో పని చేసేందుకు ఓ ఒక్క అధికారి ముందుకు రారని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలు సెల్లార్‌లను తొలగించకుండా అడ్డుకోగలిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement