పనులు పూర్తి కాకుండానే చెల్లింపులా? | However, payments to complete the tasks? | Sakshi
Sakshi News home page

పనులు పూర్తి కాకుండానే చెల్లింపులా?

Published Tue, Jan 5 2016 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

However, payments to complete the tasks?

పనుల నిర్వహణలో అధికారుల వైఫల్యం
వుడా లేఅవుట్లపై అసంతృప్తి
ఆడిట్ అభ్యంతరాలపై  అందని వివరణలు
సమీక్షలో పీఏసీ చైర్మన్ భూమా ఆగ్రహం

 
విశాఖపట్నం: పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లించారని రాష్ట్ర శాసనసభ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి జిల్లా అధికారులను నిలదీశారు. పనులు, రికార్డుల నిర్వహణలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పీఏసీ నిర్వహించిన సమావేశంలో  జీవీఎంసీ, వుడా, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, గిరిజన సంక్షేమ శాఖల ఆడిట్ అభ్యంతరాలపై సమీక్షించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ 2011-12కు సంబంధించి పెండింగులో ఉన్న ఆడిట్ పేరాలు, వాల్తేర్ క్లబ్ వివాదం తదితర అంశాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. నాలుగు జీవీఎంసీ ప్రాజెక్టుల్లో సెంట్రల్ ఎక్సైజ్ రాయితీ రూపంలో కాంట్రాక్టర్లకు రూ.10.17 కోట్లు అనవసరంగా చెల్లించారన్నారు. నిబంధనల మేరకే రాయితీ ఇచ్చినట్టు అప్పటి కలెక్టర్ పేర్కొన్నారని, అలా అయితే ఆడిట్ అభ్యంతరం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. దీనిపై కాంట్రాక్టర్ కోర్టుకెళ్లడంతో రికవరీ చేయలేదని అధికారులిచ్చిన సమాధానానికి చైర్మన్ సంతృప్తి చెందలేదు.  పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు ఎలా చెల్లింపులు జరుపుతారని ప్రశ్నించారు.

గాజువాక నీటి సరఫరా పథకంలో కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.53.79 లక్షలు చెల్లించారని, దాన్ని  రికవరీ చేయలేదని ఆక్షేపించారు. కొంతమంది కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయడం, మరికొందరి నుంచి వసూలు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు ప్రాజెక్టుల్లో రూ.1.42 కోట్ల సర్వీస్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత నగరంలో 2009లో 13 వేల ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలన్నది లక్ష్యం కాగా 10,339 ఇళ్లకే ఇచ్చారని, ఈ పథకం కింద నిర్మించిన శుద్ధి కేంద్రాల నుంచి 12 ఎంఎల్‌డీకి బదులు 3.6 ఎంఎల్‌డీ శుద్ధ జలాలను మాత్రమే విక్రయించడంపై ఆరా తీశారు. 1995లో వాల్తేరు క్లబ్ ను జఫ్తు చేయాలని నాటి పీఏసీ ఆదేశించినా ఇప్పటికీ అమలుకాలేదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపులో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల సాయంతో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వివిధ కేసుల్లో న్యాయ సలహా తీసుకోకుండా కోర్టుల్లో కౌంటర్ దాఖలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, దీనిపై ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేస్తుందని చెప్పారు. రూ.452.93 కోట్లతో చేపట్టిన బీఆర్‌టీఎస్ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావలసి ఉన్నా జాప్యం జరగడం వల్ల వ్యయం పెరిగిందన్నారు. ఈ ఏడాది మార్చికి ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు సమాధానమిచ్చారు.

ఆ హోటల్‌కు అనుమతులెలా ఇచ్చారు?
అగ్నిప్రమాదాల నివారణ పరికరాలు సక్రమంగా లేని నోవోటెల్ హోటల్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని కమిటీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు అధికారులను ప్రశ్నించారు. ఏదైనా ప్రమాదం వాటిల్లితే భారీ ప్రాణనష్టం జరుగుతుందన్నారు. అనుమతించిన ప్రణాళికకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, వాటి పూర్తి వివరాలు కమిటీకి సమర్పించాలని కోరారు. సీతమ్మధార రైతుబజారు వద్ద 34 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలా అనుమతులిచ్చారని, పై అంతస్తుల్లో ఉన్న వారిని రక్షించేందుకు అధునాతన పరికరాలున్నాయో లేదో వివరాలివ్వాలని ఆదేశించారు. వీటి నిర్మాణాలు పూర్తయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు.
 
వుడా లేఅవుట్లపై ..
ప్రభుత్వ భూములను వుడా లేఅవుట్లలో కలిపి వేయడం, అటవీ భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేయడంపై మధ్యాహ్నం జరిగిన సమీక్షలో చైర్మన్ నాగిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వుడా సేకరించిన, పంపిణీ చేసిన భూమి ఎంతో చెప్పాలన్నారు. ఆశించిన స్థాయిలో రికవరీ చేయకుండా అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్‌లో అవకతవకలపై తీసుకున్న చర్యల నివేదిక, ఐటీడీఏ ఆడిట్ వివరాలు, అడ్వాన్సు చెల్లింపుల వివరాలు కమిటీకి సమర్పించాలన్నారు. 1998 నుంచి ప్రజాపద్దుల కమిటీ లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇప్పటికీ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. పెండింగు ఆడిట్ పేరాలపై రెండు వారాల్లో చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలన్నారు. విశాఖను బాధిస్తున్న కాలుష్యంపై గనులు, కాలుష్య నియంత్రణ అధికారులు ఏంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు ఏరియాలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కలెక్టర్ యువరాజ్ సమాధానమిస్తూ అన్ని వివరాలు కమిటీకి నివేదిస్తానన్నారు. విశాఖలో ఏజీఎంసీ పరిశ్రమలో తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని కమిటీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు గణబాబు, ఎ.సురేష్, పి.శమంతకమణి, ఎంవీఎస్ శర్మ, కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్‌వో చంద్రశేఖరరెడ్డి, వుడా అదనపు వీసీ రమేష్, పరిశ్రమలశాఖ జీఎం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement