నిఘా నీడలో..
జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీన చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైకోర్టు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
సభ్యుల ప్రమాణస్వీకారం, కోఆప్షన్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఆదివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభమవుతుంది. ఎన్నికల సంఘం పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి రామాంజనేయులు నియమితులయ్యారు. ఎన్నికలను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని, విప్ ధిక్కరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. కమిషన్ సూచనల ప్రకారం జెడ్పీ సమావేశ మందిరంలో వేదికపై ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్న కలెక్టర్ శ్రీకాంత్‌తో పాటు పరిశీలకుడు రామాంజనేయులు మాత్రం కూర్చుంటారు.
ఎక్స్‌అఫిషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ముందు వరుసలో సీట్లు ఏర్పాటు చేశారు. కోఆప్షన్ సభ్యులకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. జెడ్పీటీసీ సభ్యులు పార్టీల వారీగా కూర్చునేలా బారికేడ్లు కట్టారు. అక్షర క్రమంలో సభ్యులకు సీట్లు కేటాయించారు. మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారిని అడ్డుకునేందుకు వీలు లేకుండా బారికేడ్లతో రక్షణ చర్యలు చేపట్టారు. సభ్యులు తమ గ్యాలరీలో నుంచే మద్దతు తెలపాలి.
ఒక పార్టీ సభ్యులకు, మరో పార్టీ సభ్యులు అందని విధంగా బారికేడ్లు ఏర్పాటయ్యాయి. సభ్యులను తమకు కేటాయించిన గ్యాలరీ నుంచి మరో గ్యాలరీకి అనుమతించరు. ఎవరైనా ఆ నిబంధనను ఉల్లంఘిస్తే వెంటనే సమావేశ మందిరం నుంచి బయటకు పంపే అధికారం అధికారులకు ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి అరగంట ముందు నుంచి పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని వీడియోతో చిత్రీకరిస్తారు. కోరం ఉన్నట్లయితే ఎన్నికల అధికారి ఎన్నికలను వాయిదా వేయడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలతోనూ చిత్రీకరించనున్నారు.
ప్రలోభపెట్టే ప్రయత్నాలు
హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించినా వైఎస్సార్‌సీపీ సభ్యులను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. కుటుంబసభ్యులు కనిపించడం లేదని వారి బంధువులతో ఫిర్యాదులు చేయిస్తున్నారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ సభ్యులు కిడ్నాప్‌కు గురైనట్లు వారి బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శనివారం ఇడుపులపాయ వెళ్లారు. అయితే తాము ఎలాంటి బలవంతాలు లేకుండా ఇక్కడకు వచ్చామని సభ్యులు స్పష్టం చేయడంతో పోలీసులు వెనుదిరిగినట్లు తెలిసింది.
విప్ ఉల్లంఘిస్తే వేటే: మేరిగ
హైకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతుండడంతో సభ్యులు ప్రలోభాలకు లొంగి, విప్ ఉల్లంఘిస్తే పదవి కోల్పోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ తెలిపారు.