తమిళ చిత్రం ‘పార్కింగ్’కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ లైబ్రరీలో ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్‌ప్లేకు చోటు దక్కింది. హరీష్ కల్యాణ్, ఎమ్‌ఎస్ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘పార్కింగ్’. రామ్‌కుమార్ బాలకృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, సుధన్ సుందరం–కేఎస్ సినీష్ నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, మంచి విజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు కూడా పొందింది.
తాజాగా ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్‌ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో శాశ్వతంగా చోటు కల్పిస్తున్నామని ఆస్కార్ మేనేజింగ్ లైబ్రేరియన్ ఫిలిఫ్ గార్సియా నుంచి ఇ–మెయిల్ వచ్చిందని చిత్రనిర్మాత కేఎస్ సినీష్ సోషల్ మీడియాలో పేర్కొని, ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకే ఇంట్లో అద్దెకు ఉండే ఐటీ ఉద్యోగి ఈశ్వర్, ప్రభుత్వోద్యోగి ఎస్. ఇళంపరుతి పార్కింగ్ విషయంలో ఈగోలకు పోయి ఒకరికి ఒకరు ఎలా హాని చేసుకున్నారు? ఆ తర్వాత తమ తప్పులను ఎలా తెలుసుకున్నారు? అనే అంశాల నేపథ్యంతో ‘పార్కింగ్’ కథ సాగుతుంది.
రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ తమిళ ‘పార్కింగ్’ సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఓ విదేశీ భాషలోనూ రీమేక్ చేయడానికి చిత్ర దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment