జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విద్యుదుత్పత్తి ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు మరింతగా జనాభా పెరిగిపోతున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వెలువడుతున్న చెత్త కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. ఈ చెత్తను డంప్ చేస్తే కాలుష్యం, మురికి, అనారోగ్య సమస్యలు. ఈ క్రమంలోనే అటు చెత్త సమస్యకు చెక్ పెట్టడం, ఇటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ప్రయోజనం పొందడం లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తోంది.
జవహర్‌నగర్‌లో తొలుత 19.8 మెగావాట్ల ఉత్పత్తితో ప్రారంభమైన రాంకీ సంస్థ (రీసస్టెయినబిలిటీగా పేరు మారింది) ప్లాంట్ సామర్ధ్యం ప్రస్తుతం 24 మెగావాట్లకు పెరిగింది. మరో 24 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది. ఈ సంస్థ మార్చి చివరినాటికి దుండిగల్‌లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రారంభించనుంది. ఇదిగాక నగర శివార్లలో ఏర్పాటు కానున్న పలు ప్లాంట్లతో రెండేళ్లలో వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి.
ఎప్పటికప్పుడు చెత్త ప్రాసెస్
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్తగుట్టలు పోగుపడవు. ఘన వ్యర్థాలు (చెత్త) ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతాయి. శివార్లలోని పలు ప్రాంతాల్లో చెత్త ట్రీట్‌మెంట్‌తోపాటు ఆ సమీపంలోనే ఉండే ప్లాంట్లతో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మున్సిపల్ కార్మికులు సేకరించే చెత్తలో విద్యుత్‌కు పనికొచ్చేది దాదాపు 50 శాతం ఉంటుంది. మిగతా చెత్తను కంపోస్టు, రీసైక్లింగ్‌తో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ వంటి వాటికి వినియోగిస్తారు. అంతిమంగా ఎందుకూ పనికిరానిదాన్ని పాతిపెడతారు. మరోవైపు చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది అంత శ్రేయస్కరం కాదని, ఖర్చు కూడా ఎక్కువని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
హైదరాబాద్ నగరంలో ఏటికేడు పెరుగుతున్న చెత్తను, తద్వారా ఉత్పత్తి చేయగల విద్యుత్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు 2018లో అంచనా వేశారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 70–100 టన్నుల చెత్త అవసరమవుతుంది. వంద మెగావాట్ల ఉత్పత్తికి దాదాపు పదివేల టన్నులు కావాలి. ప్రస్తుతం నగరంలో రోజూ 7000 టన్నుల చెత్త వెలువడుతోంది. పరిసర మున్సిపాలిటీలను కలిపితే ఇది పదివేల టన్నులకు చేరుకుంటుందని అంచనా. దీనికి తగినట్టుగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
సిటీ శివార్లలోని విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ..
►యాచారంలో శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు 12 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వ అనుమతి ఉంది. మరో 2 మెగావాట్లు పెంచి 14 మెగావాట్లకు అనుమతించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. అనుమతి వస్తే 14 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
►బీబీనగర్‌లో ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 11 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభమై చాలాకాలమైనా వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. ఇటీవల యాజమాన్య మార్పు జరగడంతో పనులు వేగంగా అవుతాయని అధికారులు చెప్తున్నారు.
►‘రీసస్టెయినబిలిటీ లిమిటెడ్’ ప్యారానగర్‌లో 15 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.
►జవహర్‌నగర్‌లో ప్రస్తుతం 24 మెగావాట్లు, అదనంగా రానున్న 24 మెగావాట్లు, దుండిగల్‌లో 14.5 మెగావాట్లతోపాటు కొత్తగా రానున్న ప్లాంట్లన్నీ కలిపితే మొత్తం 102.5 మెగావాట్లకు ‘చెత్త విద్యుత్’ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది.
మున్సిపల్ వ్యర్థాల నుంచి తక్కువే..
గత సంవత్సరం కేంద్ర మంత్రి ఆర్‌కేసింగ్ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో చిన్నవి, పెద్దవి కలిపి 249 ప్లాంట్లు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేవి 11 ప్లాంట్లే. వీటి సామర్ధ్యం 132.1 మెగావాట్లు. ఇటీవల మరికొన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఇక దేశంలోని అన్ని నగరాల్లో భారీగా చెత్త వెలువడుతున్నా.. దాన్ని విద్యుత్‌గా మార్చే ప్లాంట్లు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి.
జీరో వేస్ట్ లక్ష్యంగా..
హైదరాబాద్ నగరంలో చెత్తను వివిధ రకాలుగా వేరు చేయడంతో బయోగ్యాస్, కంపోస్టు ఎరువు వంటివాటితోపాటు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ‘జీరో వేస్ట్’ లక్ష్యంతో పనులు చేస్తున్నాం. తద్వారా చెత్త పేరుకు పోదు. చెత్త వస్తున్న చోటనే తడి–పొడిగా వేరుచేయడంలో ఇంకా కృషి జరగాల్సి ఉంది. మిగతా దశలకు సంబంధించి చాలా నగరాల కంటే మనం ముందంజలో ఉన్నాం.
– బి.సంతోష్, అడిషనల్ కమిషనర్ (పారిశుధ్యం, ఆరోగ్యం), జీహెచ్‌ఎంసీ
వ్యయమెక్కువ.. శ్రేయస్కరం కాదు..
చెత్త నుంచి విద్యుదుత్పత్తికి అధిక వ్యయం అవుతుంది. వాతావరణ కాలుష్యం సమస్య కూడా ఉంటుంది. విద్యుత్ కోసమే అయితే సోలార్ పవర్ ఖర్చు తక్కువ. చెత్త కుప్పలు కనిపించకుండా ఉండేందుకు విద్యుత్ ఉత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. దీనికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీలిస్తారు. ఇది శ్రేయస్కరం కాదు. చెత్తను ప్రాథమికంగానే వేరు చేయడం ఉత్తమ మార్గం. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ విధానమే మేలైనది. దానివల్ల ఎక్కువమందికి జీవనోపాధి లభిస్తుంది.
– ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త
Comments
Please login to add a commentAdd a comment