ఇఫ్కో వివాదం హైకోర్టుకు! | IFFCO land issue reaches highcourt | Sakshi
Sakshi News home page

ఇఫ్కో వివాదం హైకోర్టుకు!

Published Mon, Oct 24 2016 1:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ఇఫ్కో వివాదం హైకోర్టుకు! - Sakshi

ఇఫ్కో వివాదం హైకోర్టుకు!

 
  • భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ రైతుల న్యాయపోరాటం
  • హైకోర్టులో నేడు పిటిషన్‌ 
  • రాచర్లపాడులో నేడు కలెక్టర్‌ విచారణ 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : 
కొడవలూరు మండలం రాచర్లపాడులోని ఇఫ్కో భూముల వివాదం హైకోర్టుకెక్కనుంది. చట్టానికి విరుద్ధంగా ఇక్కడ గమేసా, కోకోకోలా ఫ్యాక్టరీలకు కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయాలని రైతులు న్యాయపోరాటానికి దిగారు. రైతు సంక్షేమ కమిటీ అధ్యక్షుడు బెజవాడ గోవిందరెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు రాచర్లపాడులో సోమవారం సాయంత్రం ప్రజలతో విచారణ చేపట్టనున్నారు. 
2,776 ఎకరాల సేకరణ
రాచర్లపాడులో గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారం నిర్మాణం కోసం 1996లో ప్రభుత్వం 2,776 ఎకరాల భూములు సేకరించింది. ఇందులో కోవూరు శ్రీకోదండరామాలయానికి చెందిన 1009 ఎకరాలు, రైతులకు చెందిన 450 ఎకరాల పట్టా భూములతోపాటు అసైన్డ్, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. భూ సేకరణ అనంతరం ఎదురైన ఇబ్బందులవల్ల ఎరువుల కర్మాగారం నిర్మాణం అటకెక్కింది. ఆ తర్వాత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇఫ్కో భూముల్లో కిసాన్‌సెజ్‌ ఏర్పాటు చేయించారు. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పి ఈ ప్రాంత రైతులకు మేలు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను ఏర్పాటు చేయించడానికి రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంగిస్తూ తమ ప్రయోజనాలను కాపాడిన సంస్థలకు భూములను పందారం చేసింది. 
అనుమతిలేకుండానే గమేషా నిర్మాణం
కిసాన్‌సెజ్‌ నిబంధనల ప్రకారం ఇక్కడ ఏర్పాటుచేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం నీరు, విద్యుత్, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించాలి. ఇక్కడ ఏ పరిశ్రమ స్థాపించాలన్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌ మంత్రిత్విశాఖ ఆధీనంలో పనిచేసే సెజ్‌ పరిశ్రమల అనుమతుల బోర్డు మాత్రమే ఆమోదం తెలపాలి. అయితే ఇక్కడ నిర్మించిన గమేషా ఫ్యాక్టరీకి పంచాయతీ అనుమతిగానీ, ఎస్‌ఈజడ్‌ బోర్డు అనుమతిలేకుండానే భారీ భవనాలు నిర్మించి ఉత్పత్తులు కూడా బయటకు తెచ్చింది. ఈ పరిశ్రమకు ఇఫ్కో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా 150 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేశారని రైతు సంఘాలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల రైతులు ఆందోళనలకు దిగారు. సెజ్‌ పరిధిలోని రాచర్లపాడు గ్రామానికి సంబంధించిన 45 ఎకరాల చెరువు కూడా ఈ పరిధిలోనే ఉంది. ఎంతో కాలంగా చెరువు నీటిని ఉపయోగించుకుని ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ చెరువులో చేప పిల్లలను వదిలి వాటిని వేలం వేసి ఆదాయం సమకూర్చుకుంటుంది. ఇఫ్కో అధికారులు ఆ గ్రామ ప్రజలను కూడా చెరువు పరిధిలోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ విషయమై ఇటీవల ఇఫ్కో అధికారులు రాచర్లపాడు ప్రజలకు మధ్య ఘర్షణ జరిగి పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. తమ ప్రాంతంలో తమ భూములు వాడుకొని తమ నీరు వాడుకుంటూ రైతుల బతుకులతో చెలగాటమాడుతున్న ఫ్యాక్టరీని ఎత్తివేయాలంటూ రైతులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇదే విషయమై ఇటీవల కలెక్టర్‌ వద్ద ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. రైతులు సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయడంతో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 
కోకోకోలా గరళమే
కిసాన్‌సెజ్‌లో కోకోకోలా తన యూనిట్‌లను నెలకొల్పడం కోసం ప్రభుత్వం నుంచి 300 ఎకరాలు భూములను తీసుకుంది. ఇందులో 50 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకుంది.  ఇక్కడ ఐదు దశల్లో పరిశ్రమలను విస్తరించి భారీ ఎత్తున ఉత్పత్తులు బయటకు తేవడంకోసం 7 టీఎంసీల నీరు అవసరమవుతాయని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. కనిగిరి రిజర్వాయర్‌ ద్వారా ప్రత్యేక పైప్‌లైన్‌ నిర్మించి 7 టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో లక్షా 50వేల ఎకరాల ఆయకట్టులో పంటలు పండేంత నీరు కోకోకోలా ఫ్యాక్టరీకి కేటాయించాల్సి వస్తోంది. ఈ నిర్ణయంపై రైతు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపై కూడా న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇఫ్కో కిసాన్‌సెజ్‌కు అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్‌ చేసిన శ్రీకోదండరామస్వామి ఆలయానికి చెందిన 1009 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌లు చెల్లుబాటుకావని వాటిని రద్దు చేయాలని దేవాదాయశాఖతోపాటు రైతు సంఘాలు కూడా కోర్టును కోరనున్నాయి. ఈ నేపథ్యంలో ఇఫ్కో వివాదం వేడెక్కింది.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement