బరితెగింపు | Composition of the ruling party made ​​up the village. | Sakshi
Sakshi News home page

బరితెగింపు

Published Mon, Jul 14 2014 3:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

బరితెగింపు - Sakshi

బరితెగింపు

 పక్కా స్కెచ్‌తో
 జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు పోలీసు అధికారుల అండతో పక్కా స్కెచ్ అమలు చేశారు. వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చిన ఇందుకూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణయ్య, కావలి రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసుల దెబ్బకు వెంకటరమణయ్య ఎన్నికకే దూరం కాగా ఆదివారం ఉదయం జెడ్పీ సమావేశ మందిరానికి వచ్చిన పెంచలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్బంధించి బెదిరించడంతో ఆమె కూడా ఎన్నికకు దూరమయ్యారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యుల బలం 24 నుంచి 22కి చేరింది. అటు టీడీపీ సభ్యుల బలం 22 కావడంతో ఇరు పార్టీల సభ్యుల సంఖ్య సమానమైంది. అప్పటికీ లాటరీ నిర్వహించి ఎన్నిక జరిపే అవకాశమున్నా కోరం లేదంటూ కలెక్టర్ వాయిదా వేశారు.
 
 సాక్షి, నెల్లూరు: అధికార పార్టీ ఆగడాలకు పోలీసు జులుం తోడైంది. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకుంది. మొత్తం మీద ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. సభలో 44 మంది సభ్యులున్నప్పటికీ కోరం లేదంటూ కలెక్టర్ శ్రీకాంత్ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు పార్టీల బలం సమానంగా ఉంటే టాస్ వేసి చైర్మన్  ఎన్నిక నిర్వహించే అవకాశమున్నా, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి ఏకంగా వాయిదా వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
 సభాపర్వం రసాభాస ఆదివారం రెండో మారు జరిగిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది.
 
 ఎన్నికల సంఘం పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి రామాంజనేయులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.40 గంటలకు వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ సమావేశమందిరానికి చేరుకున్నారు. అనంతరం టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ,పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సమావేశం ప్రారంభమైంది.
 
 వేర్వేరుగా గ్యాలరీలు
 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జెడ్పీ సమావేశ మందిరంలో 31 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులకు ఓ వైపు, 15 మంది టీడీపీ సభ్యులకు మరోవైపు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అయితే టీడీపీకి మద్దతు పలుకుతున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎటువైపు కూర్చోవాలనే సమస్య తలెత్తింది. ఎన్నికల నిబంధనల మేరకు టీడీపీ మద్దతు పలికినా వైఎస్సార్‌సీపీ సభ్యులు కూర్చున్న వైపే కూర్చోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు మద్దతు పలుకుతున్న సభ్యులు వైఎస్సార్‌సీపీ సభ్యుల వద్ద కూర్చునేది లేదంటూ వారు గొడవకు దిగారు. కలెక్టర్ పదేపదే చెప్పినా  వినిపించుకోలేదు. ఓ దశలో అటువైపు కూర్చోకుంటే బయటకు వెళ్లిపొమ్మంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సభ్యులు వెళ్లకుండానే ఆందోళన కొనసాగించారు.
 
 మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశం అరుపులు, కేకలతో రసాభాసగానే సాగింది. తమకు స్పష్టమైన మెజార్టీ ఉందని ఎన్నికను తక్షణమే నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. పెంచలమ్మను తక్షణం సమావేశానికి రప్పించాలని పదేపదే కోరారు. చివరకు కలెక్టర్  పెంచలమ్మను తీసుకురావాలని ఎస్పీని ఆదేశించారు. ఎట్టకేలకు ఎస్పీ పోలీసుల బందోబస్తు మధ్య పెంచలమ్మను సభలో ప్రవేశపెట్టారు. తన ఆరోగ్యం బాగాలేదని తాను ఏమీ మాట్లాడలేనని పెంచలమ్మతో చెప్పించిన పోలీసులు ఆమెను ఒక్క నిమిషం కూడా అక్కడ ఉంచకుండా తీసుకెళ్లి స్వామిభక్తి చాటుకున్నారు.  
 
 అప్పటివరకు ప్రమాణస్వీకారం కార్యక్రమం కూడా పూర్తి కాలేదు. దీంతో 3 గంటల ప్రాంతంలో  వైఎస్సార్‌సీపీ సభ్యుల సంతకాలు సేకరించిన కలెక్టర్ 22 మంది ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎన్నిక నిర్వహించేందుకు కోరం సరిపోకపోవడంతో  టీడీపీ సభ్యులు సైతం సంతకాలు చేయాలని కలెక్టర్ కోరారు. అయితే వారు అంగీకరించలేదు. దీంతోవైఎస్సార్‌సీపీ సభ్యులు కేవలం 22 మంది మాత్రమే ఉన్నందున కోరం సరిపోదని ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ శ్రీకాంత్ ప్రకటించి ఎన్నికల పరిశీలకుడు రామాంజనేయులుతో సహా వెళ్లిపోయారు. ఎన్నిక వాయిదా వేయించామన్న ఆనందంలో టీడీపీ నేతలు, జెడ్పీటీసీ సభ్యులు  కేకలు పెడుతూ బయటకు వెళ్లారు.
 
 పోలీసుల హైడ్రామా...
 జిల్లా పరిషత్ ఎన్నికను  మరో మారు వాయిదా వేయించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఆది నుంచి అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. కావలి రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను అధికారపార్టీ నేతలకు అప్పజెప్పేందుకు పక్కా పథకం అమలు చేశారు. పెంచలమ్మ వచ్చేసరికి ఆమె కుటుంబసభ్యులను కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు. ఆమె వాహనం దిగగానే అదుపులోకి తీసుకుని కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లోకి తీసుకెళ్లారు. ఆమెపై తీవ్రస్థాయిలో ఒత్తిడితెచ్చి అధికారపార్టీకి మద్దతివ్వాలని నచ్చజెప్పారు. కాదంటే అంతు తేలుస్తామని బెదిరించారు. కుటుంబసభ్యులతో రెండుగంటలపాటు మాట్లాడించారు. టీడీపీ వైపు నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందామని  కుటుంబసభ్యులు పెంచలమ్మ కాళ్లవేళ్లా పడ్డారు. టీడీపీకి జై అంటే అందరం బాగుపడతామంటూ వేడుకున్నారు. అప్పటి వరకు ప్రాణం పోయినా వైఎస్సార్‌సీపీని వదిలేదిలేదన్న పెంచలమ్మ మనస్సు మార్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement