అయ్యోర్ల పదోన్నతుల్లో అక్రమాలు | promotions irregularities | Sakshi
Sakshi News home page

అయ్యోర్ల పదోన్నతుల్లో అక్రమాలు

Published Thu, Jan 30 2014 2:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

promotions irregularities

సాక్షి, నెల్లూరు: నగరపాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలకు అంతేలేదు. అందినకాడికి దండుకుని అధికారులు ఇష్టారాజ్యంగా పదోన్నతులు కల్పించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలను సైతం కార్పొరేషన్ అధికారులు ఖాతరు చేయడం లేదన్న విమర్శలున్నాయి.

దీనికి అనేక ఉదాహరణలున్నాయి. 2008  నుంచి సీనియార్టీ జా బితాలో అన్నీ తప్పులు తడకలే. 2009లో ఈ జాబితాను అనుసరించి అనర్హులకు అక్రమ పదోన్నతులు ఇచ్చారు. వివిధ సబ్జెక్టుల్లో భారీ స్థాయిలో జరిగిన ఈ అక్రమ పదోన్నతులపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
 
 సీనియార్టీ జాబితా, ప్రమోషన్లపై
  బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్ అధికారులు లంచాల మత్తులో పడి హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదు. ఉదాహరణకు 2009లో ఫిజిక్స్‌లో స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్ల జాబితాలో ఐదుగురు ఉంటే అందులో ముగ్గురు మాత్రమే సీనియార్టీ జాబితాకు అర్హులు. మిగిలిన ఇద్దరు అనర్హులు. ఈ ఇద్దరికీ సాంఘిక సంక్షేమశాఖలో హెచ్‌డబ్ల్యూఓలుగా పదోన్నతి కల్పించారు. ఇందుకోసం భారీగా అధికారులు ముడుపులు తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల్లో కొందరు  కోర్టును ఆశ్రయించారు. 2006లో కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం శాశ్వత ఉద్యోగులుగా విలీనమైన  కార్పొరేషన్ ఉపాధ్యాయులకు అక్రమ డిప్యుటేషన్ చూపి సాంఘిక సంక్షేమ శాఖలో పదోన్నతి కల్పించారు. ఈ ఉద్యోగులకు డిప్యుటేషన్‌లో ఉన్నప్పుడు 12.5 శాతం ఇంటి అద్దెకు బదులు 20 శాతం చెల్లించారు. 2006, జూన్ 14న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో విలీనమైన ఈ ఉద్యోగులకు జీతభత్యాలు నగర పాలక సంస్థే చెల్లించింది. సుమారు రూ.6 లక్షలను సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న  ఉద్యోగులకు చెల్లించడంపై ఉన్నతాధికారులకు పలుమార్లు బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీనికి తోడు వీరి ఇంక్రిమెంట్లలో కూడా అధికారులు  చేతి వాటం ప్రదర్శించారు.
 
 ఎస్‌జీటీ కేడర్‌లో రూ.6195-రూ.13,945 వేతన శ్రేణి ఉన్న వారికి ప్రధానోపాధ్యాయ శ్రేణిలో ఇంక్రిమెంట్‌ను  రూ.18,030-రూ.43,630 మంజూరు చేశారు. 16 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేయక పోయినప్పటికీ 16 సంవత్సరాల టైమ్ స్కేలును మంజూరు చేయడంలో అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలయ్యాయి. చివరకు వార్డెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అక్రమ నియామకాన్ని రద్దు చేస్తూ న్యాయస్థానం ఓఏఎన్‌ఓ 1496/2010లో ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్ అధికారులు ఆ ఉత్తర్వులను సాంఘిక సంక్షేమ శాఖకు ఇంత వరకు పంపలేదు. నాలుగేళ్లుగా ఈ అక్రమ నియామకాల రద్దును కార్పొరేషన్ అధికారులు తొక్కి పెడుతున్నారు.
 
 అక్రమ పదోన్నతులను రద్దు చేయాలని, వారికి చెల్లించిన ఇంటి అద్దె, జీత భత్యాలను రికవరీ చేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోక పోవడం గమనార్హం. కార్పొరేషన్‌లో పనిచేస్తూ అక్రమ పదోన్నతులు పొంది, సాంఘిక సంక్షేమ శాఖలో విలీనమైనప్పటికీ కార్పొరేషన్ నుంచే జీతాలు పొందుతున్న వీరిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కోర్టు ఆదేశాలను పక్కదోవ పట్టిస్తూ వారికి కొమ్ము కాయడం వెనక లక్షల్లో చేతులు మారినట్టు బాధితులు ఫిర్యాదు చేయడంతో పాటు వివరాల కోసం సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. నాలుగేళ్లైనా  ఆర్‌టీఏ  చట్టం ప్రకారం సమాచారం ఇవ్వడానికి అధికారులు సుముఖంగా లేరు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సీనియార్టీ జాబితాలో అక్రమాలకు బలైపోయిన అర్హులు 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల పని తీరుపై ఉన్నత స్థాయి అధికారులు విచారించి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement