న్యాయవాది సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిషత్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలను హైకోర్టుకు విన్నవించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్‌యత్నం జరిగింది. ఈ నెల 5న జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గొడవలు సృష్టించి, ఎన్నికలను వాయి దా వేయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్నిక నిర్వహణకు కోర్టు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని, ఎన్నికలు సజావుగా జరపాలని ఆదేశాలు పొందారు.
ఈ కేసును ప్రజాహిత వ్యాజ్యంగా దాఖలు చేసిన న్యాయవాది సుధాకర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జెడ్పీ ఎన్నికలు ఈ నెల 13న జరగాల్సి ఉండగా, ఆ రోజు కూడా టీడీపీ సభ్యులు సభలో గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన బుధవారం కోర్టులో తన వాదనను వినిపించాల్సిఉంది. సాక్షాత్తు పోలీసులే సుధాకర్‌రెడ్డి ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తాను హైకో ర్టు నుంచి వెళుతుండగా, ఒక ఇన్నోవా కారు వెంటాడినట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు.
దీంతో ఆయన తన కారు దిగి విచారించగా నెల్లూరు డీఎస్పీ రాంబాబుకు చెందిన వారమని పేర్కొన్నట్టు తెలిపారు. తనను ఇన్నోవా కారులో తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. తాను ప్రతిఘటించడంతో పాటు ఆ ప్రాంత వాసులు గుమికూడటంతో ఇన్నోవా కారులోని వ్యక్తులు పారిపోయినట్లు సుధాకర్‌రె డ్డి వివరించారు. దీంతో సుధాకర్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడంపై జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా గర్హించారు. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, అధికారులను కూడా ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతోందన్నారు.
జెడ్పీ కోసం ఇన్ని దారుణాలా..?
జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో కొందరిని తమ వైపునకు తిప్పుకున్నారు. ఇప్పటి వరకు భయపెట్టి, ప్రలోభాలకు గురి చేశారు. ఇప్పుడు న్యాయవాదిని కిడ్నాప్ చేయడానికి సాహసించారు. టీడీపీ అరాచకాలు ఎంతో కాలం సాగవు.
-మేరిగ మురళీధర్, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్