భూములు లీజుకిచ్చే హక్కు ఎవరిచ్చారు?
► ఇఫ్కోకు హైకోర్టు న్యాయమూర్తి అక్షింతలు
► తుది విచారణకు 28 కి వాయిదా
కొడవలూరు: భూములు లీజుకిచ్చే హక్కు మీకెవరిచ్చారని హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్‌తో కూడిన బెంచ్ ఇఫ్కో కిసాన్ సెజ్ అధికారులకు అక్షింతలు వేసింది. ఇఫ్కో కిసాన్ సెజ్‌కు భూమలు కోల్పోయిన రైతులు ఎకరాకు రూ.60 నుంచి రూ.70 లక్షల పరిహారమివ్వాలని హైకోర్టులో కేసు వేయగా విచారణకు స్వీకరించడం తెల్సిందే. అదేవిధంగా ఇఫ్కో కిసాన్ సెజ్‌లో కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటు చేసి పర్యావరణానికి హాని తెస్తున్నారని ముగ్గురు రైతులు హైకోర్టులో కేసు వేసి ఉన్నారు.
దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించి సెజ్‌లో ఎలాంటి పనులు చేపట్టరాదని స్టేటస్‌కొ ఇచ్చి ఉంది. పై రెండు కేసులపై రమేష్ రంగనాథన్ బెంచ్ మంగళవారం విచారించింది. ఈ విచారణకు ఇఫ్కో తరఫున గవర్నమెంట్ ప్లీడర్ మాట్లాడుతూ సెజ్‌పై ఉన్న స్టేటస్‌కోను ఎత్తివేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా సెజ్‌లోని భూములను ఏ హక్కుతో లీజుకిస్తున్నారంటూ ఇఫ్కో ప్రతినిధులకు చీఫ్ జస్టిస్ అక్షింతలు వేస్తూ స్టేటస్‌కోను 4 వారాలపాటు పొడిగించారు. ఈ కేసుతో పాటు పరిహారంపై వేసిన కేసును కూడా ఈ నెల 28 నుంచి తుది విచారణ చేసి తుది తీర్పు వెల్లడిస్తామని బెంచ్ ప్రకటించింది.