Jvmc
-
మాస్టర్ ప్లాన్.. ఫ్లాప్
మధురవాడ : జీవీఎంసీ, వుడా అధికారుల మధ్య సమన్వయ లోపం.. అధికార పార్టీ అనుచరగణం బంధు ప్రీతి.. అన్నీ కలపి ప్రజల పాలిటశాపంగా మారాయి. నగర శివారు 4,5 వార్డుల్లోని పలు వుడా మాస్టర్ ప్లాన్ రోడ్లు, నగరంపాలెం రోడ్డు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా తయారైతే.. రేవళ్లపాలెం రోడ్డు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక జాతీయ రహదారి–బక్కన్నపాలెం(సాయిప్రియా గార్డెన్) మధ్య నిర్మిస్తున్న 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డుకు చిప్పాడ దివీస్ లేబొరేటరీ కెమికల్ పరిశ్రమ యాజమాన్యం మోకాలడ్డుతోంది. నగరంపాలెం రోడ్డుకు మోక్షమెప్పుడో.. మధురవాడ జాతీయ రహదారి– నగరంపాలెం 80అడుగుల రోడ్డు అతీ గతీ లేకుండా పోయింది. ఈ పనులకు అధికార పార్టీనేతలు మోకాలడ్డుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో అప్పటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు పనులు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఉన్నాయి. జాతీయ రహదారి నుంచి నగరంపాలెం మీదుగా భీమిలి బీచ్‌రోడ్డు వరకు 4కిలో మీటర్లు మేర నిర్మాణం సాగే దీనికి రూ.4కోట్లు నిధులు మంజూరైనట్లు వుడా అధికారులే చెపుతున్నా... పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జీవీఎంసీ, వుడా అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణంగా తెలుస్తోంది. సాయిప్రియా గార్డెన్ రోడ్డుకు దివీస్ మోకాలడ్డు.. జాతీయ రహదారి–బక్కన్నపాలెం(సాయిప్రియా గార్డెన్) రోడ్డు నిర్మాణ పనులు రు.2కోట్లతో జరుగుతున్నాయి. రెండేళ్లు నుంచి 90శాతం పనులు పూర్తి చేశారు. కానిlఈ రోడ్డు జాతీయ రహదారిని కలిపే చోట చంద్రంపాలెం వద్ద బాపూజీ కళామందిరం వెనుక భీమిలి మండలం చిప్పాడలో ఉన్న దివీస్ లేబోరేటరీకి చెందిన సుమారు రెండు ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలం మధ్యలోంచి రోడ్డు వెళ్తున్న కారణంగా వారు ప్లాన్‌నే మార్చటానికి ఒత్తిడి చేస్తుండటంతో పనులు ముందుకు సాగడంలేదు. రేవళ్లపాలెం రోడ్డుది అదే పరిస్థితి.. ఇక రేవళ్లపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు అసంపూర్తిగా ఉన్న పనులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ఈ రోడ్డులో రేవళ్లపాలెం వద్ద నిర్వాసితులౌతున్న 33 మంది పునరావాసంపై అధికారలు తేల్చటం లేదు. మొదట్లో వీరికి నవోదయ వద్ద ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ సమీపంలో సర్వే నెంబరు 137లో 76సెంట్లులో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడకపోవటంతో సందిగ్దం నెలకొంది. -
పనులు పూర్తి కాకుండానే చెల్లింపులా?
పనుల నిర్వహణలో అధికారుల వైఫల్యం వుడా లేఅవుట్లపై అసంతృప్తి ఆడిట్ అభ్యంతరాలపై అందని వివరణలు సమీక్షలో పీఏసీ చైర్మన్ భూమా ఆగ్రహం విశాఖపట్నం: పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లించారని రాష్ట్ర శాసనసభ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి జిల్లా అధికారులను నిలదీశారు. పనులు, రికార్డుల నిర్వహణలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో పీఏసీ నిర్వహించిన సమావేశంలో జీవీఎంసీ, వుడా, జేఎన్ఎన్యూఆర్ఎం, గిరిజన సంక్షేమ శాఖల ఆడిట్ అభ్యంతరాలపై సమీక్షించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ 2011-12కు సంబంధించి పెండింగులో ఉన్న ఆడిట్ పేరాలు, వాల్తేర్ క్లబ్ వివాదం తదితర అంశాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. నాలుగు జీవీఎంసీ ప్రాజెక్టుల్లో సెంట్రల్ ఎక్సైజ్ రాయితీ రూపంలో కాంట్రాక్టర్లకు రూ.10.17 కోట్లు అనవసరంగా చెల్లించారన్నారు. నిబంధనల మేరకే రాయితీ ఇచ్చినట్టు అప్పటి కలెక్టర్ పేర్కొన్నారని, అలా అయితే ఆడిట్ అభ్యంతరం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. దీనిపై కాంట్రాక్టర్ కోర్టుకెళ్లడంతో రికవరీ చేయలేదని అధికారులిచ్చిన సమాధానానికి చైర్మన్ సంతృప్తి చెందలేదు. పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు ఎలా చెల్లింపులు జరుపుతారని ప్రశ్నించారు. గాజువాక నీటి సరఫరా పథకంలో కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.53.79 లక్షలు చెల్లించారని, దాన్ని రికవరీ చేయలేదని ఆక్షేపించారు. కొంతమంది కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయడం, మరికొందరి నుంచి వసూలు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు ప్రాజెక్టుల్లో రూ.1.42 కోట్ల సర్వీస్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత నగరంలో 2009లో 13 వేల ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలన్నది లక్ష్యం కాగా 10,339 ఇళ్లకే ఇచ్చారని, ఈ పథకం కింద నిర్మించిన శుద్ధి కేంద్రాల నుంచి 12 ఎంఎల్డీకి బదులు 3.6 ఎంఎల్డీ శుద్ధ జలాలను మాత్రమే విక్రయించడంపై ఆరా తీశారు. 1995లో వాల్తేరు క్లబ్ ను జఫ్తు చేయాలని నాటి పీఏసీ ఆదేశించినా ఇప్పటికీ అమలుకాలేదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపులో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల సాయంతో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వివిధ కేసుల్లో న్యాయ సలహా తీసుకోకుండా కోర్టుల్లో కౌంటర్ దాఖలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, దీనిపై ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేస్తుందని చెప్పారు. రూ.452.93 కోట్లతో చేపట్టిన బీఆర్టీఎస్ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావలసి ఉన్నా జాప్యం జరగడం వల్ల వ్యయం పెరిగిందన్నారు. ఈ ఏడాది మార్చికి ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు సమాధానమిచ్చారు. ఆ హోటల్‌కు అనుమతులెలా ఇచ్చారు? అగ్నిప్రమాదాల నివారణ పరికరాలు సక్రమంగా లేని నోవోటెల్ హోటల్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని కమిటీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు అధికారులను ప్రశ్నించారు. ఏదైనా ప్రమాదం వాటిల్లితే భారీ ప్రాణనష్టం జరుగుతుందన్నారు. అనుమతించిన ప్రణాళికకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, వాటి పూర్తి వివరాలు కమిటీకి సమర్పించాలని కోరారు. సీతమ్మధార రైతుబజారు వద్ద 34 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలా అనుమతులిచ్చారని, పై అంతస్తుల్లో ఉన్న వారిని రక్షించేందుకు అధునాతన పరికరాలున్నాయో లేదో వివరాలివ్వాలని ఆదేశించారు. వీటి నిర్మాణాలు పూర్తయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. వుడా లేఅవుట్లపై .. ప్రభుత్వ భూములను వుడా లేఅవుట్లలో కలిపి వేయడం, అటవీ భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేయడంపై మధ్యాహ్నం జరిగిన సమీక్షలో చైర్మన్ నాగిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వుడా సేకరించిన, పంపిణీ చేసిన భూమి ఎంతో చెప్పాలన్నారు. ఆశించిన స్థాయిలో రికవరీ చేయకుండా అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్లో అవకతవకలపై తీసుకున్న చర్యల నివేదిక, ఐటీడీఏ ఆడిట్ వివరాలు, అడ్వాన్సు చెల్లింపుల వివరాలు కమిటీకి సమర్పించాలన్నారు. 1998 నుంచి ప్రజాపద్దుల కమిటీ లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇప్పటికీ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. పెండింగు ఆడిట్ పేరాలపై రెండు వారాల్లో చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలన్నారు. విశాఖను బాధిస్తున్న కాలుష్యంపై గనులు, కాలుష్య నియంత్రణ అధికారులు ఏంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు ఏరియాలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కలెక్టర్ యువరాజ్ సమాధానమిస్తూ అన్ని వివరాలు కమిటీకి నివేదిస్తానన్నారు. విశాఖలో ఏజీఎంసీ పరిశ్రమలో తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని కమిటీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు గణబాబు, ఎ.సురేష్, పి.శమంతకమణి, ఎంవీఎస్ శర్మ, కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో చంద్రశేఖరరెడ్డి, వుడా అదనపు వీసీ రమేష్, పరిశ్రమలశాఖ జీఎం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వాయుకాలుష్యంపై శాస్త్రీయ అంచనా అవసరం
స్వతంత్ర సంస్థ ద్వారా కారణాల అన్వేషణ {పభుత్వ రంగ సంస్థలకు జీవీఎంసీ పార్కుల దత్తత స్పెషల్ టాస్క్ ఫోర్స్ తొలిసారి భేటీ విశాఖపట్నం : నగరంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య, నివాస, తీర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని శాస్త్రీయంగా అంచనా వేస్తేకానీ నియంత్రణకు ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక నిర్ణయానికి రాలేరు. ప్రస్తుతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే వాయుకాలుష్య అంచనా పరికరాలున్నాయి. వీటిని నగరమంతా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది...’ అని కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. కమిటీ తొలి భేటీ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అధ్యక్షతన జరిగింది. నగరంలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య స్థాయిని అధ్యయనం చేసి విశ్లేషించి అందుకు కారణమయ్యే సంస్థలను గుర్తించే బాధ్యతలను గీతం విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసే బాధ్యతను పర్యావరణ నిపుణులు ప్రొ.ఎస్.రామకృష్ణారావుకు అప్పగిస్తూ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి వద్ద లభించే సమాచారంతో పాటు తాము స్వతంత్రంగా కొన్ని ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి కాలుష్య కారకులపై విశ్లేషణ జరపాలని ప్రొ.రామకృష్ణారావును సమావేశం కోరింది. నగరంలో ప్రస్తుత కాలుష్యం జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ప్రసాద్ వివరించారు. క్రీడాసదుపాయాల గురించి చర్చిస్తూ ఏదైనా ఒక ప్రాంతంలో కనీసం 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లయితే భారీ క్రీడా సముదాయాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు వివరించారు. అథ్లెటిక్స్, ట్రాక్స్, ఇండోర్ స్టేడియం వంటివాటిని నిర్మించవచ్చునని, ఆ బాధ్యతను తాను చేపడతామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. ఇక నగర సుందరీకరణలో భాగంగా జీవీఎంసీలోని ప్రధాన పార్కులన్నీ పారిశ్రామిక సంస్థలకు అప్పగించినట్లయితే ఆయా సంస్థలు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు అప్పగించారు. అలాగే కేజీహెచ్‌లో ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలు ఇవ్వడానికి అంగీకరించిన నిధులతోనే అదనపు భవనాలు నిర్మించేలాప్రణాళిక రూపొందించుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. సీపీ అమిత్‌గార్గ్, వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావు నాయుడు, హెచ్‌పీసీఎల్ జీఎంలు జీఎస్ ప్రసాద్‌శర్మ, విఎస్ షనాయ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.మధుసూదనరావు పాల్గొన్నారు. -
సంద్రమంత విషాదం
-
సంద్రమంత విషాదం
భోగాపురం తీరంలో తేలిన చిన్నారి అదితి మృతదేహం నిశ్చేష్టురాలైన విశాఖ నగరం శోకతప్తులైన తల్లిదండ్రులు గుండెలు పిండే విషాదం.. ముద్దులొలికే చిన్నారి మురుగు నీటిలో మునిగిపోయిందన్న వార్త ఈనెల 24వ తేదీ సాయంత్రం దావానలంలా వ్యాపించింది. నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చింది. ఎలాగైనా అదితిని కాపాడాలని తపన పండింది. జీవీఎంసీ, నేవీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ కాల్వలు, గెడ్డల్లో, సముద్రంలో ఏడు రోజులపాటు తీవ్రంగా గాలించారు. రకరకాల వార్తలతో ఈ వారమంతా ఉత్కంఠతో గడిచింది. చివరకు కన్నీరే మిగిలింది. - విశాఖపట్నం/పెదవాల్తేరు చిరునవ్వుల చిన్నారి ఛిద్రమైంది.. ఆమె అందాల మోము కనుమరుగైంది.. మబ్బులు వీడిన చందమామలా మళ్లీ కనిపిస్తుందని ఆశించినవారికి కన్నీరే మిగిలింది.. మురుగు కాలువలో పడి గల్లంతైన అదితి తిరిగివస్తుందని తల్లిదండ్రులతోపాటు యావత్తు విశాఖ ఎదురుచూసింది.. ఆ చిరునవ్వు సజీవంగా ఉండాలని, మళ్లీ తిరిగొచ్చి కుటుంబ సభ్యుల కళ్లలో వెలుగు నింపాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంది.. కిడ్నాప్ అయివుంటుందని, పోలీసులు మిస్టరీని ఛేదించి, సజీవంగా తీసుకువస్తారని పెట్టుకున్న చివరి ఆశలు కూడా ఆవిరయ్యాయి.. వారం రోజులైనా జాడ తెలీకపోవడంతో నీటిపాలు కాకుండా ఎక్కడో క్షేమంగా ఉండేఉంటుందని మిణుకుమిణుకుమన్న ఆశ చీకట్లో కలిసిపోయింది.. అదితి మృతదేహం గురువారం సాయంత్రం దయనీయ స్థితిలో భోగాపురం సముద్ర తీరంలో శవమై తేలింది.. దుస్తులు, చెవిదుద్దులను బట్టి అది తమ గారా ల పట్టి అదితేననిగుర్తించి కుప్పకూలిపోయా రు.. అదితి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎంతగా కోరుకున్నారో.. నగర ప్రజలూ అంతగానే ఎదురుచూశారు. దుర్గంధభరితమైన మురికి కాల్వల్లో జీవీఎంసీ సిబ్బందితోపాటు సామాన్య జనం సైతం గాలించారు. ఫలితం దక్కలేదు. ప్రాణాలతో తీసుకురావాలన్న ఆశ నెరవేరలేదు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండివుం టే.. ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావన్న విమర్శకు జ వాబు లేదు. ఇది మాయని గాయం.. తీరని శోకం.. సముద్రమంత విషాదం సెప్టెంబర్ 24 సాయంత్రం 4 గంటలకు సీతమ్మధారలోని ఇంటి నుంచి అదితి డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్‌లోని ఐవోఎస్ ట్యూషన్ సెంటర్‌కు వెళ్లింది. నగరమంతా కుంభవృష్టి కురవడంతో వర్షం నీటితో మురుగు కాల్వలు పొంగిపొరలుతున్నాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతం లో ట్యూషన్ ముగిశాక కారెక్కబోతూ వర్షం నీటితో నిండి న డ్రైనేజీలో పడిపోయింది. జీవీఎంసీ సిబ్బంది వచ్చి గా లింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భానునగర్ నుంచి ఎంవీపీకాలనీ సెక్టార్ వరకు గెడ్డలో గాలించారు. పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, డీసీపీ త్రివిక్రమ్‌వర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సెప్టెంబర్ 25 వేకువజాము 5 గంటల నుంచి అదితి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భానునగర్ నుంచి ఇసుకతోట, ఎంవీపీకాలనీ మీదుగా లాసన్స్ బేకాలనీ వద్ద సముద్రంలో కలిసే గెడ్డ వరకు నాలుగు పొక్లయిన్లతో పూడికలు, చెత్తను తొలిగించారు. 250 మంది పారిశుధ్య, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో చిన్నారి ఆచూకీ కోసం వెదికారు. నేవీ సిబ్బంది ఒక హెలికాప్టర్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో గాలించారు. 15మంది గజ ఈతగాళ్లు గెడ్డ, సముద్రంలో వెదికారు. అదితి తాత ఫిర్యాదు మేరకు ఎంవీపీకాలనీ పోలీసులు అదితి అదృశ్యమైందని కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26 ఉదయం నుంచి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది గెడ్డలో వెతకడం ప్రారంభించారు. వందమంది వరకు భానునగర్ నుంచి లాసన్స్‌బేకాలనీ సముద్రం వరకు గాలించారు. నేవీ గజ ఈతగాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. నేవీ డైవర్లు సముద్ర గర్భం లోపలికి వెళ్లి అదితి కోసం గాలించారు. హెలికాప్టర్ పైనుంచి సముద్రంలో గాలించారు. 10 బోట్లలో మత్స్యకారులు సముద్రంలో గాలించారు. పొక్లయిన్లతో మరోసారి గెడ్డలోని రాళ్లు తీసి క్షుణ్ణంగా వెదికారు. పోలీసులు కిడ్నాప్ అనుమానంతో అదితిని తీసుకురావడానికి వెళ్లిన కారు డైవర్ గురునాథాన్ని ప్రశ్నించారు. సెప్టెంబర్ 27 అదితి అదృశ్యం మిస్టరీగా మారింది. గెడ్డ, సముద్రంలో ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అదితి సహవిద్యార్ధిని తాన్వీని పోలీసులు సమాచారం అడిగారు. అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లారా చూశానని ఆమె స్పష్టం చేసింది. ఈ రోజు కూడా యధావిధిగా గెడ్డ సముద్రంలో మత్స్యకారులు, నేవీ సిబ్బంది గాలించారు. అదితి తండ్రి శ్రీనివాస్, తాత రమణమూర్తి కిడ్నాప్ చేసుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని విచారించారు. సెప్టెంబర్ 28 అదితి ఆచూకీ కోసం గెడ్డలో నీటిని నిలిపి అన్వేషించారు. 50మంది మత్స్యకారులు పది పడవల్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో 50 కిలోమీటర్ల మేర గాలించారు. అదితి ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న మెడికల్ షాప్‌లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ట్యూషన్‌కు వెళ్తున్న దృశ్యం అందులో రికార్డయింది. మున్సిపల్ పరిపాలన పట్టాణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కరికాల్ వరినన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ అమిత్‌గార్గ్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీమ్‌ను నియమించారు. సెప్టెంబర్ 29 అదితి ఆచూకీ కోసం జీవీఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు గెడ్డ, సముద్రంలో గాలించారు. భీమిలి నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వలలతో వెదికారు. పోలీసులు మాత్రం కిడ్నాప్ కోణంలో విచారణ ప్రారంభించారు. కారు డైవర్ కాల్ డేటా, ఇతర వివరాలపై ప్రత్యేక బృందం దృష్టి సారించారు. నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదితి అదృశ్యంపై ఆరా తీశారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, తాత రమణమూర్తి సీఎంను కలిశారు. సెప్టెంబర్ 30 భీమిలి నుంచి గంగ వరం పోర్టు వరకు వంద కిలోమీటర్లమేర వెదికారు. రాత్రి 10 గంటల వరకు అదితి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపును నిలిపివేస్తున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. సాయంత్రం అదితి తండ్రి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు శత్రువులెవరూ లేరని, తమ పాప ఎక్కడో క్షేమంగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదితి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షలు బహుమతి ప్రకటించారు. అక్టోబర్ 1 అదితి మృతదేహం గురువారం సాయంత్రం భోగాపురం తీరంలో బయటపడింది. -
కాసుల వేట
ఖాళీ స్థలాలపై పోర్టు దృష్టి ఐటి, వాణిజ్య అవసరాలకు కేటాయించేందుకు ఏర్పాట్లు జీవీఎంసీ పరిధిలో 40 ఎకరాలు అభివృద్ధి కన్సల్టెన్సీలకు బాధ్యతలు విశాఖపట్నం : ఆదాయం కోసం విశాఖ పోర్టు మరో మార్గాన్ని అన్వేషించింది. ఖాళీగా ఉన్న తన స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. జీవీఎంసీ పరిధిలోని దాదాపు 40 ఎకరాల స్థలాలను ఇప్పటికే గుర్తించింది. వీటిని వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు కేటాయించాలని యోచిస్తోంది. ఈ స్థలాలద్వారా ఎలా ఎంత ఆదాయాన్ని రాబట్టవచ్చో తెలిపే బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించాలని భావి స్తోంది. కోట్లాది రూపాయల ఎగుమతి, దిగుమతుల ఆదాయం సమకూర్చుకుంటూ అంతే స్థాయిలో విస్తరణ చేపడుతున్న పోర్టు అదనపు ఆదాయం కోసం వెతుకులాటలో పడింది. పోర్టు హార్బర్ పార్క్, సాలగ్రామపురంలోని ఖాళీ స్థలాలను వాణిజ్య సముదాయాలకు అప్పగించాలని భావిస్తోంది. ఇందులో కొన్ని ప్రదేశాలను ఐటి టవర్స్‌కు ఇవ్వనుంది. ప్రస్తుతం మేజర్ పోర్టు 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. వీటితో పాటు నర్శింహనగర్ సమీపంలోని సాలగ్రామపురంలో దాదాపు 40 ఎకరాల స్థలాలు ఉన్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు ఏ విధంగా వినియోగించవచ్చునో తెలిపేం దుకు పోర్టు అధికారులు కన్సల్టెన్సీని సంప్రదిస్తున్నారు. వ్యాపార,వాణిజ్య, సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి ఈ కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనుంది. ఈ స్థలాల్లో ప్రారంభించే వ్యాపారానికి ఎంత ఖర్చవుతుంది. పెట్టుబడులు ఎంత వేగంగా వెనక్కు వస్తాయో కూడా ఆలోచించి, అలాంటి వ్యాపారం ఏది పెడితే బాగుంటుందనే సలహాను కూడా ఈ కన్సల్టెన్సీ నుంచి తీసుకోనున్నారు. నగరానికి ఈ స్థలాలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆలోచించి ఐటి టవర్స్ లేదా వాణిజ్య సముదాయాలకు కేటాయించాలనుకుంటున్నారు. దీనివల్ల ఇటు పోర్టు కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. పబ్లిక్, ప్రైవేట్ బాఘస్వామ్యం(పిపిపి) పద్థతిలో ఈ అభివృద్ధి చేపట్టనున్నట్లు పోర్టు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విశాఖ నగరంలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే అతి తక్కువ ఐటి సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల కొన్నిటికి అనుమతులు అభించినా అవి నగరానికి దూరంగా నెలకొల్పుకోవాల్సిన పరిస్థితి రావడంతో పెట్టుబడి దారులు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున ఉన్న పోర్టు స్థలాలు అందుబాటులోకి వస్తే ఐటి సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని పోర్టు భావిస్తోంది. రానున్న మూడేల్లలో భారీ విస్తరణ ప్రణాళికలు వేసిన పోర్టుకు ఆదాయం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. -
చెత్త ఇక హాట్ గురూ..!
చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్ట్‌కు కదలిక డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ కోసం జీవీఎంసీ అన్వేషణ ఆనందపురం మండలంలో 200 ఎకరాలు కేటాయింపు విశాఖపట్నం సిటీ: నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. చెత్తే కదా అని పారేసి రోజులు పోతున్నాయి. త్వరలోనే చెత్తకూ ఓ ధర పలికే అవకాశం ఉంది. ఘన, ద్రవ వ్యర్థాల కోసం ఇప్పటికే వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఇకపై ఇలాంటి చెత్తకు మరింత డిమాండ్ రాబోతుంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు విశాఖ మహా నగరంలో పట్టాలెక్కబోతోంది. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా సిగ్నల్ రావడంతో పాటు సెప్టెంబర్ మాసంలోనే సమగ్ర పథక నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో చెత్త విద్యుత్ ప్రాజెక్టుకు కదలిక వ చ్చినట్టయింది. త్వర లోనే డీపీఆర్ తయారు చేసే కన్సల్టెన్సీని నియమించాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూమిలో పాతిపెట్టే వ్యర్థాలను ఇకపై తగ్గించి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని చూస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖల్లో ఘన వ్యర్థాల నుంచి విద్యుత్తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు జపాన్, సింగపూర్‌కు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతుండడంతో ప్రభుత్వం ఆ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ మహా నగరంలో 400 మురికివాడలున్నాయి. వీటి నుంచి భారీ ఎత్తున రోజూ వెయ్యి టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తనంతా కాపులుప్పాడకు తరలిస్తున్నారు. ఇప్పుడా ప్రాంతం నుంచి చెత్తను మరో ప్రాంతానికి తరలించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కోసం కూడా ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఆనందపురం మండలం తంగుడుబిల్లి గ్రామంలో 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు జీవీఎంసీ ఆసక్తి చూపుతోంది. చెత్తతో పాటు నీరు కూడా అదే ప్రాంతానికి తరలించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. అప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. విశాఖ మహా నగరం నుంచే వెయ్యి టన్నుల చెత్త ఉత్పత్తి కానుండడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా మెరుగ్గానే ఉండే అవకాశాలుంటాయని అంటున్నారు. భీమిలి, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాలన్నీ కలుపుకుంటే మరో అయిదారొందల టన్నుల చెత్త ఉత్పత్తి కావొచ్చని అంటున్నారు. సెప్టెంబర్ మాసం తర్వాతే ఈ ప్రాజెక్టు రిపోర్టు పూర్తి స్థాయిలో రూపొందే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. -
ముందు సమ్మె ఆపితే తరువాత చూద్దాం
►జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ నేతలకు మంత్రుల సూచన ►ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న కార్మిక నేతలు ►నేడు జేఏసీ నేతల ప్రత్యేక సమావేశం ► సమ్మె విరమిస్తారో.. కొనసాగిస్తారో తేలే అవ కాశం విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ సిబ్బంది 13 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూనే మరి కొంత గడువు కావాలన్నారు. ముందుగా సమ్మె విరమిస్తే పూర్తి స్థాయిలో చర్చలు జరిపి 20 రోజుల్లో వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. బుధవారం రాజమండ్రి ఆర్అండ్బి అతిథి గృహంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మున్సిపల్ మంత్రి నారాయణ, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావుల వద్దకు విశాఖ నగర ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబులు జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.వి.వామనరావు ఇతర నేతలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రులు ముందుగా సమ్మె విరమించండి.. మీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వామనరావు జీవీఎంసీలో ఉద్యోగుల సమస్యలను మంత్రులకు ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను ఒకలా, జీవీఎంసీని ప్రత్యేకంగా చూస్తుండడం వల్ల ఉద్యోగులు అన్ని విధాలా నష్టపోతున్నారని వివరించారు. జీవీఎంసీ ఉద్యోగుల సంక్షేమంతో పాటు నగర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలతో ఈ సమ్మెకు దిగినట్టు స్పష్టం చేశారు. దీనిపై మంత్రులు మాట్లాడుతూ మీవన్నీ న్యాయమైన డిమాండ్లే.. వాటిని పరిష్కరిస్తాం.. అందుకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి... సమ్మె విరమించి విధుల్లో చేరిన 20 రోజుల్లో అందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీనిచ్చారు. అయితే దీనిపై ఆలోచించి నిర్ణయం చెబుతామని జేఏసీ ప్రతినిధులు బయటకొచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు గుర్తింపు కార్మిక సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఎం. పద్మనాభరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నుంచి కె.సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నుంచి కనకరాజు, బీఎంఎస్ నుంచి ఎల్.భాస్కర్‌రావు, హెచ్ఎంఎస్ నుంచి కె.రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు. నేడు జేఏసీ నిర్ణయం!: మంత్రులు ఇచ్చిన హామీల మేరకు గురువారం ఉదయం జేఏసీ నేతలందరూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మంత్రులు ఇచ్చిన హామీలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి తదుపరి నిర్ణయం ప్రకటించనున్నారు. అనంతరం చర్చల వివరాలు, జేఏసీ నిర్ణయాన్ని మీడియాకు తెలియజేస్తారు. సమ్మె విరమించేది, లేనిది గురువారం మధ్యాహ్నం తేలిపోనుందని జేఏసీలోని ఓ కీలక నేత స్పష్టం చేశారు. -
మాట వినకుంటే సరెండర్
జీవీఎంసీ అధికారులపై ఎమ్మెల్యేల ఒత్తిడి విశాఖపట్నం సిటీ : జీవీఎంసీలో కొందరు అధికారులను ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఆ అధికారులపై ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ వేటు వేయిస్తున్నారు. బదిలీ కాకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేసేయాలని కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. దీనికి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తలొగ్గుతుండడం గమనార్హం. జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ సీఎంఓహెచ్ డాక్టర్ ఎం.ఎస్.రాజును గుట్టు చప్పుడు కాకుండా గత వారం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థాన ంలో జోన్-4 ఏఎంఓహెచ్‌గా ఉన్న డాక్టర్ ఎం.వి.వి.మురళీమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేల మాట వినలేదనే..!: తూర్పు, దక్షిణ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఒత్తిడితోనే ఎం.ఎస్ రాజును సరెండర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజారోగ్య విభాగంలో కొన్ని పోస్టులకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కొందరి పేర్లను సిఫార్సు చేశారు. అదే విధంగా తాము చెప్పిన వారికే పారిశుధ్య కాంట్రాక్టు ఇవ్వాలని పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆ సిఫార్సులను సీఎంహెచ్ఓ ఆమోదించలేదని తెలుస్తోంది. దాంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యేలు సీఎంఓహెచ్‌ను సరెండర్ చేయాలని కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఖాళీ అయిన సీఎంఓహెచ్ పోస్టు కోసం అప్పుడే కొందరు వైద్యులు పైరవీలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో అప్పుడే హైదరాబాద్‌లో వాలిపోయారని అంటున్నారు. గతంలో పని చేసిన వైద్యాధికారులతో పాటు హైదరాబాద్ నుంచి కొందరు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరి కొందరు, మంత్రి నారాయణ సొంత జిల్లాకు చెందిన వైద్యులు కొందరు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ మురళీమోహన్‌కు సీఎంఓహెచ్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి. కానీ రాజకీయ సిఫార్సు లేకపోవడం మైనస్ కాగలదని అంచనా వేస్తున్నారు. సీఈపై కూడా వేటు..?: చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్‌కు కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన పట్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. దాంతో ఆయన్ను కూడా మార్చాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనికి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సరేనన్నట్టు తెలుస్తోంది. కాగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికారులపై వేటు వేయడంపై జీవీఎంసీలో కలకలం రేపుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే జీవీఎంసీలో పని చేసేందుకు ఓ ఒక్క అధికారి ముందుకు రారని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలు సెల్లార్లను తొలగించకుండా అడ్డుకోగలిగారు. -
మహా వ్యూహం
విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ దూకుడు 2, 3 తేదీల్లో నియోజకవర్గస్థాయి సమావేశాలు విశాఖపట్నం: మహా విశాఖ ఎన్నికల సన్నాహక ప్రక్రియను వైఎస్సార్ కాంగ్రెస్ వేగవంతం చేసింది. జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీని సర్వసన్నద్ధం చేస్తోంది. ప్రజాసమస్యలపై పోరు... ప్రజలతో మమేకం... పార్టీ సంస్థాగత బలోపేతం అనే అంశాల ప్రాతిపదికగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకోసం కార్యకర్తలను సంసిద్ధం చేసే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన పార్టీ తదుపరి కార్యాచరణ చేపట్టింది. పార్టీ ఎన్నికల పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు గతవారం నగర పార్టీ విసృ్తతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దానికి కొనసాగింపుగా మే 2, 3 తేదీల్లో నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు కొత్తగా నియమితులైన ఎన్నికల పరిశీలకులు తమ్మినేని సీతారాం, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావులు ఈ సమావేశాలను నిర్వహిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పార్టీ పటిష్టతే లక్ష్యంగా ... ఈ రెండు రోజుల సమావేశాల్లో నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. గత సమావేశంలో జీవీఎంసీ డివిజన్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ డివిజన్ అధ్యక్షులకు ఇచ్చిన ప్రొఫార్మాలను స్వీకరిస్తారు. నిర్దేశించిన సమాచారంతో ఆ ప్రొఫార్మాలను డివిజన్ అధ్యక్షులు పరిశీలకులకు సమర్పించాలి. అనంతరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, రాజకీయ బలాబాలాలు, ప్రజా సమస్యలు, ఇతరత్రా అంశాలపై ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు. మహా విశాఖ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ దిశగా కసరత్తు చేస్తారు. బూత్‌స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంపై చర్చిస్తారు. నియోజకవర్గాలవారీగా ప్రజా సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి పార్టీ జనబాహుళ్యంలోకి చొచ్చుకువెళ్లే అంశంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. తద్వారా ప్రజలతో పార్టీ నేతలు మరింతగా మమేకమవ్వాలన్నది పార్టీ లక్ష్యం. ఆ దిశగా డివిజన్ పర్యటనలు, అవసరమైతే ధర్నాలు, ఇతరత్రా రాజకీయ అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. తదుపరి దశలో ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గాల్లోనే పర్యటించి డివిజన్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తారు. అందుకు ముందుగా పార్టీ చేపట్టాల్సిన చర్యలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. పాల్గొనేవారు : సమావేశాలకు నియోజకవర్గ సమన్వయకర్త, ఆ నియోజకవర్గ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమటీలో సభ్యులు, నగర కమిటీలో సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరు కావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. సమీక్షల షెడ్యూల్ ఇదీ: జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం నియోజకవర్గస్థాయి సమావేశాల షెడ్యూల్ ఇలా ఉంది... మే 2 (శనివారం) సాయంత్రం 4గంటలు: గాజువాక సాయంత్రం 6గంటలు: విశాఖ దక్షిణం మే 3 ( ఆదివారం) ఉదయం 9.30 గంటలు: విశాఖ తూర్పు ఉదయం 11.30గంటలు: విశాఖ పశ్చిమ మధ్యాహ్నం 12.45 గంటలు: పెందుర్తి మధ్యాహ్నం 2.30గంటలు: విశాఖ ఉత్తరం సాయంత్రం 4.30గంటలు: భీమిలి -
ఆస్తి పన్ను పోటు
వడ్డీ పన్నుతో వడ్డింపు ఆస్తిపన్ను బ కాయి రూ.100 కోట్లు వడ్డీ రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఈ ఏడాది వడ్డీ మాఫీ లేనట్టే! గృహ యజమానులు గగ్గోలు గృహ యజమానులకు జీవీఎంసీ చుక్కలు చూపిస్తోంది. ఆస్తిపన్నుకు వడ్డీ కలిపి నడ్డివిరుస్తోంది. అసలెంతో.. వడ్డీ ఎంతో..ఎందుకంత ఎక్కువ మొత్తం కట్టాలో తెలియక ఇంటి యజమానులు తలపట్టుకుంటున్నారు. విశాఖపట్నం సిటీ: ఆస్తి పన్నుపై ఏటా వడ్డీ మాఫీ అయ్యేది. ఏడాదికి రెండు విడతలుగా ఇచ్చే అసెస్మెంట్ బిల్లులు మొత్తాన్ని మార్చి నెలాఖరులోగా చెల్లించేవారు. కానీ ఈసారి డిసెంబర్ నుంచే ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆధార్‌తో పాటు అసెస్మెంట్ను జారీ చేసేస్తున్నారు. అసెస్మెంట్ చూసుకున్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇంత ఎక్కువ పన్ను వచ్చిందేమిటని వాపోతున్నారు. -
‘మహా’కుదుపు
చీఫ్ ఇంజనీర్‌గా దుర్గా ప్రసాద్ బాధ్యతల స్వీకరణ మరో ముగ్గురు జోనల్ కమిషనర్లకు బదిలీ కొత్తగా ముగ్గురు జాయింట్ కమిషనర్లు రాక విశాఖపట్నం సిటీ: జీవీఎంసీలో ఉన్నపలాన జరిగిన ఉన్నతాధికారుల బదిలీ ఓ కుదుపు కుదిపింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికారులను ఒకేసారిగా కదిలించడం విస్మయపరిచింది. ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియడంతో మహా విశాఖ కార్యాలయంలో ‘బదిలీ‘ జ్వరం సోకింది. పురపాలక శాఖా మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన నుంచి 15వ తేదీన రాగానే మరింతమంది అధికారుల సీట్లు కదులుతాయనే ప్రచారం ఊపందుకుంది. చాలాకాలంగా సీట్లకు అంటిపెట్టుకున్న మహామహులకే బదిలీ కావడంతో వారిని నమ్ముకున్నవారికి ఏంచేయాలో ఇప్పుడు పాలుపోవడంలేదు. ఈ నెల 15, 16 తేదీల్లో మరికొందరికి బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రచారం జరుగుతోంది. మాతృ సంస్థలకు జోనల్ కమిషనర్లు.. {Vేటర్ పరిధిలోని కొందరు జోనల్ కమిషనర్లు మాతృ శాఖలకు వెళ్లిపోనున్నారు. ఇప్పటికే ఉత్తర్వులు సిద్ధంగా వున్నట్టు తెలిసింది. వీరి స్థానాలను మున్సిపాల్టీలకు చెందిన వారితో భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీనివల్ల ఆరుగురు జోన్లకు నలుగురు కొత్తవారొచ్చే అవకాశముంది. రెండో జోన్‌కు జోనల్ కమిషనర్ పోస్టు ఖాళీగా వుంది. అదనపు కమిషనర్ జీవీవీఎస్ మూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మూడో జోన్‌కు మున్సిపల్ స్కూల్ డ్రిల్ మాస్టర్ డాక్టర్ వై. శ్రీనివాస్‌రావు జోనల్ కమిషనర్‌గా వున్నారు. తాజా మార్పుల్లో ఆయన మళ్లీ పాఠశాల విభాగానికి వెళ్లిపోనున్నారు. అయిదో జోన్‌కు పర్యాటక శాఖకు చెందిన ఎ. శ్రీనివాస్ జోనల్కమిషనర్గా వున్నారు. ఈయన మాతృశాఖకు మారిపోవచ్చని అంటున్నారు.ఆరో జోన్‌కు సహకార రంగానికి చెందిన బి. సన్యాసినాయుడు జోనల్ కమిషనర్‌గా వున్నారు. ఈయన త్వరలో మాతృశాఖకు బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఖాళీగా వున్న మూడు జాయింట్ కమిషనర్ పోస్టులు, ఓ కార్యదర్శి పోస్టు కూడా జరగనుంది. చీఫ్ ఇంజనీర్‌గా దుర్గాప్రసాద్..! ముఖ్య ఇంజనీర్‌గా ఎన్. దుర్గాప్రసాద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ప్రజారోగ్య శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈయన గతంలో అదే శాఖలో కార్యనిర్వాహక ఇంజనీర్‌గా విశాఖలోనే సేవలందించారు. ఇప్పటి వరకూ జీవీఎంసీ ముఖ్య ఇంజనీర్‌గా పని చేసిన బి. జయరామిరెడ్డికి బదిలీ అయ్యింది. ఏడున్నరేళ్లుగా ఇదే పోస్టులో వున్న ఈయన్ను ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అలాగే తాగు నీటి విభాగ సూపరింటెండెంగ్ ఇంజనీర్ డి. మరియన్నకు గుంటూరు నగర పాలక సంస్థకు బదిలీ చేశారు. ఈయన స్థానంలో విజయవాడ మున్సిపల్ కార్పొరే షన్ నుంచి ఎస్ఈగా వున్న టి. మోజెస్‌ను నియమించింది. మోజెస్ కుమార్ గతంలో ఇక్కడే పని చేశారు. -
ఖజానా ఖాళీ
జీవీఎంసీకి హుద్‌హుద్ దెబ్బ వెంటాడుతున్న కాసుల కష్టాలు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తుపానుకు వెచ్చించిన నిధులొస్తే తప్ప తీరని వెతలు విశాఖపట్నం సిటీ: హుద్‌హుద్ తుపాను మహా నగర పాలక సంస్థ ఖజానాను ఖాళీ చేయించింది. దీంతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి మొ త్తాన్ని తుపానుకు ఖర్చు చేసింది. ఇప్పుడా నిధులు సర్కారు నుంచి వెనక్కు వచ్చినా కొంత తేరుకుంటామని సంస్థ భావిస్తోంది. తుపాను సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు, కొందరు ఐఏఎస్ అధికారులు వచ్చారు. వారి బస, రవాణా, ఆహార పానీయాల కోసం జీవీఎంసీ రూ. 7.5 కోట్లు ఖర్చు చేసింది. ఈ బిల్లుల మొత్తం రాబట్టేందుకు సర్కారు ఈ బిల్లులను పంపింది. అయితే ఇందులో రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తాజాగా ఆ ఫైల్‌ను ఆర్ధిక శాఖకు పంపింది. నెలనెలా డే అండ్ నైట్ శానిటేషన్ సిబ్బందికి రూ.4.5 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వుంది. ఈ నెల జీతాలు చెల్లించాలంటే జీవీఎంసీకి చెమటలు పడుతున్నాయి. జీవీఎంసీ అకౌంట్లో కొద్దిపాటి మొత్తమే ఉన్నట్లు భోగట్టా. బుల్డోజర్లు, క్రేన్లు, ప్రొక్లైనర్లు, ట్రాన్స్పోర్ట్ చేసే లారీలకు డీజిల్, పెట్రోల్ అవసరాలకే ఈ మొత్తం సరిపోతుంది. వీటికి చెల్లిస్తే అత్యవసర పరిస్థితి వస్తే నిధులెక్కడ నుంచి తేవాలో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. జోన్ 1, 2, 4, 5 కార్యాలయాల్లో పని చేసే కొందరు రెగ్యులర్ సిబ్బందికి మాత్రం శుక్రవారం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, శానిటేషన్, ప్రజా ఆరోగ్య సిబ్బందికి చెల్లించాల్సి వుంది. ఈ నెల 20వ తేదీ వరకూ మిగిలిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు అధికారుల కార్లు, ప్రభుత్వం ఇచ్చిన వాహనాలకు సైతం డీజిల్ లేక కదలడం లేదు. నీటి సరఫరా విభాగంలోని ఉద్యోగులకు దాదాపు రూ. 80 లక్షలు జీతాలు చెల్లించాల్సి వుంది. మలేరియా సిబ్బందికి కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తుఫాన్ సాయం కింద ప్రభుత్వం నుంచి బకాయిలొస్తే తప్ప వీరి వేతనాలకు మోక్షం కలగదు.