నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే | Telangana Municipal Corporation Elections: Nominations End | Sakshi
Sakshi News home page

నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే

Published Fri, Apr 23 2021 4:14 AM | Last Updated on Fri, Apr 23 2021 7:35 PM

Telangana Municipal Corporation Elections: Nominations End - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో బీ ఫారాలు జారీ చేసింది. వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొనగా, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు మిగతా ఐదు మున్సిపాలిటీల్లో గురువారం మధ్యాహ్నమే అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

ఈ నెల 30న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకే ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శుక్రవారం నుంచి క్ష్రేతస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ భావిస్తోంది. కోవిడ్‌ పరిస్థితుల్లో నేతలు, అభ్యర్థులను కలిసేందుకు ఓటర్లు విముఖత చూపుతుండటంతో ప్రతీ ఓటరును చేరుకునేందుకు కార్యకర్తల యంత్రాంగంపైనే ఆధారపడి ప్రచారం చేయాలని యోచిస్తోంది.

చివరి నిమిషంలో వచ్చిన వారికి
కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఆయన భార్యకు టికెట్‌ ఇచ్చారు. సుదర్శన్‌గౌడ్‌తో పాటు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఆయన అనుచరులు ఒకరిద్దరికి టీఆర్‌ఎస్‌ తరపున కౌన్సిలర్‌ టికెట్‌ దక్కింది. జడ్చర్ల మున్సిపాలిటీలో బీజేవైఎం మహబూబ్‌నగర్‌ జిల్లా మాజీ అధ్యక్షులు రామ్మోహన్‌ భార్య సారికకు చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌ బీ ఫారం దక్కగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శోభ పోటీ నుంచి వైదొలిగారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 10వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి ధనలక్ష్మి ఏకంగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు కలిసిరాకపోవడం, పనితీరుపై వ్యతిరేకత వంటి కారణాలతో చాలాచోట్ల సిట్టింగ్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం దక్కలేదు. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో వివిధ పార్టీల తరపున, స్వతంత్రులుగా గెలిచి తర్వాతి కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సిట్టింగ్‌లకు మళ్లీ టీఆర్‌ఎస్‌ తరపున అవకాశం దక్కింది.


అసంతృప్తులకు బుజ్జగింపులు
టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తూ నామినేషన్‌ దాఖ లు చేసినా అవకాశం దక్కని క్షేత్రస్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సర్వశక్తులూ ఒడ్డారు. పార్టీ టికెట్‌ ఆశిస్తూ లేదా స్వతంత్రులుగా నామినేషన్‌ వేసిన అభ్యర్థులను డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్‌ఎస్‌ గుర్తించింది. పార్టీ తరపున గెలుపు గుర్రాలు మాత్రమే బరిలో ఉండాలనే ఉద్దేశంతో అవకాశం దక్కని ఆశావహులు, బలమైన స్వతంత్రులను పోటీ నుంచి తప్పించేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. దీనికోసం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వారితో పాటు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన వారిని గుర్తించి అవకాశమిచ్చింది. అక్కడక్కడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. సామాజిక న్యాయం, ఉద్యమకారులు, సీనియారిటీ తదితరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement