సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచా యి. కార్పొరేషన్ పీఠంపై గురిపెట్టిన అన్ని పార్టీలు తమ సత్తా చూపేందుకు పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. సిట్టింగ్ మేయర్ పీఠాన్ని మళ్లీ దక్కించుకునే దిశగా ఆ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరాభవం నిరాశకు గురి చేసినా.. ఈ గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు బీజేపీ కేడర్‌ను సన్నద్ధం చే స్తోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి కార్పొరేటర్లుగా పోటీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సీపీఐ, సీపీఎంతో కలిసి బల్దియా బరిలోకి దిగే ఆలోచనలో ఉంది.
‘మేయర్’పై వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్
పునర్విభజనలో భాగంగా పెరిగిన డివిజన్లు, మారి న రిజర్వేషన్లు అధికార పార్టీ నాయకుల్లో పలువురి ఆశలను గల్లంతు చేశాయి. మేయర్ పీఠంపై గురి పెట్టిన పలువురిని అసంతృప్తి వెంటాడుతుండగా, సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అస్త్రం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పలు కోణాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించడం ఆశావహులను కలవరపెడుతోంది. సిట్టింగ్ అభ్యర్థుల్లో ఎవరికి అవకాశం దక్కుతుంది.. మరెవరికి చేజారుతుందనే అంచనాలకు కూడా రాలేకపోతున్నారు. ఓవైపు ప్రభుత్వం ఇంటలిజెన్స్, మరోవైపు పార్టీ బృందాలు చేస్తున్న సర్వేలు తమకు ప్రతిబంధకంగా మారుతుందనే అనుమానం వారిని వెంటాడుతోంది.
ఇదే సమయంలో రియల్ ఎస్టేట్, లిక్కర్ దందాల్లో రూ.కోట్లు కూడబెట్టుకున్న వారు, కొత్త ముఖాలు తెరపైకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కాగా, జీహెచ్‌ఎంసీ తరహాలో గ్రేటర్ వరంగల్‌లో సత్తా చాటడంపై బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికల ఇన్‌చార్జ్ జితేందర్ రెడ్డి వరంగల్‌లోనే మకాం వేయగా, పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి తదితరులు పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను పిలిపించి శుక్రవారం ఎన్నికల శంఖారావం సభ ఏర్పాటుచేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలు రాకున్నా, ఉత్సాహంగా ఉన్న యువతకు కార్పొరేటర్లుగా ఎక్కువ అవకాశాలు కల్పించాలనే యోచనలో ఉంది.
పొత్తు పొడుస్తుందా..
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికతో పాటు గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచి కమి టీలు ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితర అగ్రనేతలు ప్రచారం చేసినా వరంగల్‌పై ప్రభావం చూపలేదు. కాగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు 66 కొత్త డివిజన్ల కమిటీలు వేసే పనిలో నిమగ్నమైన సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయడమా లేదా పొత్తులతో బరిలో నిలవడమా అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి ఇతర నాయకులతో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి రెండు రోజులుగా చర్చలు జరిపారు. ఇదే విషయమై మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్ తదితర పార్టీ సీనియర్లతో డీసీసీ భవన్‌లో రాజేందర్‌రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో సీపీఐ 11, సీపీఎం 12 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించగా, రెండు పార్టీ లకు కలిపి 20 స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ మూడు పార్టీల పొత్తులపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అభ్యర్థుల ఎంపికపై వేచిచేసే ధోరణి
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడింది. ఈ మేరకు నామినేషన్ల దాఖలకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంటే మూడు రోజుల సమయమే ఇచ్చారు. దీంతో పలువురు ఆశావహులు తొలిరోజైన శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కానీ అటు అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల జాబితాలు వెల్లడి కాలేదు. దీంతో శనివారం జాబితాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయాలని సూచిస్తారా, లేక చివరి రోజైన ఆదివారమే అభ్యర్థుల జాబితా విడుదలవుతుందా అనే విషయంలో స్పష్టత రావడం లేదు.
టీఆర్‌ఎస్ పార్టీ ఆశావహులు సంఖ్య భారీగా ఉండడంతో ముందుగా జాబితా విడుదల చేస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనలో అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం. దీంతో శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయమే అభ్యర్థుల జాబితా వెల్లడించి ఆ వెంటనే నామినేషన్లు దాఖలు చేయించవచ్చని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా తొలుత టీఆర్‌ఎస్ జాబితా విడుదలైతే ఆ పార్టీ అసంతృప్తుల్లో బలంగా ఉన్న వారికి గాలం వేయొచ్చనే ఆలోచనతో వేచిచూసే ధోరణి వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం.
చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ
Comments
Please login to add a commentAdd a comment