చెత్త ఇక హాట్ గురూ..!
చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్ట్‌కు కదలిక
డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ కోసం జీవీఎంసీ అన్వేషణ
ఆనందపురం మండలంలో 200 ఎకరాలు కేటాయింపు
విశాఖపట్నం సిటీ: నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. చెత్తే కదా అని పారేసి రోజులు పోతున్నాయి. త్వరలోనే చెత్తకూ ఓ ధర పలికే అవకాశం ఉంది. ఘన, ద్రవ వ్యర్థాల కోసం ఇప్పటికే వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఇకపై ఇలాంటి చెత్తకు మరింత డిమాండ్ రాబోతుంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు విశాఖ మహా నగరంలో పట్టాలెక్కబోతోంది. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా సిగ్నల్ రావడంతో పాటు సెప్టెంబర్ మాసంలోనే సమగ్ర పథక నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో చెత్త విద్యుత్ ప్రాజెక్టుకు కదలిక వ చ్చినట్టయింది. త్వర లోనే డీపీఆర్ తయారు చేసే కన్సల్టెన్సీని నియమించాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూమిలో పాతిపెట్టే వ్యర్థాలను ఇకపై తగ్గించి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని చూస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖల్లో ఘన వ్యర్థాల నుంచి విద్యుత్‌తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు జపాన్, సింగపూర్‌కు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతుండడంతో ప్రభుత్వం ఆ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
విశాఖ మహా నగరంలో 400 మురికివాడలున్నాయి. వీటి నుంచి భారీ ఎత్తున రోజూ వెయ్యి టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తనంతా కాపులుప్పాడకు తరలిస్తున్నారు. ఇప్పుడా ప్రాంతం నుంచి చెత్తను మరో ప్రాంతానికి తరలించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కోసం కూడా ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఆనందపురం మండలం తంగుడుబిల్లి గ్రామంలో 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు జీవీఎంసీ ఆసక్తి చూపుతోంది. చెత్తతో పాటు నీరు కూడా అదే ప్రాంతానికి తరలించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. అప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. విశాఖ మహా నగరం నుంచే వెయ్యి టన్నుల చెత్త ఉత్పత్తి కానుండడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా మెరుగ్గానే ఉండే అవకాశాలుంటాయని అంటున్నారు. భీమిలి, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాలన్నీ కలుపుకుంటే మరో అయిదారొందల టన్నుల చెత్త ఉత్పత్తి కావొచ్చని అంటున్నారు. సెప్టెంబర్ మాసం తర్వాతే ఈ ప్రాజెక్టు రిపోర్టు పూర్తి స్థాయిలో రూపొందే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.