‘మెంటల్ పోలీస్’పై స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీకాంత్ హీరోగా నటించిన మెంటల్ పోలీస్’ సినిమా విడుదలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ సినిమా విడుదలపై రెండు వారాల పాటు స్టే విధించింది. ఈ సినిమా విషయంలో పిటిషనర్ సమర్పించే వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సెన్సార్‌బోర్డ్ ప్రాంతీయ అధికారిని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సెన్సార్‌బోర్డు ప్రాంతీయ అధికారి, మెంటల్ పోలీస్ దర్శక, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మెంటల్ పోలీస్ సినిమా టైటిల్ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ సినిమా విడుదలకు దృవీకరణ పత్రం ఇవ్వకుండా సెన్సార్‌బోర్డు అధికారులను ఆదేశించాలని కోరుతూ నెల్లూరు పోలీసు అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు యడ్ల శ్రీహరిబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, మెంటల్ పోలీస్ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు పిటిషనర్ మార్చి 23న వినతి పత్రం సమర్పించారని తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి స్పందలేదన్నారు. ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్టను దిగజార్చేలా సినిమా పేరు ఉందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, మెంటల్‌పోలీస్ సినిమా విడుదలపై రెండు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.