
మహా వ్యూహం
విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ దూకుడు
2, 3 తేదీల్లో నియోజకవర్గస్థాయి సమావేశాలు
విశాఖపట్నం: మహా విశాఖ ఎన్నికల సన్నాహక ప్రక్రియను వైఎస్సార్ కాంగ్రెస్ వేగవంతం చేసింది. జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీని సర్వసన్నద్ధం చేస్తోంది. ప్రజాసమస్యలపై పోరు... ప్రజలతో మమేకం... పార్టీ సంస్థాగత బలోపేతం అనే అంశాల ప్రాతిపదికగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకోసం కార్యకర్తలను సంసిద్ధం చేసే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన పార్టీ తదుపరి కార్యాచరణ చేపట్టింది. పార్టీ ఎన్నికల పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు గతవారం నగర పార్టీ విసృ్తతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దానికి కొనసాగింపుగా మే 2, 3 తేదీల్లో నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు కొత్తగా నియమితులైన ఎన్నికల పరిశీలకులు తమ్మినేని సీతారాం, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావులు ఈ సమావేశాలను నిర్వహిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
పార్టీ పటిష్టతే లక్ష్యంగా ...
ఈ రెండు రోజుల సమావేశాల్లో నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. గత సమావేశంలో జీవీఎంసీ డివిజన్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ డివిజన్ అధ్యక్షులకు ఇచ్చిన ప్రొఫార్మాలను స్వీకరిస్తారు. నిర్దేశించిన సమాచారంతో ఆ ప్రొఫార్మాలను డివిజన్ అధ్యక్షులు పరిశీలకులకు సమర్పించాలి. అనంతరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, రాజకీయ బలాబాలాలు, ప్రజా సమస్యలు, ఇతరత్రా అంశాలపై ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు. మహా విశాఖ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ దిశగా కసరత్తు చేస్తారు. బూత్‌స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంపై చర్చిస్తారు. నియోజకవర్గాలవారీగా ప్రజా సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి పార్టీ జనబాహుళ్యంలోకి చొచ్చుకువెళ్లే అంశంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. తద్వారా ప్రజలతో పార్టీ నేతలు మరింతగా మమేకమవ్వాలన్నది పార్టీ లక్ష్యం. ఆ దిశగా డివిజన్ పర్యటనలు, అవసరమైతే ధర్నాలు, ఇతరత్రా రాజకీయ అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. తదుపరి దశలో ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గాల్లోనే పర్యటించి డివిజన్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తారు. అందుకు ముందుగా పార్టీ చేపట్టాల్సిన చర్యలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.
పాల్గొనేవారు : సమావేశాలకు నియోజకవర్గ సమన్వయకర్త, ఆ నియోజకవర్గ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమటీలో సభ్యులు, నగర కమిటీలో సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరు కావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కోరారు.
సమీక్షల షెడ్యూల్ ఇదీ: జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం నియోజకవర్గస్థాయి సమావేశాల షెడ్యూల్ ఇలా ఉంది...
మే 2 (శనివారం)
సాయంత్రం 4గంటలు: గాజువాక
సాయంత్రం 6గంటలు: విశాఖ దక్షిణం
మే 3 ( ఆదివారం)
ఉదయం 9.30 గంటలు: విశాఖ తూర్పు
ఉదయం 11.30గంటలు: విశాఖ పశ్చిమ
మధ్యాహ్నం 12.45 గంటలు: పెందుర్తి
మధ్యాహ్నం 2.30గంటలు: విశాఖ ఉత్తరం
సాయంత్రం 4.30గంటలు: భీమిలి