►జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ నేతలకు మంత్రుల సూచన
►ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న కార్మిక నేతలు
►నేడు జేఏసీ నేతల ప్రత్యేక సమావేశం
► సమ్మె విరమిస్తారో.. కొనసాగిస్తారో తేలే అవ కాశం
విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ సిబ్బంది 13 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూనే మరి కొంత గడువు కావాలన్నారు. ముందుగా సమ్మె విరమిస్తే పూర్తి స్థాయిలో చర్చలు జరిపి 20 రోజుల్లో వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. బుధవారం రాజమండ్రి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మున్సిపల్ మంత్రి నారాయణ, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావుల వద్దకు విశాఖ నగర ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబులు జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.వి.వామనరావు ఇతర నేతలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రులు ముందుగా సమ్మె విరమించండి.. మీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వామనరావు జీవీఎంసీలో ఉద్యోగుల సమస్యలను మంత్రులకు ఏకరువు పెట్టారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను ఒకలా, జీవీఎంసీని ప్రత్యేకంగా చూస్తుండడం వల్ల ఉద్యోగులు అన్ని విధాలా నష్టపోతున్నారని వివరించారు. జీవీఎంసీ ఉద్యోగుల సంక్షేమంతో పాటు నగర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలతో ఈ సమ్మెకు దిగినట్టు స్పష్టం చేశారు. దీనిపై మంత్రులు మాట్లాడుతూ మీవన్నీ న్యాయమైన డిమాండ్లే.. వాటిని పరిష్కరిస్తాం.. అందుకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి... సమ్మె విరమించి విధుల్లో చేరిన 20 రోజుల్లో అందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీనిచ్చారు. అయితే దీనిపై ఆలోచించి నిర్ణయం చెబుతామని జేఏసీ ప్రతినిధులు బయటకొచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు గుర్తింపు కార్మిక సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఎం. పద్మనాభరాజు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నుంచి కె.సత్యనారాయణ, ఐఎన్‌టీయూసీ నుంచి కనకరాజు, బీఎంఎస్ నుంచి ఎల్.భాస్కర్‌రావు, హెచ్‌ఎంఎస్ నుంచి కె.రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు.
నేడు జేఏసీ నిర్ణయం!: మంత్రులు ఇచ్చిన హామీల మేరకు గురువారం ఉదయం జేఏసీ నేతలందరూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మంత్రులు ఇచ్చిన హామీలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి తదుపరి నిర్ణయం ప్రకటించనున్నారు. అనంతరం చర్చల వివరాలు, జేఏసీ నిర్ణయాన్ని మీడియాకు తెలియజేస్తారు. సమ్మె విరమించేది, లేనిది గురువారం మధ్యాహ్నం తేలిపోనుందని జేఏసీలోని ఓ కీలక నేత స్పష్టం చేశారు.
ముందు సమ్మె ఆపితే తరువాత చూద్దాం
Published Wed, Jul 22 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement
Advertisement