
ఇంద్రకీలాద్రికి మరో సొరంగం
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిలో మరో సొరంగం తవ్వనున్నారు. ఇప్పటికే చిట్టినగర్‌లో ఒక సొరంగ మార్గం ఉండగా, తాజాగా నగరం నుంచి కుమ్మరిపాలెం మీదుగా తుళ్లూరుకు మెట్రోరైలు మార్గం వేసేందుకు ఇంద్రకీలాద్రిని తవ్వి సరికొత్త సొరంగం ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సొరంగానికి సమాంతరంగానే ఈ కొత్త సొరంగం తవ్వే అవకాశాలు ఉన్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టు ఫేజ్-2లో ఈ పనులు ప్రారంభిస్తారని తెలిసింది.
తొలుత నగరంలోని బందరురోడ్డు, ఏలూరురోడ్డులోనే మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టారు. ఇదే తరహాలో ఇంద్రకీలాద్రి వద్ద జాతీయ రహదారిపై మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టాలని అధికారులు భావించారు. అయితే, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల మెట్రో ప్రాజెక్టు సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్లే సొరంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అయితే, ఇంద్రకీలాద్రిపై అనేకమంది పేద, మధ్య తరగతి కుటుంబాలు జీవిస్తున్నందున వారికి ఎక్కువ నష్టం కలగకుండా కొండకు ఇటువైపు నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు మెట్రోరైలు వెళ్లేందుకు వీలుగా సొరంగం తవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ నుంచి భవానీపురం, ఇబ్రహీంపట్నం, చెవిటికల్లు.. అక్కడి నుంచి కృష్ణానది మీదుగా అమరావతి, తుళ్లూరును కలుపుతూ ఫేజ్-2లో ఈ మెట్రోరైలు మార్గాన్ని వేస్తారు.
ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్
విజయవాడ, గంగూరు, గుణదలలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్ల నుంచి మెట్రోరైలుకు కావాల్సిన విద్యుత్‌ను తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు తమను సంప్రదించారని ఏపీ ట్రాన్స్‌కో అధికారులు చెప్పారు. రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ వద్ద, పెనమలూరు, గుణదల కాల్వగట్లపైన మెట్రో ట్రాక్షన్ సబ్‌స్టేషన్లు నిర్మిస్తారు. ఏపీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ల నుంచి మెట్రో ట్రాక్షన్ సబ్‌స్టేషన్లకు విద్యుత్ కనెక్షన్లు తీసుకుని అక్కడి నుంచి రైలు నడపడానికి ఉపయోగించుకుంటారు.
అండర్ గ్రౌండ్ కేబుల్
రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ పక్కనే మెట్రో ట్రాక్షన్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు స్థలం లభించింది. పెనమలూరులోనూ, గుణదల కాల్వ గట్లపైనా ఈ ట్రాక్షన్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్లకు ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన గంగూరు, గుణదల సబ్‌స్టేషన్‌కు దూరం చాలా ఉండటంతో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలని మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. దీనికోసం ట్రాన్స్‌కో అధికారులు సలహా, అనుమతులు అడిగినట్లు తెలిసింది.
భవానీపురంలో మరో సబ్‌స్టేషన్
మెట్రోరైలు ప్రాజెక్టు ఫేజ్-2లో సొరంగం వేసి కుమ్మరిపాలెం సెంటర్, భవానీపురం, ఇబ్రహీంపట్నం మీదుగా రాజధానికి రైలు మార్గం వేస్తే.. ఆయా మార్గాల్లోనూ విద్యుత్‌ను ఏపీ ట్రాన్స్‌కో అందించాల్సి ఉంటుంది. దీంతోపాటు భవానీపురం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలను తీర్చాలనే ఉద్దేశంలో ట్రాన్స్‌కో అధికారులు భవానీపురంలో మరో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించారు.