warangal municipal corporation election
-
రేవంత్‌రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్
సాక్షి, వరంగల్: వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయల టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆరు నెలల్లో టెక్స్టైల్ పార్క్ ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. కాగా వరంగల్ నగర అభివృద్ధిపై టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పనులను ప్రారంభించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని ఇప్పటికే కేటాయించామని కానీ కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం లేదని అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతర పోరాటం చేస్తామని అన్నారు. -
నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో బీ ఫారాలు జారీ చేసింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొనగా, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు మిగతా ఐదు మున్సిపాలిటీల్లో గురువారం మధ్యాహ్నమే అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకే ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శుక్రవారం నుంచి క్ష్రేతస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ భావిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్లో నేతలు, అభ్యర్థులను కలిసేందుకు ఓటర్లు విముఖత చూపుతుండటంతో ప్రతీ ఓటరును చేరుకునేందుకు కార్యకర్తల యంత్రాంగంపైనే ఆధారపడి ప్రచారం చేయాలని యోచిస్తోంది. చివరి నిమిషంలో వచ్చిన వారికి కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకుని ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. సుదర్శన్‌గౌడ్‌తో పాటు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఆయన అనుచరులు ఒకరిద్దరికి టీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ టికెట్ దక్కింది. జడ్చర్ల మున్సిపాలిటీలో బీజేవైఎం మహబూబ్‌నగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రామ్మోహన్ భార్య సారికకు చివరి నిమిషంలో టీఆర్ఎస్ బీ ఫారం దక్కగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శోభ పోటీ నుంచి వైదొలిగారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి ధనలక్ష్మి ఏకంగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు కలిసిరాకపోవడం, పనితీరుపై వ్యతిరేకత వంటి కారణాలతో చాలాచోట్ల సిట్టింగ్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కలేదు. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో వివిధ పార్టీల తరపున, స్వతంత్రులుగా గెలిచి తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్‌లకు మళ్లీ టీఆర్ఎస్ తరపున అవకాశం దక్కింది. అసంతృప్తులకు బుజ్జగింపులు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ నామినేషన్ దాఖ లు చేసినా అవకాశం దక్కని క్షేత్రస్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సర్వశక్తులూ ఒడ్డారు. పార్టీ టికెట్ ఆశిస్తూ లేదా స్వతంత్రులుగా నామినేషన్ వేసిన అభ్యర్థులను డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ గుర్తించింది. పార్టీ తరపున గెలుపు గుర్రాలు మాత్రమే బరిలో ఉండాలనే ఉద్దేశంతో అవకాశం దక్కని ఆశావహులు, బలమైన స్వతంత్రులను పోటీ నుంచి తప్పించేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. దీనికోసం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వారితో పాటు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన వారిని గుర్తించి అవకాశమిచ్చింది. అక్కడక్కడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. సామాజిక న్యాయం, ఉద్యమకారులు, సీనియారిటీ తదితరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. -
మంత్రి ఈటలకు ఏమైంది? మరోసారి ‘అసంతృప్తి’ వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: కొంతకాలంగా నర్మగర్భ వ్యాఖ్యలతో ఈటెలు సంధిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలోనూ అలాగే మాట్లాడారు. రాజకీయాలపై, నాయకులపై ప్రజలకు రాను రాను నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రజలకు అపారమైన విశ్వాసం ఉండేదని, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసునని, చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హన్మకొండ భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. బీజేపీ మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది ‘టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నోట్లో నాలికగా ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఉంది.. అది సోషల్ మీడియాలో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో రాజకీయాలు, నాయకులు అంటే సమాజంలో ఒక గొప్ప గౌరవం, విలువలు, విశ్వాసం ఉండేవి. కానీ రానురాను నాయకుల మీద, రాజకీయాల మీద ఎట్లాంటి భావన వస్తుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మంచి సంప్రదాయమైతే కాదు. తాత్కాలికమైన విజయాల కోసం, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం సంప్రదాయాలను, మర్యాదలను, గౌరవాలను ఫణంగా పెట్టే పరిస్థితి రావద్దని కడియం శ్రీహరి గారి లాంటి వాళ్లు ఎక్కువగా కోరుకుంటారు. నాలాంటి వాళ్లు కూడా ఇవ్వాల అదే కోరుకుంటున్నారు’ అని ఈటల అన్నారు. పెరుగుట విరుగుట కోసమే.. ‘వాస్తవానికి రాజకీయ నాయకులెప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం పని జేసే వాళ్లు తప్ప, ఇబ్బంది పెట్టడం కోసమో, సొంత ప్రయోజనాల కోసమో ఆశించేవాళ్లు కాదు. కానీ అట్లా చిత్రీకరించేటటువంటి పరిస్థితి వచ్చింది. మానవ సంబంధాల్లోనే కాకుండా, రాజకీయ నాయకులు.. ప్రజల మధ్య ఉండే సంబంధాల్లో చోటుచేసుకుంటున్న బాధాకరమైన సన్నివేశాల్ని ఇవ్వాళ మనం చూస్తున్నం. కాబట్టి ఏదో ఒకనాడు పెరుగుట విరుగుట కోసమే అన్నట్టుగా ఇట్లాటివన్నీ పెరుగుతయ్.. మళ్లీ ఎక్కడో తప్పకుండా విరుగుతయ్ అనే నమ్మకం నాకుంది. అంతిమంగా రాజకీయాలు, రాజకీయ నాయకుల పట్ల గౌరవం ఇనుమడింపజేసేలా ప్రజలను మనం డ్రైవ్ చేయాలి..’ అని మంత్రి పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోని ఆనేక రంగాల్లో ఏ రాష్ట్రం కూడా పోటీపడని విధంగా, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఫలితాలు కనిపిస్తున్నాయని ఈటల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ చరిత్రకెక్కాయని అన్నారు. మాటలు చెబుతూ, కాలం గడిపితే ప్రజలు ఆదరించరని, గతమేందో, ఇవ్వాలేందో తర్కించుకుని, బేరీజు వేసుకుని ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారేవాడే రాజకీయ నాయకుడని, అదే తరహాలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నడుస్తున్నారని అన్నారు. చదవండి: బ్లాక్‌లో వ్యాక్సిన్ దందా.. రూ.800 మందు రూ.14 వేలకు చదవండి: మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం -
గ్రేటర్ ఎన్నికలు: వ్యూహాత్మకంగా టీఆర్ఎస్
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచా యి. కార్పొరేషన్ పీఠంపై గురిపెట్టిన అన్ని పార్టీలు తమ సత్తా చూపేందుకు పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. సిట్టింగ్ మేయర్ పీఠాన్ని మళ్లీ దక్కించుకునే దిశగా ఆ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరాభవం నిరాశకు గురి చేసినా.. ఈ గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు బీజేపీ కేడర్‌ను సన్నద్ధం చే స్తోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి కార్పొరేటర్లుగా పోటీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సీపీఐ, సీపీఎంతో కలిసి బల్దియా బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ‘మేయర్’పై వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పునర్విభజనలో భాగంగా పెరిగిన డివిజన్లు, మారి న రిజర్వేషన్లు అధికార పార్టీ నాయకుల్లో పలువురి ఆశలను గల్లంతు చేశాయి. మేయర్ పీఠంపై గురి పెట్టిన పలువురిని అసంతృప్తి వెంటాడుతుండగా, సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అస్త్రం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పలు కోణాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించడం ఆశావహులను కలవరపెడుతోంది. సిట్టింగ్ అభ్యర్థుల్లో ఎవరికి అవకాశం దక్కుతుంది.. మరెవరికి చేజారుతుందనే అంచనాలకు కూడా రాలేకపోతున్నారు. ఓవైపు ప్రభుత్వం ఇంటలిజెన్స్, మరోవైపు పార్టీ బృందాలు చేస్తున్న సర్వేలు తమకు ప్రతిబంధకంగా మారుతుందనే అనుమానం వారిని వెంటాడుతోంది. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్, లిక్కర్ దందాల్లో రూ.కోట్లు కూడబెట్టుకున్న వారు, కొత్త ముఖాలు తెరపైకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కాగా, జీహెచ్ఎంసీ తరహాలో గ్రేటర్ వరంగల్‌లో సత్తా చాటడంపై బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికల ఇన్చార్జ్ జితేందర్ రెడ్డి వరంగల్‌లోనే మకాం వేయగా, పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి తదితరులు పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను పిలిపించి శుక్రవారం ఎన్నికల శంఖారావం సభ ఏర్పాటుచేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలు రాకున్నా, ఉత్సాహంగా ఉన్న యువతకు కార్పొరేటర్లుగా ఎక్కువ అవకాశాలు కల్పించాలనే యోచనలో ఉంది. పొత్తు పొడుస్తుందా.. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికతో పాటు గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచి కమి టీలు ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితర అగ్రనేతలు ప్రచారం చేసినా వరంగల్‌పై ప్రభావం చూపలేదు. కాగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు 66 కొత్త డివిజన్ల కమిటీలు వేసే పనిలో నిమగ్నమైన సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయడమా లేదా పొత్తులతో బరిలో నిలవడమా అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి ఇతర నాయకులతో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి రెండు రోజులుగా చర్చలు జరిపారు. ఇదే విషయమై మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్ తదితర పార్టీ సీనియర్లతో డీసీసీ భవన్లో రాజేందర్‌రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో సీపీఐ 11, సీపీఎం 12 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించగా, రెండు పార్టీ లకు కలిపి 20 స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ మూడు పార్టీల పొత్తులపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై వేచిచేసే ధోరణి గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడింది. ఈ మేరకు నామినేషన్ల దాఖలకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంటే మూడు రోజుల సమయమే ఇచ్చారు. దీంతో పలువురు ఆశావహులు తొలిరోజైన శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కానీ అటు అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల జాబితాలు వెల్లడి కాలేదు. దీంతో శనివారం జాబితాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయాలని సూచిస్తారా, లేక చివరి రోజైన ఆదివారమే అభ్యర్థుల జాబితా విడుదలవుతుందా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆశావహులు సంఖ్య భారీగా ఉండడంతో ముందుగా జాబితా విడుదల చేస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనలో అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం. దీంతో శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయమే అభ్యర్థుల జాబితా వెల్లడించి ఆ వెంటనే నామినేషన్లు దాఖలు చేయించవచ్చని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా తొలుత టీఆర్ఎస్ జాబితా విడుదలైతే ఆ పార్టీ అసంతృప్తుల్లో బలంగా ఉన్న వారికి గాలం వేయొచ్చనే ఆలోచనతో వేచిచూసే ధోరణి వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం. చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ -
'ఆ మూడు చోట్ల' కొనసాగుతున్న పోలింగ్
హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. సదరు ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లు, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లో 50 డివిజన్లు, అచ్చంపేటలో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్‌లో మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6, 43,862 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అచ్చంపేటలో పంచాయతీ ఎన్నికల కోసం 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 18614 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం పది గంటల వరకు అచ్చంపేటలో 19 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. వరంగల్‌లో ఉదయం 11.00 గంటల వరకు 18.5 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు నేటి సాయంత్రం 5.00 గంటలకు ముగియనున్నాయి.