దటీజ్ కార్పొరేషన్! | Datij Corporation! | Sakshi
Sakshi News home page

దటీజ్ కార్పొరేషన్!

Published Tue, Jan 6 2015 1:52 AM | Last Updated on Sat, Sep 15 2018 6:06 PM

దటీజ్ కార్పొరేషన్! - Sakshi

దటీజ్ కార్పొరేషన్!

నెల్లూరు(విద్య) : విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య ఉండేలా చూడాల్సిన కార్పొరేషన్ అధికారులు అనాలోచితంగా వ్యవహరించారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవసరమైన చోట కాకుండా అవసరం లేని చోట వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరిట డిప్యుటేషన్ వేశారని విమర్శలొస్తున్నాయి. ఇటీవల కార్పొరేషన్ స్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు మంత్రి నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

హైస్కూల్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్లు, డిప్యుటేషన్లపై తక్షణమే భర్తీచేయాలని ఆదేశాలిచ్చారు. అయితే కార్పొరేషన్‌లో విద్యాశాఖ చూసే అధికారులు జాబితాను రూపొందించారు. అయితే వారి అవగాహన రాహిత్యంతో జాబితాలో పలుపొరపాట్లు జరిగాయి. తప్పులు తడకగా ఉన్న జాబితాను కార్పొరేషన్ అధికారులు అలానే విడుదల చేయడంతో అనవసరమైన చోట్లకు టీచర్ల డిప్యుటేషన్లు జరిగిపోయాయి.

15 ఉన్నత పాఠశాలల్లో 6,913 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం సరాసరిన ప్రతి 30 మంది విద్యార్థులకు కనీసం ఒక్క టీచర్ ఉండేలా చూడాల్సి ఉంది. అయితే హైస్కూల్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టును గుర్తించి వారిని డిప్యుటేషన్‌పై పంపాల్సిన కార్పొరేషన్ అధికారులు ఆ పనిచేయకుండా ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేశారు. మేనేజర్, కోఆర్డినేటర్‌ల సమన్వయలోపం, అనుభవరాహిత్యం కలిసి కమిషనర్‌ను సైతం తప్పుదోవ పట్టించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పుల తడక....
నగరంలోని ఎంజీనగర్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు సోషల్ టీచర్లు ఉండగా, మరో టీచర్‌ను డిప్యుటేషన్‌పై వేశారు. దీంతో అక్కడ నలుగురు టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఈ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ అవసరమైంది.

వెంకటేశ్వరపురంలో 698 మంది విద్యార్థులు ఉంటే ఒకే ఒక సోషల్ టీచర్ ఉన్నారు.
ఆర్‌ఎస్‌ఆర్ హైస్కూల్‌లో 493 మంది విద్యార్థులకు ఒక సోషల్ టీచరే ఉంది.

బీవీఎస్  హైస్కూల్‌లో 444 మందికి ఒక సోషల్ టీచరే... ఇలా వెంకటేశ్వరపురం కార్పొరేషన్ పాఠశాలలో 698 మంది విద్యార్థులకు ఒక సోషల్ టీచర్ ఉండగా, ఎంజీనగర్ హైస్కూల్ 214 మందికే నలుగురు సోషల్ ఉపాధ్యాయులు ఉన్నారు.

మూలాపేట రామయ్యబడిలో 185 మంది విద్యార్థులకు హిందీ టీచర్ ఒక్కరే. ఆ టీచర్‌ను ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేశారు. ఉపాధ్యాయులు అవసరంలేని ఆ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ఇద్దరు టీచర్లను డిప్యుటేషన్‌పై పంపారు. ఇవి కార్పొరేషన్‌లో తప్పులతడకగా రూపొందించిన డిప్యుటేషన్ల జాబితాకు కొన్ని ఉదాహరణలు.
 
హైస్కూల్‌లో ఖాళీలు...
తెలుగు-2, లెక్కలు-4, ఫిజిక్స్-3, సోషల్-5, బయాలజీ-3 ఖాళీలు ఉన్నాయి. ప్రమోషన్లకు అర్హులైన వారు ఒక్కో సబ్జెక్టులో 3 నుంచి 5 మంది టీచర్లు ఉన్నారు. ఈ మొత్తం 18 ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తే డిప్యుటేషన్లు అవసరం లేదు. ఇలాకాకుండా డిప్యుటేషన్ల పేరుతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను హైస్కూళ్లకు పంపడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉండదని విద్యావేత్తల అభిప్రాయం.

వందల సంఖ్యలో విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై హైస్కూల్‌కు పంపడంవల్ల ఆయా పాఠశాలలు రాబోయే రోజుల్లో నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు.

కార్పొరేషన్ పరిధిలోని 50 ప్రాథమిక పాఠశాలల్లో 5,169 మంది విద్యార్థులు ఉండగా 204 మంది టీచర్లకుగాను 165 మందే పనిచేస్తున్నారు. తాజాగా వెలువడిన డీఎస్సీ ద్వారా 37 తెలుగు ఎస్‌జీటీలు, 7 ఉర్దూ ఎస్‌జీటీలను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మిగిలిన పోస్టులకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించుకుంటే అసలు సమస్యే ఉండదని టీచర్ల అభిప్రాయం. అలాకాకుండా ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా హైస్కూల్‌లో క్షేత్రస్థాయిలో ఏయే సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని తెలుసుకొని ఆయా సబ్జెక్టులకు టీచర్లను నియమిస్తే బాగుం టుందనే వారి అభిప్రాయం. ఇప్పటికే ఈ సమస్యను గుర్తించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కేఎన్‌ఆర్ పాఠశాలను దత్తత తీసుకున్నారు. 10 మంది విద్యావలంటీర్లను సొంత నిధులతో ఏర్పాటు చేశారు.

సిటీ పరిధిలో సిటీ ఎమ్మెల్యే 10 హైస్కూళ్లకు 20 మంది విద్యావలంటీర్లను సొంత నిధులతోఏర్పాటు చేశారు. ఇలా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ పాఠశాలలపై శ్రద్ధ తీసుకుంటుంటే.. కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేషన్ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement